సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధినాయకత్వం నియమించినట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా పోరాటం ముమ్మరం కావడం, బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పడం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. హరిబాబు స్థానంలో ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. శుక్రవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.
పార్టీని దూకుడుగా నడిపించే వ్యూహంలో భాగంగా సోము వీర్రాజుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి.. పార్టీ విధేయుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అనేక ఏళ్ళుగా బీజేపీలో పనిచేస్తున్న అనుభవం కూడా కలిసివచ్చినట్టు భావిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబును ఇప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యునిగా అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బీజేపీలో ఫైర్‌బ్రాండ్ నేత సోము వీర్రాజు పేరొందారు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ మొదటినుంచి ఆ పార్టీపై, సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనలోని అవినీతిని, అవకతవకలను సోము వీర్రాజు ఎండగడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీని, చంద్రబాబును మరింత ఇరకాటంలో నెట్టేందుకు, ఏపీలో బీజేపీని బలమైన పార్టీగా నిలబెట్టేందుకు ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారని కమలం వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment