
ముద్రగడ ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కిర్లంపుడి: కాపుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముద్రగడ దీక్ష మూడోరోజుకు చేరుకోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో పోలీసులు దీక్షను భగ్నం చేస్తారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా ఆయన మద్దతుదారులు కార్లు, వాహనాలు అడ్డుపెట్టారు. ఈ కార్లు తొలగించేందుకు పోలీసులు యత్నిస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాపు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ముద్రగడ దంపతులను కోరగా.. అందుకు వారు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.
దాంతో ఫ్యామిలీ డాక్టర్లతోనైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. లేదంటే చర్యలు వేరేవిధంగా ఉంటాయని వారికి జేసీ సూచించినట్టు తెలిసింది. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరిన సంగతి తెలిసిందే.