నూతన జిల్లాలకు సిబ్బందిని పంపే కార్యాచరణ సిద్ధం చేయాలి
Published
Sun, Sep 4 2016 9:44 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నూతన జిల్లాలకు సిబ్బందిని పంపే కార్యాచరణ సిద్ధం చేయాలి
నల్లగొండ : పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందిని 40–30–30 శాతంగా విభజించి మూడు జిల్లాలకు పంపే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాల పునర్విభజనపై మార్గనిర్దేశం చేసేందుకు జిల్లా అధికారులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనకు సంబంధించి కార్యాలయ సిబ్బంది, ఫైళ్లు, ఫర్నిచర్ పంపిణీ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన సిబ్బంది వివరాలు, నూతన జిల్లాలలో కార్యాలయాలకు సరిపడా స్థలాలు, ఎన్ని రూంలు అవసరమున్నయో ప్రస్తుతం అవసరమగు బిల్డింగ్ కిరాయి తదితర వివరాలు ఆ శాఖకు కేటాయించిన నోడల్ అధికారికి వెంటనే అందజేయాలని సూచించారు. కార్యాలయము ట్రాన్స్‌పోర్టు సంబంధించిన ఖర్చులకు అవసరమగు బడ్జెట్ రూపొందించి వివరాలను కూడా వెంటనే సమర్పించాలన్నారు. ప్రతి శాఖ ప్రొఫార్మా – 1, 2, 4, 5 ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, ఉద్యోగంలో చేరిన తేది, పదవీ విరమణ తేదిలతో సహా పూర్తి వివరాలను సంబంధిత ప్రొఫార్మలో జత చేసి వెంటనే పంపించాలని అధికారులను కోరారు. నూతన జిల్లాలో మీ శాఖకు సంబంధించిన కార్యాలయ బిల్డింగ్‌ను ఆయా జిల్లాలకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని, అదేవిధంగా కొత్త నియామాకాలు లేనందున ఉన్న సిబ్బందితోనే ఆయా జిల్లాల పనులు జరిగే విధంగా తగు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. ఉద్యోగుల సర్వీసు పుస్తకాలను అప్‌డేట్ చేసి సర్వీసు రికార్డులో ఇప్పటివరకు నమోదు చేయవలసిన అంశాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డీఆర్వో రవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.