
అగ్రస్థానమే లక్ష్యం
– క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యత
– అందరి సహకారంతో ముందుకు
– జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ టీకే రమామణి
అనంతపురం అర్బన్ : ప్రజలకు సత్వరమే మెరుగైన సేవలందేలా చూడడం, రెవెన్యూపరంగా జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ టీకే రమామణి అన్నారు. ఆ దిశగానే తన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. టూరిజం శాఖలో ఓఎస్‌డీగా ఉన్న రమామణిని జిల్లా జేసీగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఆమె శుక్రవారం కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రజలందరి సహకారంతో ముందుకు వెళతానన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటానని, వాటిని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. 1990లో గ్రూప్–1కు ఎంపికైన తాను ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పనిచేశానన్నారు. 2009లో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా జిల్లాలో ఐదు నెలలు పనిచేసినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో వచ్చిన సాధారణ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగానూ విధులు నిర్వర్తించానన్నారు. జిల్లాపై కొంత మేర అవగాహన ఉందన్నారు. వెబ్‌లాండ్‌లో భూమి వివరాల నమోదులో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.