మాటకు ‘కట్టుబడి’..
♦ పక్కా ప్రణాళికతో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు నెలలో పూర్తి చేసి తీరుతాం..
♦ ఆన్‌లైన్‌లో సాదాబైనామాలు ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయం
♦ ‘సాక్షి’తో జిల్లా జాయింట్ కలెక్టర్ మాటామంతీ
‘‘నేను వచ్చిన కొత్తలోనే అనంతసాగర్ భూములపై ‘సాక్షి’లో వేసిన వరుస కథనాలు చదివాను. చాలా మంచి ప్రయత్నం.. తరువాత మిగిలిన పత్రికలు కూడా రాసినట్టున్నాయి. 15 రోజుల్లో అనంతసాగర్ గిరిజనులకు అసైన్డ్ భూముల్లో పట్టాలిస్తాం. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తయింది. అటవీ భూములను గుర్తించి మార్కింగ్ పెట్టాం. లబ్ధిదారులను గుర్తించాలని మెదక్ ఆర్డీవో నగేష్‌ను ఆదేశించాం. ఆయన చాలా పట్టుదలతో అసైన్డ్ భూములను, లబ్ధిదారులను గుర్తించారు. పట్టాలను సిద్ధం చేస్తున్నాం. మంచిరోజు చూసి పట్టాలు పంపిణీ చేస్తాం’’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవేవీ అద్భుత కట్టడాలు కావు.. అయినా అవి చరిత్రలో నిలబడనున్నాయి. ఆయనేమీ ఇటుకలు పేర్చలేదు.. ఇంటింటికీ నగిషీలు చెక్కలేదు. కానీ అందరూ ఆయన్నే శిల్పి అంటున్నారు. అంత అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడి జనాలు ఐదు ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకుంటే.. అందులో మొదటి మూడు అక్షరాలు.. కేసీఆర్, మిగిలిన రెండక్షరాలు.. జేసీ అని వల్లిస్తున్నారు. ఎర్రవల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు కేసీఆర్ జీవం పోస్తే.. జేసీ రూపమిస్తున్నారు. రూ 5.4 లక్షల్లో ఒక్క పైసా కూడా వృథా చేయకుండా ఇచ్చిన మాటకు ‘కట్టుబడి’ చేసి చూపిస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లకు తొవ్వజూపేలా ఎర్రవల్లిలో ఇళ్లను నిర్మిస్తున్న జేసీ (జాయింట్ కలెక్టర్), ఎర్రవల్లి డబుల్ బెడ్రూం పథకం ప్రత్యేక అధికారి వెంకట్రామిరెడ్డితో ‘సాక్షి’ ముఖాముఖీ..
సాక్షి: గృహ ప్రవేశం ఎప్పుడు సార్?
జేసీ:ముహూర్తం ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. మేం మాత్రం ఆగస్టు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఎర్రవల్లిలో 330, నర్సన్న పేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఒకేసారి పూర్తి చేస్తున్నాం. నిజానికి ఇలాంటి పథకాల పూర్తికి రెండు నుంచి మైడేళ్ల వ్యవ ధి పడుతుంది. కానీ సీఎం ప్రోత్సాహంతో కలెక్టర్, నేను, ఇతర అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్, భవన నిర్మాణ కార్మికులు సమష్టిగా పని చేశాం. 8 నెలల్లోనే పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లో, సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడం సంతోషంగా ఉంది.
సాక్షి: కాంట్రాక్టర్‌ను ఎలా ఒప్పించారు?
జేసీ: ఉద్యోగికైనా, కాంట్రాక్టర్‌కైనా, సగటు మనిషికి ఎవరికైనా సోషల్ రెస్పాన్స్‌బిలిటీ అవసరం. ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌కు పదేపదే చెప్పింది ఇదే. ఆయన ఆ స్పృహతోనే పని చేయడంతోనే ఇళ్లు కట్టగలుతున్నాం. ఇక లాభాలంటారా! అన్ని పనులనూ లాభనష్టాలతో ముడి పెట్టలేము. కాంట్రాక్టర్ పది పనులు తీసుకుంటే ఆరు పనుల్లో లాభాలు రావటం, ఒకటి రెండు పనుల్లో గిట్టుబాటు లేకపోవటం, ఇంకొన్నింట్లో నష్టం రావటం సర్వసాధారణం. డబుల్ బెడ్రూం పనుల్లో కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాకపోవచ్చేమో కానీ, సామాజిక బాధ్యతతో పని చేశారనే గుర్తింపు దక్కుతుంది కదా!
సాక్షి:ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉంది?
జేసీ: పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్లకు వైట్ పాలిష్ చేస్తున్నాం. ఇంకొన్నిటికి కరెంటు వైరింగ్ వర్క్ నడుస్తోంది. మిగతా అన్ని పనుల్ని నెల రోజుల్లో పూర్తి చేస్తాం.
సాక్షి: జనాలు మిమ్మల్ని ‘జేసీబీ’ అంటారు కదా!
జేసీ: (చిరునవ్వుతో) మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు.
సాక్షి:మీకు కూల్చడమే తెలుసు కదా? ఎర్రవల్లి ప్రజలేమో నిర్మాతగా అభివర్ణిస్తున్నారు?
జేసీ: నిజానికి నన్ను ‘జేసీబీ’ అంటారని మీరు చెప్పే వరకు నాకైతే తెలియదు. పటాన్‌చెరు మండలం శెట్టికుంట, జిన్నారం మండలం దాచారంలో కూలగొట్టిన అక్రమ కట్టడాల గురించి ఇలా అంటున్నారనుకుంటా. నేను జేసీగా చార్జ్ తీసుకున్న కొత్తలోనే ఆ రెండు పనులు పూర్తి చేశాం. ఎంత దుర్మార్గమండీ.. చెరువులను కబ్జాపెట్టి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఇక దాచారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేనప్పుడు ఈ సీటులో ఉండి ప్రయోజనం ఏముంది. ప్రజా ఆస్తులను కాపాడే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.
సాక్షి: మిలటరీ తరహాలో ఆపరేషన్ పూర్తి చేశారు కదా?
జేసీ: అవును. ఆర్భాటపు ప్రచారం లేకుండా పూర్తి చేశాం. శెట్టికుంట మీద దాదాపు 15 రోజులకు పైగా ప్రతి అంశాన్ని అధ్యయనం చేశాం. పక్కా చెరువు భూమిలో దర్జాగా ఇళ్లు నిర్మించేశారు. బిల్డర్ ఎక్కడా చట్టాన్ని గౌరవించలేదు. రాత్రి 12 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసి తెల్లారే సరికి ముగించేశాం. దీనికి ఇంకో కారణం ఉంది. కూల్చివేతకు ఎక్కువ సంఖ్యలో జేసీబీలు అవసరం. ఆ టైంలో అనుకున్నన్ని జేసీబీలు దొరకడంతో పని సులభమైంది. ప్రభుత్వ, శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమే.
సాక్షి:సాదా బైనామా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు?
జేసీ: ఇప్పటి వరకు 62 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అన్నిటినీ పూర్తిగా అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ చేస్తున్నా. దాని ద్వారా నోటీసులు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 48 వేల దరఖాస్తులకు పరిష్కారం చూపించగలిగాం. సాదాబైనామాల భూములను పట్టా చేయడంలో పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరిస్తున్నాం.