
లక్షలు ఇచ్చినా భూములివ్వం
పెనుకొండ రూరల్ : కన్నతల్లి వంటి భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. అలాంటి భూమిని ఎన్ని రూ.లక్షలు ఇచ్చినా ఇవ్వడానికి మేం సిద్ధంగా లేమని అమ్మవారుపల్లి సమీపంలో ఉన్న ఎర్రమంచి పొలాల రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి పక్కన మండలం అమ్మవారుపల్లి, కురుబవాండ్లపల్లి మధ్య 134–616 సర్వే నంబరులో ఉన్న 600 ఎకరాల భూమిని దక్షిణకొరియాకు చెందిన కియో కార్ల కంపెనీకి ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేశారు.
ఈనేపథ్యంలో శుక్రవారం అధికారులు గ్రామానికి వెళ్లి సంబంధిత రైతులతో సమావేశమయ్యారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర అఖిలక్ష నాయకులు మాట్లాడుతూ నంబులపూలకుంటలో సోలార్ ఫ్యాక్టరీకి 7 వేల ఎకరాలు, లేపాక్షి హబ్‌కు భూసేకరణ చేశారు. ఎవరి కోసం చేశారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ తదితర రెవెన్యూ అధికారులను నిలదీశారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడి రైతులతో చర్చించి చట్ట ప్రకారం రైతుల పక్షాన పోరాడుతామని యంగ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ బేడీ, ఏపీసీసీ కార్యదర్శి రమణ, అఖిల భారత కూలీ సంఘం నాయకులు నాగరాజు, ఓపీడీఆర్ శ్రీనివాసులు అన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తి మాట్లాడుతూ 600 ఎకరాలు భూసేకరణ చట్టం ప్రకారమే చేశామన్నారు. ఎకరా రూ.8 లక్షలతో «ప్రభుత్వం ధర‡ నిర్ణయించినట్లు రైతులకు తెలిపారు.
తర్వాత జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఇదివరకే చాలా నష్టపోయాం. ఈప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ అసైన్డ్, డీకేటీ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులు ఎంత పరిహారం అడుగుతారో చర్చించడానికి వచ్చామన్నారు. ఇక్కడి రైతుల స్థితిగతులను పరిశీలించి మెరుగైన రీతిలో నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు రైతులకు వివరించారు. దీనికి రైతులు ఆవేదనతో రగిలిపోయారు. సాగు చేస్తున్నఽ భూములను పరిశ్రమలకు ఇవ్వబోమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జేసీ వెనుతిరిగాడు. అనంతరం ఆర్డీఓ వెళ్తున్న కారును రైతులు అడ్డగించి సమస్య పరిష్కరించాలని కోరారు.