Housing employees
-
లాస్ట్ వార్నింగ్!
– గృహ నిర్మాణ శాఖ పనితీరుపై జేసీ అసహనం – పద్దతులు మార్చుకోవాలంటూ అధికారులకు చురక – నిర్లక్ష్యం వీడకుంటే ఇంటికెళతారంటూ హెచ్చరిక – పేదల సొంతింటి కలను సాకారం చేయాలని హితవు అనంతపురం సిటీ: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యతను ఆ శాఖ అధికారులు, సిబ్బంది మరిచారు. గృహాల మంజూరు, నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదంటూ జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్ధీన్ అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణశాఖ ఇఇలు, డిప్యూటీ డీఇలు, ఏఇలతో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా ఆ శాఖ అధికారుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు. తక్షణం అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు అందించాలన్నారు. ఆఖరి స్థానంలో ‘అనంత’ గృహ నిర్మాణాల్లో అనంతపురం జిల్లా చాలా వెనుక బడి ఉందని జేసీ స్పష్టం చేశారు. గ్రామీణ గృహ నిర్మాణ శాఖా మంత్రి సొంత జిల్లాలో ఇంతటి దుస్థితి ఉందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇందుకు అధికారులే కారకులవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం పథకం కింద ఆయా నియోజకవర్గాల్లో నిర్ధేశించిన మేరకు పునాదులు వేయించాలని సూచించారు. 2017-19 వరకు జిల్లాకు 29,500 గృహాలు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 31 లోపు కేటాయింపులన్నీ వంద శాతం పూర్తి కావాలని అదేశించారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ సి.వి.ప్రసాద్, పెనుకొండ ఇఇ చంద్రమౌళీ రెడ్డి, ధర్మవరం ఇఇ శేషుబాబుతో పాటు ఆయా డీఇలు, ఏఇలు పాల్గొన్నారు. -
నయా దందా
- అమ్మకానికి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు - రూ. 10 వేలు ఇస్తే మంజూరు పత్రం - దళారుల మాయలో అమాయక జనం - హౌసింగ్ ఉద్యోగుల తీరుపై అనుమానాలు విజయవాడ సెంట్రల్ : ‘ఇంటి’ దొంగల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. జక్కంపూడిలో నిర్మాణమైన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను బహిరంగ మార్కెట్లో బేరం పెట్టారు. రూ.1.76 లక్షలిస్తే రూ.5 లక్షలు ఖరీదు చేసే ఇల్లు మీ సొంతం అవుతుందంటూ మాటల వల విసురుతున్నారు. రాజధాని ప్రాంతంలో కారుచౌకగా ఇల్లు వస్తుందని భావించిన అమాయక ప్రజలు దళారుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ దందా వెనుక కొందరు నగరపాలక సంస్థ హౌసింగ్ ఉద్యోగుల హస్తం ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జక్కంపూడి ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసుకున్న సుమారు 3 వేల గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. ఇళ్లను అమ్మి సొమ్ము చేసుకునేందుకు భారీ స్కెచ్ వేశారు. రూ.10 వేలు ఇస్తే గృహాన్ని కేటాయిస్తున్నట్లు మంజూరు పత్రం ఇస్తున్నారు. ఆనక రూ.66 వేలు నగరపాలక సంస్థ కమిషనర్ పేరున డీడీ తీయాలని కొనుగోలుదారులకు చెబుతున్నారు. ఇంటి కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే లక్ష రూపాయలు మామూలుగా ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంటున్నారు. వారం రోజులుగా రాజీవ్‌నగర్, సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లో దళారులు ఇళ్ల విక్రయాల పేరుతో భారీగా డబ్బులు దండుకుంటున్నారని సమాచారం. పక్కా ప్లాన్ దళారులు ఇచ్చే మంజూరు పత్రంలో ప్రాజెక్ట్ మేనేజర్, హౌసింగ్ సెల్ పేరుతో సంతకం ఉంది. రూ.66 వేలు కమిషనర్ పేరున డీడీ తీయమనడం, ఇల్లు మంజూరయ్యాకే లక్షరూపాయలు ఇవ్వాలనడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కడా అనుమానం రావడం లేదు. మంజూరు పత్రం ఇచ్చిన వెంటనే రూ.10 వేలు ఇచ్చేస్తున్నారు. అయోధ్యనగర్ కరకట్ట ఫేజ్-1 ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన పత్రాలను కొనుగోలుదారులకు దళారులు అందిస్తున్నారు. 21-7-2015 తేదీతో హౌసింగ్ మేనేజర్ సంతకం చేసినట్లు అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నాయ్ హౌసింగ్ మేనేజర్ ఎ.ఉదయ్‌కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం డీఈ వెంకటేశ్వరరెడ్డి ఈఈగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. హౌసింగ్ కార్యాలయం నుంచి మంజూరుకావాల్సిన పత్రాలు దళారుల చేతికి ఎలా వెళ్లాయన్నది అంతుచిక్కని ప్రశ్న. దళారుల దందా వెనుక హౌసింగ్ ఉద్యోగుల పాత్రపై అనుమానాలు ముసురుతున్నాయి. హౌసింగ్ అధికారులు మంజూరు చేసిన ఇళ్లలో 40 శాతం అనర్హులేనన్నది బహిరంగ రహస్యం. ఇళ్ళ మంజూరు ప్రక్రియను హౌసింగ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగాలు పర్యవేక్షిస్తుంటాయి. ఎక్కడ నుంచి ఈ పత్రాలు పుట్టకొస్తున్నాయనేదానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. మంజూరైన ఇళ్లకు ఫ్లోర్ల మార్పు పేరుతో ముగ్గురు వర్క్ ఇన్స్పెక్టర్లు భారీగా వసూళ్లు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో కమిషనర్ జి.వీరపాండియన్ ఆ ముగ్గురిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల నుంచి వసూలుచేసిన సొమ్మును బ్యాంకుకు జమచేయకపోవడంతో ఇటీవలే వాంబేకాలనీలో బ్యాంకర్లు పర్యటించి బకాయిలు చెల్లించాల్సిందిగా హెచ్చరించారు. యూసీడీ విభాగంలో పని చేస్తున్న సీడీవో దుర్గాప్రసాద్ పనితీరుపై విమర్శలు ఉన్నాయి. హౌసింగ్ పనులు చూసేందుకు తాను ప్రైవేటు ఉద్యోగిని ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టం చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. -
గ్రౌండ్‌ఫ్లోరైతే రూ.20వేలు
- కార్నర్ ఫ్లాట్ కావాలంటే రూ.30వేలు అదనంగా కట్టాల్సిందే.. - జక్కంపూడి ఇళ్లలో రాయ‘బేరాలు’ - కార్పొరేషన్ ఉద్యోగుల వసూళ్లు విజయవాడ సెంట్రల్ : ‘మీకు పై పోర్షన్లో ఇల్లు వచ్చిందా.. గ్రౌండ్‌ఫ్లోర్‌కు మార్చాలా? రూ.20వేలు అదనంగా ఇవ్వండి. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ నగరపాలక సంస్థ హౌసింగ్ ఉద్యోగులు బహిరంగంగానే రాయ‘బేరాలు’ సాగించారు. కొందరు లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుని జాబితాలో పేర్లు తారుమారు చేశారు. నగరంలోని రాజీవ్‌నగర్ కరకట్ట, కేఎల్‌రావు నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కాల్వగట్లపై నివాసముంటున్న 170 మందికి శనివారం జక్కంపూడి కాలనీలో గృహాలు కేటాయించారు. ఒక్కో ఇంటి ధర రూ.66వేలు కాగా, ఒకేసారి ఆ మొత్తం చెల్లించిన వారికి గ్రౌండ్‌ఫ్లోర్ ఇస్తామని అధికారులు ఆఫర్ ఇచ్చారు. విడతలవారీగా సొమ్ము చెల్లించిన వారికి లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయించాల్సి ఉంది. ఈ విషయాలను మభ్యపెట్టిన ఉద్యోగులు అక్రమాలకు తెరతీశారు. రూ.66వేలు చెల్లించిన వారిలో కొందరికి గ్రౌండ్‌ఫ్లోర్ దక్కలేదు. దీంతో ఓ మహిళ ఆందోళనకు దిగింది. విషయం బయటకు పొక్కిపోతుందనే భయంతో ఉద్యోగులు ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. లాటరీ ఉత్తిదే.. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో జక్కంపూడిలో జరిగిన లాటరీ అంతా ఓ ఫార్స్‌గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హౌసింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లే ఈ కథంతా నడిపారనే వాదనలూ వినిపించాయి. హౌసింగ్ ఈఈ ఉదయ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు జక్కంపూడి కాలనీలో ఉన్నారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు జాబితాను చేతిలో పట్టుకుని ఇళ్ల బేరం మొదలు పెట్టాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌కు అదనంగా రూ.20వేల ధర పలగ్గా, కార్నర్ ఫ్లాట్ రూ.30వేల వరకు వెళ్లింది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉండే ఇద్దరు ఉద్యోగుల డెరైక్షన్లోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. విచారణ చేస్తా.. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాల విషయమై విచారణ నిర్వహించనున్నట్లు హౌసింగ్ ఈఈ ఎ.ఉదయ్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులైన ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తానన్నారు. లాటరీకి విరుద్ధంగా గ్రౌండ్‌ఫ్లోర్ కేటాయించినట్లు తెలిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. -
‘ఇందిరమ్మ’కు బ్రేక్..!
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : విభజన నిర్ణయం ఇందిరమ్మ లబ్ధిదారుల పాలిట గుదిబండగా మా రింది. గృహనిర్మాణశాఖ ఉద్యోగులం తా సమ్మె బాట పట్టడంతో పూర్తయిన ఇళ్లకు చెల్లింపులకు బ్రేక్ పడింది. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, పూర్తయిన వాటికి చెల్లింపులు జరగకపోవడంతో పల్లెల్లో హౌసింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఇ న్నాళ్లూ లబ్ధిదార్ల చుట్టూ ఆ శాఖ ఉద్యోగులు తిరిగేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఇళ్లు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి మహాప్రభో! అంటూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చెల్లింపులకు నిధుల కొరత లేకపోయినా పక్షం రోజులుగా హౌసింగ్ అధికారులు, సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమబాట పట్టడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. ఇళ్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చేయాల్సి ఉంది. సమ్మెతో ఆన్లైన్ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో జిల్లాలో ఇళ్ల లబ్ధిదార్లకు ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.10 కోట్ల వరకూ నిలిచిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిర్మాణంలో 3.66 లక్షల ఇళ్లు.. ఇందిరమ్మ మూడు దశలతో పాటు రచ్చబండ ఇళ్ల ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. వీటిలో 29,829 ఇళ్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభించలేదు. పునాదుల్లో 22,125, లింట ల్ స్థాయిలో 6831, ఆర్సీ స్థాయిలో 2,14,778 ఇళ్లు ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ స్థాయిలో మరో 64,690 వెరసి మొత్తం 3,66,318 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండేది కాదు. ప్రస్తుతం వీటి ధరలు తగ్గి నిర్మాణాలు ఊపందుకున్నా అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. వాస్తవానికి పూర్తి చేసినవాటికి అధికారులు చెల్లింపులు చేపట్టాకే, లబ్ధిదారులు తరువాత స్థాయి పనులు చేపడుతుంటారు. ప్రస్తుతం పూర్తి చేసిన స్థాయికి బిల్లులు నిలిచిపోవడంతో తరువాత స్థాయికి వెళ్లేందుకు లబ్ధిదారులు వెనుకంజవేస్తున్నారు.