
సాక్షి, అమరావతి: లైసెన్స్ లేదన్న కారణంతో సినిమా థియేటర్‌ను జప్తు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏపీ సినిమా (నియంత్రణ) రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారి మాత్రమే సినిమా థియేటర్‌ను జప్తు చేయగలరని స్పష్టం చేసింది. ఈ రూల్స్ ప్రకారం లైసెన్స్ జారీ అధికారి జాయింట్ కలెక్టర్ (జేసీ) అవుతారని తెలిపింది. అందువల్ల జేసీకి మాత్రమే సినిమా థియేటర్‌ను మూసివేసే అధికారం ఉందని పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీనివాస మహల్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదని తహసీల్దార్ దాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్‌ను జప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పడాన్ని కూడా ఖండించింది. జప్తు చేసిన థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. లైసెన్స్ పునరుద్ధరణ అంశం లైసెన్స్ జారీ అధికారి ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్‌లో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని థియేటర్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ లేదన్న కారణంతో తమ థియేటర్‌ను తహసీల్దార్ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస మహల్ మేనేజింగ్ పార్టనర్ సనపాల శంకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.