ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి
సాక్షి,సిటీబ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి అత్యధికంగా అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టర్ శ్వేతా మహంతి సీరియస్ అయ్యారు. ప్రజావాణికి హాజరు కాని సుమారు 25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. ఇక మీదట హాజరు కాకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ ప్రాంగణానికి కలెక్టర్ చేరుకునే సరికి కనీసం పది మంది అధికారులు సైతం హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు.
మారని అధికారుల తీరు
పాలనాధీశులు మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. గత రెండేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగుతూ వచ్చింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో కింది స్థాయి సిబ్బందిని పంపించి జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరవుతూ వచ్చారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాదు కదా.. అసలు వినేవారే కరువయ్యారు. కనీసం కార్యక్రమానికి సైతం సమయపాలన లేకుండా పోయింది. కొన్ని సార్లు కింద స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా, మరికొన్ని సార్లు అధికారుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి అర్జీదారుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతూ వచ్చింది. తాజాగా కలెక్టర్‌గా శ్వేతా మహంతి పాలనా పగ్గాలు చేపట్టడంతో కొంత ఆశలు చిగురించాయి. కానీ అధికారుల తీరు మారక పోవడంతో కలెక్టర్ కన్నెర్ర చేశారు.
ప్రజావాణి ప్రత్యేకం..
కలెక్టర్ శ్వేతా మహంతికి ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రత్యేక శ్రద్ధ . గతంలో పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణి పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అక్కడి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి క్రమం తప్పకుండా హజరు కావడం, ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు సత్వరమే పరిష్కార మార్గాల కోసం సూచనలు చేసే అలవాటు ఉన్నట్లు సమాచారం. సమయం మించి పోయినా తన చాంబర్‌లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా పేరుంది. ఇలాంటి అధికారి కలెక్టర్‌గా పరిపాలన పగ్గాలు చేపట్టినా జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.కృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీను, వసంత కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment