నయా దందా
- అమ్మకానికి జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లు
- రూ. 10 వేలు ఇస్తే మంజూరు పత్రం
- దళారుల మాయలో అమాయక జనం
- హౌసింగ్ ఉద్యోగుల తీరుపై అనుమానాలు
విజయవాడ సెంట్రల్ : ‘ఇంటి’ దొంగల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. జక్కంపూడిలో నిర్మాణమైన జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లను బహిరంగ మార్కెట్‌లో బేరం పెట్టారు. రూ.1.76 లక్షలిస్తే రూ.5 లక్షలు ఖరీదు చేసే ఇల్లు మీ సొంతం అవుతుందంటూ మాటల వల విసురుతున్నారు. రాజధాని ప్రాంతంలో కారుచౌకగా ఇల్లు వస్తుందని భావించిన అమాయక ప్రజలు దళారుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
ఈ దందా వెనుక కొందరు నగరపాలక సంస్థ హౌసింగ్ ఉద్యోగుల హస్తం ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జక్కంపూడి ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసుకున్న సుమారు 3 వేల గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. ఇళ్లను అమ్మి సొమ్ము చేసుకునేందుకు భారీ స్కెచ్ వేశారు. రూ.10 వేలు ఇస్తే గృహాన్ని కేటాయిస్తున్నట్లు మంజూరు పత్రం ఇస్తున్నారు.
ఆనక రూ.66 వేలు నగరపాలక సంస్థ కమిషనర్ పేరున డీడీ తీయాలని కొనుగోలుదారులకు చెబుతున్నారు. ఇంటి కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే లక్ష రూపాయలు మామూలుగా ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంటున్నారు. వారం రోజులుగా రాజీవ్‌నగర్, సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లో దళారులు ఇళ్ల విక్రయాల పేరుతో భారీగా డబ్బులు దండుకుంటున్నారని సమాచారం.
పక్కా ప్లాన్
దళారులు ఇచ్చే మంజూరు పత్రంలో ప్రాజెక్ట్ మేనేజర్, హౌసింగ్ సెల్ పేరుతో సంతకం ఉంది. రూ.66 వేలు కమిషనర్ పేరున డీడీ తీయమనడం, ఇల్లు మంజూరయ్యాకే లక్షరూపాయలు ఇవ్వాలనడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కడా అనుమానం రావడం లేదు. మంజూరు పత్రం ఇచ్చిన వెంటనే రూ.10 వేలు ఇచ్చేస్తున్నారు. అయోధ్యనగర్ కరకట్ట ఫేజ్-1 ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన పత్రాలను కొనుగోలుదారులకు దళారులు అందిస్తున్నారు. 21-7-2015 తేదీతో హౌసింగ్ మేనేజర్ సంతకం చేసినట్లు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.
ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నాయ్
హౌసింగ్ మేనేజర్ ఎ.ఉదయ్‌కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం డీఈ వెంకటేశ్వరరెడ్డి ఈఈగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. హౌసింగ్ కార్యాలయం నుంచి మంజూరుకావాల్సిన పత్రాలు దళారుల చేతికి ఎలా వెళ్లాయన్నది అంతుచిక్కని ప్రశ్న. దళారుల దందా వెనుక హౌసింగ్ ఉద్యోగుల పాత్రపై అనుమానాలు ముసురుతున్నాయి. హౌసింగ్ అధికారులు మంజూరు చేసిన ఇళ్లలో 40 శాతం అనర్హులేనన్నది బహిరంగ రహస్యం. ఇళ్ళ మంజూరు ప్రక్రియను హౌసింగ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) విభాగాలు పర్యవేక్షిస్తుంటాయి. ఎక్కడ నుంచి ఈ పత్రాలు పుట్టకొస్తున్నాయనేదానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది.
మంజూరైన ఇళ్లకు ఫ్లోర్ల మార్పు పేరుతో ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు భారీగా వసూళ్లు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో కమిషనర్ జి.వీరపాండియన్ ఆ ముగ్గురిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
లబ్ధిదారుల నుంచి వసూలుచేసిన సొమ్మును బ్యాంకుకు జమచేయకపోవడంతో ఇటీవలే వాంబేకాలనీలో బ్యాంకర్లు పర్యటించి బకాయిలు చెల్లించాల్సిందిగా హెచ్చరించారు. యూసీడీ విభాగంలో పని చేస్తున్న సీడీవో దుర్గాప్రసాద్ పనితీరుపై విమర్శలు ఉన్నాయి. హౌసింగ్ పనులు చూసేందుకు తాను ప్రైవేటు ఉద్యోగిని ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టం చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు లేవు.