గ్రౌండ్‌ఫ్లోరైతే రూ.20వేలు
- కార్నర్ ఫ్లాట్ కావాలంటే రూ.30వేలు అదనంగా కట్టాల్సిందే..
- జక్కంపూడి ఇళ్లలో రాయ‘బేరాలు’
- కార్పొరేషన్ ఉద్యోగుల వసూళ్లు
విజయవాడ సెంట్రల్ : ‘మీకు పై పోర్షన్‌లో ఇల్లు వచ్చిందా.. గ్రౌండ్‌ఫ్లోర్‌కు మార్చాలా? రూ.20వేలు అదనంగా ఇవ్వండి. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ నగరపాలక సంస్థ హౌసింగ్ ఉద్యోగులు బహిరంగంగానే రాయ‘బేరాలు’ సాగించారు. కొందరు లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుని జాబితాలో పేర్లు తారుమారు చేశారు. నగరంలోని రాజీవ్‌నగర్ కరకట్ట, కేఎల్‌రావు నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కాల్వగట్లపై నివాసముంటున్న 170 మందికి శనివారం జక్కంపూడి కాలనీలో గృహాలు కేటాయించారు.
ఒక్కో ఇంటి ధర రూ.66వేలు కాగా, ఒకేసారి ఆ మొత్తం చెల్లించిన వారికి గ్రౌండ్‌ఫ్లోర్ ఇస్తామని అధికారులు ఆఫర్ ఇచ్చారు. విడతలవారీగా సొమ్ము చెల్లించిన వారికి లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయించాల్సి ఉంది. ఈ విషయాలను మభ్యపెట్టిన ఉద్యోగులు అక్రమాలకు తెరతీశారు. రూ.66వేలు చెల్లించిన వారిలో కొందరికి గ్రౌండ్‌ఫ్లోర్ దక్కలేదు. దీంతో ఓ మహిళ ఆందోళనకు దిగింది. విషయం బయటకు పొక్కిపోతుందనే భయంతో ఉద్యోగులు ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
లాటరీ ఉత్తిదే..
ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో జక్కంపూడిలో జరిగిన లాటరీ అంతా ఓ ఫార్స్‌గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హౌసింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లే ఈ కథంతా నడిపారనే వాదనలూ వినిపించాయి.
హౌసింగ్ ఈఈ ఉదయ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు జక్కంపూడి కాలనీలో ఉన్నారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వర్క్ ఇన్‌స్పెక్టర్ ఒకరు జాబితాను చేతిలో పట్టుకుని ఇళ్ల బేరం మొదలు పెట్టాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌కు అదనంగా రూ.20వేల ధర పలగ్గా, కార్నర్ ఫ్లాట్ రూ.30వేల వరకు వెళ్లింది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉండే ఇద్దరు ఉద్యోగుల డెరైక్షన్‌లోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి.
విచారణ చేస్తా..
ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాల విషయమై విచారణ నిర్వహించనున్నట్లు హౌసింగ్ ఈఈ ఎ.ఉదయ్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులైన ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తానన్నారు. లాటరీకి విరుద్ధంగా గ్రౌండ్‌ఫ్లోర్ కేటాయించినట్లు తెలిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.