
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేసిన హరిబాబు రెండు రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి హరిబాబు రాజీనామా చేసి ఉంటారనే వాదన బలంగా వినిపించింది. అయితే మిత్రపక్షం టీడీపీతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారనేవి మరో వాదన. 2014 జనవరిలో పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది.
కాగా, ఈ రోజు సాయంత్రానికి ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం కన్పిస్తోంది. అధ్యక్ష పదవి కోసం అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి నలుగురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. సోమువీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment