– గృహ నిర్మాణ శాఖ పనితీరుపై జేసీ అసహనం
– పద్దతులు మార్చుకోవాలంటూ అధికారులకు చురక
– నిర్లక్ష్యం వీడకుంటే ఇంటికెళతారంటూ హెచ్చరిక
– పేదల సొంతింటి కలను సాకారం చేయాలని హితవు
అనంతపురం సిటీ: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యతను ఆ శాఖ అధికారులు, సిబ్బంది మరిచారు. గృహాల మంజూరు, నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదంటూ జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్ధీన్ అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణశాఖ ఇఇలు, డిప్యూటీ డీఇలు, ఏఇలతో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా ఆ శాఖ అధికారుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు. తక్షణం అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు అందించాలన్నారు.
ఆఖరి స్థానంలో ‘అనంత’
గృహ నిర్మాణాల్లో అనంతపురం జిల్లా చాలా వెనుక బడి ఉందని జేసీ స్పష్టం చేశారు. గ్రామీణ గృహ నిర్మాణ శాఖా మంత్రి సొంత జిల్లాలో ఇంతటి దుస్థితి ఉందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇందుకు అధికారులే కారకులవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం పథకం కింద ఆయా నియోజకవర్గాల్లో నిర్ధేశించిన మేరకు పునాదులు వేయించాలని సూచించారు. 2017-19 వరకు జిల్లాకు 29,500 గృహాలు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 31 లోపు కేటాయింపులన్నీ వంద శాతం పూర్తి కావాలని అదేశించారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ సి.వి.ప్రసాద్, పెనుకొండ ఇఇ చంద్రమౌళీ రెడ్డి, ధర్మవరం ఇఇ శేషుబాబుతో పాటు ఆయా డీఇలు, ఏఇలు పాల్గొన్నారు.
లాస్ట్ వార్నింగ్!
Published Fri, Aug 18 2017 10:21 PM | Last Updated on Tue, Sep 12 2017 12:25 AM
Advertisement