జర్నలిస్టు టు జేసీ!
కడప :
‘నేను 1 నుంచి 10వ తరగతి వరకు మీరట్‌లో సోఫియా గర్ల్స్ హైస్కూలులో చదివాను. తర్వాత ముంబయి సెయింట్ జెలిబిస్ కళాశాలలో చదివాను. డిగ్రీలో ఇంగ్లీషు లిటరేచర్ చేశాను. అందుకే ఐఏఎస్ ఈజీగా సాధించగలిగాను. అమ్మ అనూరాధ, నాన్న కన్నల్ డీఎస్ తెవతీయ. నాకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయన అమెరికాలో చదువుతున్నాడు. ఇద్దరు సోదరీమణుల్లో ఒకరు టీచర్‌గా పనిచేస్తుండగా, మరొకరు ఎంబీఏ చేస్తున్నారు. నేను జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడి ప్రజలతో మమేకమవడం.. వారి సమస్యలు తెలుసుకోవడం.. పరిష్కరించడాన్ని దేవుడిచ్చిన గొప్ప బాధ్యతగా స్వీకరిస్తున్నా. రేషన్ షాపుల్లో అవినీతికి చెక్ పెడుతున్నాం. రేషన్ వినియోగదారులు ఏ ప్రాంతం నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. కడపలో సరుకులు తీసుకోవడం కుదరలేదు. అలాంటపుడు రైల్వేకోడూరులోనే తీసుకోవచ్చు. ఇదే పోర్టబులిటీ సిస్టమ్. తద్వారా అవినీతికి చెక్ పడుతుంది. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి.
మైలవరానికి సోలార్ పవర్ ప్రాజెక్టు..
మైలవరం మండలంలోని ఆరు గ్రామాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కంపెనీ ముందుకొచ్చింది. వెయ్యి ఎకరాల్లో ప్రాజెక్టు ఏర్పాటు జరగనుంది. అలాగే గాలివీడు సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే హైదరాబాదు, విజయవాడలకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇసుకను అవసరాల నిమిత్తం రీచ్‌ల నుంచి తెచ్చుకోవాలి. మీ–సేవ, ఏపీ ఆన్‌లైన్∙కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. పాలన పరంగా తహశీల్దార్లకు నిబంధనలమేరకు నడుచుకోవాలని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెబుతుంటా. ఇటీవలి కాలంలో బదిలీలు పారదర్శకంగా నిర్వహించాం. మైదుకూరులో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంత పండ్ల తోటల రైతులకు శుభ పరిణామమని చెప్పవచ్చు.
తెలుగు వంటలంటే చాలా ఇష్టం..
ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాక అన్ని రకాల వంటలను చూశాను. పప్పు, గోంగూర, చికెన్, మటన్, సాంబారు, రసం లాంటి వంటలంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవల వంటలు చేయడం నేర్చుకున్నాను. శని, ఆదివారాల్లో ఇంటిలో నేను వంటలు చేస్తుంటాను. స్పోర్ట్స్ స్కూలుకు వెళ్లి చిన్నారులతో ఎక్కువగా గడుపుతుంటాను. అక్కడ చుట్టూ కొండలు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులున్నాయి. అక్కడి విద్యార్థులతో వాకింగ్ చేయడంతోపాటు వారి కష్టసుఖాలు తెలుసుకుంటాను. ఎక్కువగా పేపరుతోపాటు పుస్తకాలు చదవడం అలవాటు. ఖాళీ దొరికితే నవలలు చదువుతూ కాలక్షేపం చేస్తాను. కాకపోతే బిజీ వల్ల కుదరడం లేదు. ఏదో ఒక టైమ్‌లో కొద్దిసేపైనా చదవడం అలవాటు.’ అని జేసీ సాక్షికి వివరించారు.
– చదువు పూర్తి కాగానే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో జర్నలిస్టుగా జాయిన్ అయ్యాను. ముంబయిలో ఎన్నో ఫీచర్స్ రాశాను. కథనాలకు అద్భుతమైన ఫలితాలు రావడం మరిచిపోలేని అనుభూతి. ప్రతిరోజు కొత్తకొత్త అంశాలతో.. అభిరుచులతో అందంగా పేజీకి ఫీచర్స్ అందించేదాన్ని.
– జర్నలిస్టుగా పనిచేసినంతరం ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. సొంతంగానే ఒక పద్ధతి ప్రకారం చదివి సాధించాను. ఇంగ్లీషు లిటరేచర్ కాబట్టి ఈజీగా సాధించాను. 2011లో సెలెక్ట్ అయి మొదటగా చిత్తూరులో శిక్షణ పొంది, తర్వాత విశాఖ పరిధిలోని నర్సీపట్నం, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎస్‌డీగా పనిచేసిన తర్వాత కడప జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి వచ్చాను.