
సీబీఐ విచారణకు ఆదేశించాలి
చంద్రబాబుకు బొత్స డిమాండ్
సాక్షి, హైదరాబాద్ : విశాఖపట్టణం భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తును ఆదేశించిన తీరు చూస్తూంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చి నట్లుగా ఉందని ఈ భారీ కుంభకోణంలో సిట్ విచారణతో ప్రయోజనం ఏ మాత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. కచ్చితంగా ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని, ఇందులో సూత్రధారులు, పాత్రధారుల బండారం బయట పడుతుందని ఆయన అన్నారు.
సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణాన్ని ఓవైపు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నం చేస్తూనే మరో వైపు సిట్ వేయడం చూస్తూంటే ఈ అంశంపై ప్రజలతో పాటు మంత్రులు, టీడీపీ భాగస్వామి అయిన బీజేపీ నేతల్లో కూడా అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయన్నారు.