జేసీతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి తదితరులు
అనంతపురం అర్బన్: ‘‘హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ కింద 60,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు చేయడం ఏమిటి. చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్న కాంట్రాక్టరుపైన, ప్రశ్నించిన రైతులపై దౌర్జన్యం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నీరు రావాలని మేమంతా పోరాటం చేసిన వారిమే. అయితే అది చట్టపరంగా జరగాలే తప్ప ఇలా చట్ట విరుద్ధంగా.. రైతులకు ఆందోళనకు గురిచేసే విధంగా కాదు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేసి, పరిహారం ప్రకటించి రైతులకు భరోసా కల్పించండి.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి.. జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావును కోరారు. జాయింట్ కలెక్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, రైతులు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు.
పరిహారం ఇవ్వకుండానే 36వ ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతుండడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పరిహారం చెల్లించకుండా పనులు ముందుకు సాగనివ్వమంటూ బాధిత రైతులు చెబితే.. స్థానిక రాజకీయ నాయకులు, కొంత మంది వారిని భయపెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారిగా మీరు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారం మేరకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 36వ ప్యాకేజీ పనులను చట్టవిరుద్ధంగా చేపట్టిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులు మూకుమ్మడిగా పనులను అడ్డుకుంటారని, తద్వారా చట్టపరమైన అవరోధాలు తలెత్తితే, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
కరువు జిల్లాగా ప్రకటించాలి
జిల్లా మొత్తం కరువు నెలకొన్నప్పటికీ కేవలం 44 మండాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం సరైన విధానం కాదని, జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి కోరారు. 2014 నుంచి రాయలసీమ ప్రాంతం కరువుతో విలవిల్లాడుతోందన్నారు. రైతులు, రైతు కూలీలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. ఆ కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిల్లాలో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు.
–ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment