
భూమి సమస్యల్ని పరిష్కరిస్తా
జిల్లాలో భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని కొత్త జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు.
కోటగుమ్మం (రాజమండ్రి) : జిల్లాలో భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని కొత్త జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముహుర్తం సమయానికి బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాకు జేసీగా రావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఆర్డీఓగా, జెడ్పీ సీఈఓగా, డ్వామా పీడీగా పనిచేసిన అనుభవంతో మరింత సమర్థంగా పరిపాలన సాగేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో భూమి రికార్డులు కంఫ్యూటరీకరణలో, ఆధార్ అనుసంధానంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని, చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులన్నీ అర్హులకు అందేలా చూస్తానన్నారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, భక్తుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్‌లు నిర్మిస్తామని చెప్పారు.
పలువురి అభినందన
జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు పలువురు రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు, సివిల్ సప్లయిస్ డీఎం టి.వి.ఎస్.జి.కుమార్,డీఎస్‌ఓ జి.ఉమామహేశ్వరరావు, రామచంద్రపురం, రంపచోడవరం ఆర్డీఓలు కె.సుబ్బారావు, బి.శంకర్ వరప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వై.రాధాకృష్ణమూర్తి, రాజమండ్రి అర్బన్ తహశీల్దార్ పి.వి.వి.గోపాల కృష్ణ, రూరల్ తహశీల్దార్ జి.భీమారావు, ఎంఎస్‌ఓ క్రాంతిప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ కిషోర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు.