
సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్‌రాంరెడ్డి
- ఆధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు
సంగారెడ్డి టౌన్: ప్రతి నెలా 15లోపు రేషన్ కార్డుదారులకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. ప్రతి నెలా ఒకటిలోగా చౌక ధరల దుకాణాలకు సరుకులు చేరాలన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలను అధికారులకు సూచించారు. చౌకధరల దుకాణ డీలర్లు సమయ పాలన పాటిస్తూ అవకతవకలకు ఆస్కారం లేకుండా కార్డు దారులకు సరుకులు అందించేందుకు డివిజను సహాయ పౌర సరఫరాల అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు.
చౌకధరల దుకాణాలపై ముమ్మరంగా దాడులు జరిపి అక్రమాలకు పాల్పడిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెలా విధిగా 16న సంబంధిత మండలాలలో డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ముగింపు నిల్వలు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాన్నారు. ప్రతినెలా 18న సంబంధిత సహాయ పౌరసరఫరాల అధికారులు, డీటీ(సీఎస్)లు విధిగా ముగింపు నిల్వల నివేదిక, 22న డీలర్లు రిలీజు ఆర్డర్ల నివేదికతో తాను నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని అన్నారు.
ప్రతినెలా 5న గోదాం ఇన్‌చార్జులు.. సరుకుల సరఫరా ముగింపు నివేదికతో తాను నిర్వహించే సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ నెల 8 లోగా పౌరసరఫరాల సంస్థ ద్వారా సరఫరా చేయుచున్న అన్ని వాహనాలకు స్టేజి1, స్టేజి2లకు గ్లోబల్ పోజిషనింగ్ సామగ్రిని అమర్చవలసిందిగా ఆదేశించారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. సమీక్షలో జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అధికారులందరూ పాల్గొన్నారు.