
రుయాలో వెంకటేశ్వర్లు మృతదేహం
చిత్తూరు , తిరుపతి అర్బన్ : జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి తిరుపతి పరిధిలోని కరకంబాడి రోడ్డులో జరిగింది. ఈ ఘటనలో తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రాత్రి రుయాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి రుయావద్ద మృతుని కుటుంబ సభ్యులు, తిమ్మినాయుడుపాలెం స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర్లు కరకరంబాడి రోడ్డు పక్కన చిల్లర కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుమలలో గరుడసేవ కారణంగా అవసరమైన ఇంటి వస్తువులు, పూజాసామగ్రి కొనుగోలు చేసేందుకు ఇంటికి బయలుదేరారు.
ఈ తరుణంలో కరకంబాడి మెయిన్ రోడ్డునుంచి తిమ్మినాయుడు పాలెంకు వెళ్లే దారివద్ద జేసీ వాహనం ఢీకొనడంతో వెంకటేశ్వర్లు తలకు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపుమడుగులో పడి అక్కడే మరణించాడు. అయితే జేసీ వాహనం కరకంబాడి వైపునుంచి తిరుపతికి చాలా స్పీడ్‌గా, దురుసుగా వెళ్లడం వల్లే ప్రమాదం తీవ్రమై వెంకటేశ్వర్లు ప్రాణాలు విడిచాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రెండు నెలల క్రితం కూడా జేసీ వాహనం పుత్తూరు వద్ద రోడ్డుపై వెళ్తున్న స్కూల్ పిల్లాడిని ఢీకొట్టి మరణానికి కారణమైంది. అయితే ఆరోజు వాహనం నడిపిన డ్రైవరు, మంగళవారం రాత్రి కరకంబాడి రోడ్డులో వాహనం నడిపిన డ్రైవరూ ఒకరేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వెంకటేశ్వర్లు మృతితో అతని భార్య రాధ, ఎనిమిదేళ్ల కొడుకు గణపతి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.