జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జాయింట్ కలెక్టర్ రవి
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కవరేజీపై సాక్షాత్తు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి నాయక్ ఆంక్షలు విధించారు. ప్రజావాణి సమావేశ మందిరంలోకి జర్నలిస్టులకు అనుమతి లేదని, ఫొటోలు తీసుకుని వెళ్లి పోవాలని, సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు పంపే ప్రెస్‌నోట్ చూసి వార్తలు రాసుకోవాలని సూచిస్తూ సరి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఇదేంటని ప్రశ్నించిన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది సహకారంతో వారిని బలవంతంగా సమావేశ మందిరం నుంచి బయటికి పంపిన సంఘటన హైదరాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం చోటుచేసుకుంది.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు వివిధ పత్రికలు, చానళ్ల రిపోర్టర్లు కలెక్టరేట్‌కు వెళ్లారు. జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ ఇతర సమీక్షా సమావేశాల్లో బిజీగా ఉన్నందున ‘ప్రజావాణి’కి హాజరుకాలేదు. దీంతో జాయింట్ కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి భూపాల్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం ప్రజా సమస్యలకు సంబంధించి ఆయా శాఖల అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిని గమనిస్తున్న జర్నలిస్టులను గుర్తించిన జేసీ జర్నలిస్టుల ప్రజావాణికి పాత్రికేయులు రావాల్సిన అవసరం లేదని, ఫొటోలు తీసుకొని బయటికి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నివ్వెరపోయిన జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వచ్చినట్లు చెప్పగా, మీరు జర్నలిస్టులని తెలుసునని, అయితే సమావేశ మందిరంలోకి అనుమతి లేదని అసహనం వ్యక్తం చేశారు.
అక్రిడేటెడ్ జర్నలిస్టులైనా..
తాము ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేటెడ్ జర్నలిస్టులమని కార్డులు చూపిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలను కవర్ చేసేందుకు అనుమతి ఉంటుందని కొందరు పాత్రికేయులు జేసీకి వివరించే ప్రయత్నం చేయగా ప్రజావాణి కార్యక్రమం పిటీషన్లు స్వీకరించేందుకు మాత్రమేనని, డీపీఆర్‌ఓ ప్రెస్ నోట్ పంపిస్తారని, దీనిని ప్రత్యేకంగా కవరేజీ చేయాల్సిన అవసరం లేదన్నారు.వారు పంపించింది రాసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ప్రజావాణి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో మీడియాను అనుమతిస్తున్నట్లు చెప్పగా ఆగ్రహానికిలోనైన జేసీ ఆ అవసరం లేదని స్పష్టం చేశారు.
ఫిర్యాదు చేసుకోవచ్చు
జాయింట్ కలెక్టర్ ప్రజావాణికి రానివ్వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించారు. అనంతరం ‘కాల్‌ది డీపీఆర్‌ఓ’ అంటూ జర్నలిస్టులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో జిల్లా రెవెన్యూ అధికారి సీసీ పవన్ అక్కడికి వచ్చి ప్రాతికేయులను బయటికి వెళ్లాలంటూ నెట్టివేసేందుకు ప్రయత్నించారు. దీంతో కలెక్టరేట్ ఏఓ ఆశోక్ రెడ్డి అక్కడికి వచ్చి తర్వాత మాట్లాడుకుందాం... మొదట బయటికి వెళ్లాలని విలేకరులను బయటికి పంపారు. అనంతరం డీపీఆర్‌ఓను వేదిక వద్దకు పిలిపించుకున్న జేసీ కేవలం ఫొటోలు తీసుకుని పొమ్మనండి.. మీరు పంపించిన ప్రెస్‌నోట్ రాసుకోమ్మని చెప్పాలంటూ హుకుంజారీ చేయడం విస్మయానికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment