బషీరాబాద్(రంగారెడ్డి): రైతుల వద్ద నుంచి డబ్బు తీసుకొని పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వారిని వేధిస్తున్న వీఆర్వోను జాయింట్ కలెక్టర్ అలుగు వర్షిని సస్పెండ్ చేశారు. శుక్రవారం బషీరాబాద్ తాహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ఈ క్రమంలో వీఆర్వో రవి రూ. 3000 డబ్బు తీసుకొని ఇప్పటివరకు టైటిల్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడనికంసన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు నర్సప్ప జేసీకి ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు చిన్న వెంకటప్ప నుంచి రూ. 2000 తీసుకొని పట్టా పుస్తకాలు ఇవ్వడంలేదని జేసీకి విన్నవించుకున్నాడు. స్పందించిన జేసీ వీఆర్వో రవిని సస్పెండ్ చేశారు.