పోలీసులు వేధిస్తున్నారు : బాధిత కుటుంబం
వివరాలు.. చీరాల్లోని కొత్తపేట ఆటోనగర్‌లో అనప కుసుమ అనే కుటుంబం ఉంది. కుసుమ భర్త ప్రభాకరరావు పదకొండేళ్ల క్రితం మరణించాడు. వారసత్వంగా వచ్చిన నాలుగున్నర ఎకరాల ఇసుక నేలలో ఇళ్లు కట్టుకుని మిగిలిన భూమిలో వేరుశనగ సాగు చేసుకుంటూ ఆ కుటుంబం జీవిస్తోంది. అయితే ఆ భూమిపై కన్నేసిన కొందరు ఎలాగైనా దక్కించుకోవాలని పతకం పన్నారు. లొంగకపోవడంతో పోలీసులను ప్రయోగించారు. చివరకు పోలీసుల వేధింపులు భరించలేని కుసుమ, తన ఇద్దరు కుమార్తెలు మీనాక్షి, స్వాతి, కుమారుడు నరేష్‌తో కలిసి మీ కోసంలో ఫిర్యాదు చేసేందుకు ఒంగోలు వచ్చింది.
మీనాక్షి దివ్యాంగురాలు కావడంతో తమ్ముడు నరేష్ వీపుపై మోసుకుంటూ జేసీ వద్దకు చేరుకున్నాడు. తనను, తన కుటుంబాన్ని పోలీసులు ఏ విధంగా వేధిస్తున్నారో జేసీకి నరేష్ చెబుతుండగా దివ్యాంగురాలు మీనాక్షి తన చేతిలో ఉన్న పురుగుల మందు బాటిల్‌ను జేసీ టేబుల్‌పై పెట్టడంతో కలకలం రేగింది. జాయింట్ కలెక్టర్ దఫేదారు పురుగుల మందు బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించగా వారి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. చివరకు ఆ బాటిల్‌ను జేసీ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దొంగతనాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ పోలీసులు తనను కొట్టి ఒప్పిస్తున్నారని నరేష్ విలేకర్ల వద్ద వాపోయాడు.
విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు 70 సవర్ల బంగారాన్ని దొంగతనం చేసినట్లు తనను కొట్టి సంతకం చేయించారన్నాడు. తనకు సంబంధం లేకపోయినప్పటికీ దొంగతనాలకు సంబంధించి పది కేసులు పెట్టారని చెప్పాడు. ఈపూరుపాలెం ఎస్‌ఐగా పనిచేసిన హైమారావు తనను వేధించాడని తెలిపాడు. పోలీసుల వేధింఫులు తట్టుకోలేక తాను హైదరాబాద్, కర్నూలు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పనిచేసినట్లు చెప్పాడు. ఇంట్లో ఏకైక మగదిక్కు కావడంతో తాను ఇంటికి వస్తే.. తిరిగి వేధింపులు మొదలయ్యాయని నరేష్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.