తాడికొండ : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాల్లో ఎకరంలోపు రైతులకూ రూ.30 వేలు కౌలు ఇవ్వనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం కొత్త జీవో విడుదల చేసినట్లు పేర్కొన్నారు.దాని ప్రకారం రాజధాని ప్రాంతంలో ఎకరంలోపు ఉంటే కౌలు సొమ్ము పూర్తిగా అంటే రూ.30 వేలు అందుతుందన్నారు. అయితే వేర్వేరు చోట్ల ఉంటే మాత్రం రెండు చెక్కులు రావన్నారు.
మంగళవారం రాత్రి తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో రైతులకు కౌలు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గ్రామ సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ ఏసురత్నం అధ్యక్షత వహించారు. జేసీ శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని అభివృద్ధికి నేలపాడు, ఐనవోలు పోటీపడి ఉత్సాహంగా భూముల ఇచ్చాయని అభినందించారు.
వచ్చే ఏడాది రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే కౌలు సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులు పవర్‌ఆఫ్ అటార్నీ ఇచ్చిన వెంటనే కౌలు అందిస్తామని చెప్పారు. జూన్‌లో అభివృద్ధి మొదలవుతుందని చెప్పారు. రైతులు తమ పొలాల్లో ఉన్న వస్తువులను తొలగించాలని సూచించారు. గ్రామాల్లో కూలీలకు నెలకు రూ. 2,500 వంతున పదేళ్ల పాటు పింఛను ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చదువుకున్న యువతను గుర్తించి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని జేసీ తెలిపారు.
అనంతరం రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకొని కౌలు చెక్కులు అందించారు. ఇదిలావుండగా, మెట్టరైతులకు ప్యాకేజీ పెంచాలని కోరుతూ అదనపు జేసీ చెన్నకేశవరావు రైతులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు జేసీ చెన్నకేశవరావు, ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దారు సుధీర్‌బాబు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పోతురాజు శ్రీనివాసరావు, నేలపాడు మాజీ సర్పంచ్ ధనేకుల రామారావు, రైతులు పాల్గొన్నారు.
ఎకరంలోపు రైతులకూ.. రూ.30 వేలు
Published Wed, Mar 11 2015 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement