swetha mahanthi
-
క్యా హై భాయ్..
గోల్కొండ: దివ్యాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానవత్వం తో ఆలకించి, సమస్య పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలీచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో ఓ వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు ఆపి దిగారు. క్యాహై భాయ్... సలామంటూ చేయి కలిపారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనను మహ్మద్ సలీం అని పరిచయం చేసుకున్న అతడు.. గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదని, ఉండేందుకు ఇల్లు కూడా లేదని, తగిన సహా యం చేయాలని కోరాడు. దీనికి సీఎం వెంటనే స్పందించారు. సలీం సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు టోలీచౌకిలో సలీం నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీం దివ్యాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండటంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. -
25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి అత్యధికంగా అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టర్ శ్వేతా మహంతి సీరియస్ అయ్యారు. ప్రజావాణికి హాజరు కాని సుమారు 25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. ఇక మీదట హాజరు కాకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ ప్రాంగణానికి కలెక్టర్ చేరుకునే సరికి కనీసం పది మంది అధికారులు సైతం హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. మారని అధికారుల తీరు పాలనాధీశులు మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. గత రెండేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగుతూ వచ్చింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో కింది స్థాయి సిబ్బందిని పంపించి జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరవుతూ వచ్చారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాదు కదా.. అసలు వినేవారే కరువయ్యారు. కనీసం కార్యక్రమానికి సైతం సమయపాలన లేకుండా పోయింది. కొన్ని సార్లు కింద స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా, మరికొన్ని సార్లు అధికారుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి అర్జీదారుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతూ వచ్చింది. తాజాగా కలెక్టర్‌గా శ్వేతా మహంతి పాలనా పగ్గాలు చేపట్టడంతో కొంత ఆశలు చిగురించాయి. కానీ అధికారుల తీరు మారక పోవడంతో కలెక్టర్ కన్నెర్ర చేశారు. ప్రజావాణి ప్రత్యేకం.. కలెక్టర్ శ్వేతా మహంతికి ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రత్యేక శ్రద్ధ . గతంలో పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణి పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అక్కడి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి క్రమం తప్పకుండా హజరు కావడం, ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు సత్వరమే పరిష్కార మార్గాల కోసం సూచనలు చేసే అలవాటు ఉన్నట్లు సమాచారం. సమయం మించి పోయినా తన చాంబర్లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా పేరుంది. ఇలాంటి అధికారి కలెక్టర్‌గా పరిపాలన పగ్గాలు చేపట్టినా జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.కృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీను, వసంత కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దూకుడు పెంచిన కొత్త కలెక్టర్ శ్వేతా మహంతి..
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ శ్వేతా మహంతి పాలనపై పట్టుసాధించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యత అంశాలుగా ప్రకటించిన విద్య, వైద్యం, ప్రభుత్వ భూములు, సంక్షేమ పథకాలతో పాటు మిగిలిన ప్రభుత్వ విభాగాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. గతంలో పనిచేసిన ప్రాంత పరిస్థితులకు హైదరాబాద్ జిల్లా పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శాఖల వారీగా వరస సమీక్షలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశించే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే జిల్లా వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షలు నిర్వహించి లక్ష్య సాధనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రోజుకు మూడు శాఖల చొప్పున ఈ నెల 24 నుంచి 28 వరకు వరుసగా సమీక్షలకు షెడ్యూలు జారీ చేశారు. రెండేళ్లుగా... హైదరాబాద్ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. ఒక వైపు ప్రభుత్వపరంగా నిధుల విడుదల లేకపోవడం, మరోవైపు పర్యవేక్షణ కొరవడటంతో అధికారులు, ఉద్యోగుల్లో నిస్తేజం నెలకొంది. ఫలితంగా విధి నిర్వహణలో సైతం నిర్లక్ష్యం నెలకొంది. విభాగాల పరంగా ప్రణాళిక లేకుండా పనితీరుతో ఎక్కడి ఫైళ్లు అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. రెండేళ్లలో ఇద్దరు కలెక్టర్లు మారడం, ఆ తర్వాత వరుస ఎన్నికలు, అధికారుల బదిలీలతో శాఖల తీరు అధ్వానంగా తయారైంది. వాస్తవంగా గత రెండేళ్ల క్రితం యోగితారాణా హయంలో కొద్దికాలం ఉరుకులు పరుగులు పెట్టిన వివిధ విభాగాలు, ఆమె బదిలీ తర్వాత పాత పరిస్థితికి చేరాయి. తర్వాత అడపా దడపా సమీక్షలు జరిగినా శాఖల పనితీరు మొక్కుబడిగా తయారైంది. సాక్షాత్తు జిల్లాస్థాయి అధికారులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో క్షేత్రస్థాయి పనితీరు గాడి తప్పింది. తాజాగా కలెక్టర్ శ్వేతా మహంతి పనితీరులో కొంత దూకుడు పెంచి నిస్తేజంలో ఉన్న పాలనను పునరుత్తేజం కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో కొంతమేరకు ఆశలు చిగురిస్తున్నాయి. -
‘ప్రజావాణి’కి మంచి రోజులొచ్చేనా..!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం గాడిలో పడుతుందా ? ప్రజల సమస్యల పరిష్కారానికి మోక్షం లభిస్తుందా ? జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు వస్తుందా ? అధికారుల ఆదేశాలు అమలవుతాయా? అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయిస్తూ తాను పనిచేసే అధికారిగా ముద్ర వెసుకున్న శ్వేతా మహంతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత రెండేళ్లుగా జిల్లా పాలనా యంత్రాంగమే కంచె చేను మేసిన విధంగా వ్యవహరించడంతో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకుండా జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడం, ప్రజా ఫిర్యాదుల నిర్లక్ష్యానికి మరింత కారణమైంది. ప్రజాసమస్యలు పరిష్కారం కాదు కదా. అసలు వినేవారే కరువయ్యారు. మరోవైపు కార్యక్రమానికి సమయపాలన లేకుండా పోయింది. కొన్నిసార్లు కింది స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా.. మరికొన్ని సార్లు ఆర్జీదారులకు పడిగాపులు తప్పడం లేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి క్రమంగా అర్జీదారుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఆదేశాలు సైతం బేఖాతర్.. ప్రజావాణిలో ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం అతంత మాత్రంగానే అమలవుతున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజావాణిలో పదే పదే జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని, అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు వ్యక్తిగత శ్రద్ద కనబర్చాలని ఆదేశిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి నివేదిక అందజేయాలని, పరిష్కరించిన వినతి పత్రాల వివరాలను శాఖల వారిగా తమ లాగిన్ ఐడీతో మీ కోసం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచనలు సైతం అమలు కాలేదు. మరోవైపు పాలనా యంత్రాంగం వద్ద ఇప్పటి వరకు ఎన్ని ఆర్జీలు వచ్చాయి. ఎన్నిపరిష్కారమయ్యాయి. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలు అందుబాటులో లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మార్క్ ఉంటుందా..? ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరిస్తారా..? లేక గత కలెక్టర్ల మాదిరిగా కార్యక్రమ బాధ్యతలు జాయింట్ కలెక్టర్‌కు అప్పగిస్తారా..? కొత్త కలెక్టర్ శ్వేతా మహంతి కొంత శ్రద్ధ కనబర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణిపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చారు. ప్రజావాణికి క్రమం తప్పకుండా హాజరై ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి సమయం మించి పోయినా.. తన చాంబర్లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా ఆమెకు పేరుంది. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరయ్యే జిల్లా స్థాయి అధికారులకు తీవ్రంగా మందలిచినట్లు తెలుస్తోంది. ప్రజా ఫిర్యాదుల ఆప్డేట్, ప్రతివారం వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించే అలవాటు ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల్లో గుబులు పట్టుకుంది. కొత్త కలెక్టర్ పాలనా పగ్గాలు చేపట్టడంతో ప్రజావాణి గాడిలో పడి అధికారుల్లో మార్పు వస్తుందనే ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. -
విద్య, వైద్యానికే తొలి ప్రాధాన్యం
సాక్షి,సిటీబ్యూరో: విద్య,వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. రెండు రోజుల క్రితం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలనా అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతుల కల్పనకు చర్యలు చేపడుతామన్నారు. అంగన్వాడీలను సైతం మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తాన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన సేవలు అందేవిధంగా చర్య తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులు చేసేవిధంగా చర్యలు చేపడుతామన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు కీలకమని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. కోర్టు వివాదాల్లో గల ప్రభుత్వ భూములను సైతం దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రభుత్వ భూమి గజం కూడా చేజారకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు శ్వేతా మహంతి వివరించారు. -
హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిపాలనలో యువ ముద్రపడనుంది. కొత్త ఉత్సాహం ఉరకలెత్తనుంది. కొత్త రక్తంతోప్రగతికి బాటలు పరుచుకోనున్నాయి. ఐఏఎస్‌ల బదిలీల్లోభాగంగా జీహెచ్ఎంసీ నుంచి ఆరుగురు బదిలీ కాగా, వీరిస్థానంలో నలుగురు వస్తున్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. ఏడాది కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండగా.. ఆరుగురు ఐఏఎస్‌లను ప్రభుత్వం జిల్లాలకు బదిలీ చేసింది. జిల్లాల నుంచి నలుగురిని జీహెచ్ఎంసీలో నియమించింది. జీహెచ్ఎంసీలో మూడేళ్లు దాటిన ఐఏఎస్‌ల బదిలీ జరగనుందని దాదాపు ఎనిమిది నెలల నుంచే ప్రచారంలో ఉన్నా.. ఇప్పటి వరకు జరగలేదు. బదిలీల్లో మూడేళ్లు దాటిన వారితో పాటు దాదాపు ఏడాది క్రితం చేరిన వారు సైతం ఉన్నారు. అడిషనల్, జోనల్ కమిషనర్లుగా ఉన్న ఐఏఎస్లందరూ బదిలీ అయ్యారు. అనుకూలంగా ఉంటుందనే.. కొత్తగా వస్తున్న వారంతా యువ ఐఏఎస్‌లే. వీరంతా 2015, 2016 బ్యాచ్‌లకు చెందినవారు కాగా.. 2017, 2018 నుంచి మాత్రమే ఆయా జిల్లాల్లో సబ్ కలెక్టర్, స్పెషలాఫీసర్లుగా పనిచేశారు. బహుశా కమిషనర్ లోకేష్‌కుమార్‌కు అనుకూలంగా ఉంటుందనే తలంపుతో ప్రభుత్వం వీరిని ఇక్కడకు బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. జూనియర్లయిన వీరు జీహెచ్ఎంసీ లాంటి కార్పొరేషన్‌ను.. అందులోని వివిధ విభాగాలను, పనితీరును అర్థం చేసుకునేందుకే ఎంతో సమయం పట్టనుంది. దాదాపు ఏడాదిలో ఎన్నికలు జరగనుండగా.. పదినెలల్లో ‘అభివృద్ధి’ క్లోజప్‌లో కనిపించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల గడువులోగా వీరు తమదైన శైలిలో పనితీరును చూపించాల్సి ఉంది. కొత్తగా మరికొందరు వచ్చినా జీహెచ్ఎంసీ అధికారుల్లో ‘ఎలక్షన్ టీమ్’లో వీరు తగిన భూమిక వహించనున్నారు. ముఖ్యంగా ప్రజా సదుపాయాలను మెరుగుపరచాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాలిబాటలు, రహదారులు, పబ్లిక్‌టాయ్‌లెట్లు, పార్కుల వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వీటన్నింటినీ త్వరితంగా పూర్తిచేయించే బాధ్యత.. వారికప్పగించే విభాగాలనుబట్టి కొత్త ఐఏఎస్‌లపై ఉండనుంది. మేడ్చల్ జిల్లా కొత్త కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జోన్లకా.. ప్రధాన కార్యాలయానికా? నలుగురినీ అడిషనల్ కమిషనర్లుగా బదిలీ చేసినప్పటికీ.. ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లుగా కానీ, జోన్లలో జోనల్ కమిషనర్లుగా కానీ వీరి సేవలను వినియోగించుకోవడంలో కమిషనర్‌దే నిర్ణయం. జోన్లలో అయితే ప్రజా సదుపాయాల కల్పన పనుల్ని పరుగులు తీయించడంతో పాటు రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతోనూ సామరస్యంగా, సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం. ప్రధాన కార్యాలయంలోనైతే ఆయా విభాగాలపరంగా జరిగే పనుల్ని ప్రజలకందాల్సిన సేవల్ని వేగిరంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. వీరి పనితీరు ఎన్నికల్లో తగిన ప్రభావం చూపనుంది కనుక వీరికి జీహెచ్ఎంసీ కొలువు సవాలే. ప్రసాదరావు సిఫార్సుల మేరకు.. ప్రసాదరావు కమిటీ సిఫార్సులు, స్టాఫింగ్ ప్యాటర్న్ మేరకు జీహెచ్ఎంసీ సర్కిళ్లను 18 నుంచి 30కి, జోన్లను ఐదు నుంచి ఆరుకు పెంచారు. గతంలో జీహెచ్ఎంసీలో 11 మంది అడిషనల్ కమిషనర్లు ఉండేవారు. అంతమంది అవసరం లేదని ఆరుగురు అడిషనల్ కమిషనర్లు చాలని సిఫార్సుల్లో పేర్కొన్నారు. బదిలీ అయినవారిని మినహాయించి జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఆరుగురు అడిషనల్ కమిషనర్లున్నారు. కొత్తగా వస్తున్నవారికి అడిషనల్ కమిషనర్ల పోస్టులే ఇస్తే ఈ సంఖ్య పదికి పెరుగుతుంది. గతంలో ఐదు జోన్లున్నప్పుడు ఖైరతాబాద్ జోన్లో మాత్రం ఐఏఎస్ అధికారి జోనల్ కమిషనర్‌గా ఉండేవారు. మిగతాజోన్లలో నాన్ ఐఏఎస్‌లు జోనల్ కమిషనర్లుగా ఉండేవారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బదిలీ అయిన హరిచందన, ముషారఫ్ అలీ ఫారూఖి అటు జోనల్ కమిషనర్లుగా పనిచేయడంతో పాటు కొన్ని విభాగాల అడిషనల్ కమిషనర్లుగానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలే ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన సిక్తా పట్నాయక్ సైతం యూసీడీ, ఐటీ విభాగాల అడిషనల్ కమిషనర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్.. ఇంజినీర్లు జీహెచ్ఎంసీకి బదిలీ అయిన నలుగురిలో చదువు రీత్యా ఒకరు డాక్టర్ కాగా, ముగ్గురు ఇంజినీర్లు. వీరు ఏమేరకు జీహెచ్ఎంసీకి తగిన చికిత్స, ఇంజినీరింగ్ చేస్తారో వేచి చూడాల్సిందే. ఎవరు.. ఎక్కడి నుంచి రాహుల్ రాజ్: సబ్‌కలెక్టర్, బెల్లంపల్లి కొత్తగా జీహెచ్ఎంసీకి బదిలీ అయిన వారిలో రాహుల్‌రాజ్ 2015 బ్యాచ్‌కు చెందినవారు కాగా, కొద్దికాలం కేంద్రంలో వైద్య, కుటుంబ సంక్షేమశాఖలో పనిచేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ చేసిన ఆయన నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా కొద్దికాలం పనిచేశారు. ప్రస్తుతం బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌గా ఉన్న ఆయన జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. బి.సంతోష్: స్పెషలాఫీసర్, వరంగల్ రూరల్ 2016 బ్యాచ్‌కు చెందిన సంతోష్ వరంగల్ ఎన్ఐటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లాలో స్పెషలాఫీసర్‌గా ఉంటూ జీహెచ్ఎంసీకి బదిలీ అయిన ఈయన సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రియాంక ఆల: స్పెషలాఫీసర్,యాదాద్రి భువనగరి మహారాష్ట్ర హెల్త్‌సైన్సెస్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేసిన ప్రియాంక కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖలో కొద్దికాలం ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషలాఫీసర్‌గా ఉన్న ఆమెను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది. పి.ప్రావీణ్య: స్పెషలాఫీసర్, కరీంనగర్ బిట్స్ పిలానీలో బీఈ (మెకానికల్) చేసిన ఈమె కేంద్రంలో ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్ విభాగంలో కొద్దికాలం పనిచేశారు. కరీంనగర్ స్పెషలాఫీసర్‌గా ఉంటూ జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. వీరిలో ప్రావీణ్య కర్ణాటకకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం. బదిలీ అయిన వారు.. హరిచందన దాసరి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా, లేక్స్, జీవవైవిధ్య విభాగాల అడిషనల్ కమిషనర్‌గా పనిచేశారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకతతో పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఫీడ్ ది నీడ్, డాగ్ పార్క్, ఫుడ్‌హబ్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. దుర్గంచెరువు సుందరీకరణపై శ్రద్ధ చూపారు. సీఎస్సార్ ద్వారా పలు పనులు చేపట్టారు. ప్లాస్టిక్ ఫుట్‌ఫాత్‌లు సహా పలు కార్యక్రమాలు చేపట్టారు. ముషారఫ్ ఫారూఖి: ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా, చార్మినార్ పాదచారుల పథకం ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేశారు. లక్డికాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సుందరీకరణ పనుల ద్వారా పేరు తెచ్చుకున్నారు. నగరానికి గ్యాస్ట్రానమీ విభాగంలో యునెస్కో గుర్తింపు రావడంలో తగిన కృషి చేశారు. అద్దెకు సైకిళ్లు వంటివాటిపై శ్రద్ధ చూపారు. సందీప్‌కుమార్ ఝా: బస్తీ దవాఖానాలకు అవసరమైన కమ్యూనిటీ హాళ్ల ఎంపికతోపాటు మీసేవ కేంద్రాల ద్వారా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు చేశారు. ఎస్టేట్స్ విభాగంలో అవకతవకలు, అక్రమాల నిరోధానికి కృషి చేశారు. అద్వైత్‌కుమార్‌సింగ్: జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగంలో అక్రమాల నిరోధానికి కృషి చేశారు. స్పోర్ట్స్ విభాగంలో అవినీతి కట్టడికి ఆన్లైన్ ద్వారా బుకింగ్ అందుబాటులోకి తెచ్చారు. శ్రుతి ఓజా: పారిశుద్ధ్యం, రవాణా, ఎస్టేట్స్ తదితర ఎన్నో విభాగాల్లో పని చేసినా, దేంట్లోనూ ఎక్కువ కాలం ఉండలేదు. చేపట్టిన పనులు ఒక కొలిక్కి వచ్చేలోగా విభాగాలు మారిపోయాయి. ఎస్టేట్స్ విభాగంలో జియోట్యాగింగ్ ద్వారా అక్రమాల నిరోధానికి కృషి చేశారు. సిక్తాపట్నాయక్: యూసీడీ విభాగంలో పలు సంస్కరణలు, ఇంటినెంబర్లకు 2డీ సర్వే తదితర కార్యక్రమాలు చేపట్టారు. -
మహిళా ఐఏఎస్‌లకు కేసీఆర్ పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : గత ప్రభుత్వ మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇద్దరు మహిళా మంత్రులకు కూడా ఈసారి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో మహిళా అధికారులకూ ముఖ్య బాధ్యతలను అప్పగిస్తున్నారు. పరిపాలన ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అధికారులకు పెద్దపీఠ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21 జిల్లాలకు కొత్త పాలానాధికారులను నియమించగా.. వాటిల్లో 8 జిల్లాలకు మహిళా అధికారులను కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. (50 మంది ఐఏఎస్‌ల బదిలీ) పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో మహిళా కలెక్టర్లను నియమించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరానికి యువ ఐఏఎస్ అధికారిని శ్వేతా మహంతికి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. మరో యువ అధికారిని సిక్తా పట్నాయక్‌ను నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి కలెక్టర్‌గా నియమించారు. కేవలం కలెక్టర్లనే కాకుండా ప్రభుత్వ ముఖ్య శాఖల్లో కూడా మహిళా అధికారులకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పించారు. యువ అధికారులు కావడం.. గతంలో ముఖ్యశాఖలకు విధులు నిర్వర్తించిన అనుభవం ఉండటంతో పాలనాపరంగా కలిసోస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవల ముగిసిన పల్లెప్రగతి తొలి విడత కార్యక్రమంలో సాధించిన ఫలితాలు, త్వరలో అమల్లోకి తేనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకుని సర్కారు జిల్లా కల్లెక్టర్ల బదిలీలు జరిపినట్లు తెలుస్తోంది. నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హరిచందన జనగామ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కె.నిఖిల కొత్తగా బాధ్యతలు చేపట్టిన మహిళా అధికారులు 1. పాసమి బసు, కలెక్టర్ (వికారాబాద్) 2. దేవసేన (ఆదిలాబాద్) 3. హరిచందన (నారాయణ్‌పేట) 4. శ్వేతా మహంతి (హైదరాబాద్) 5. శృతి ఓఝూ (జోగులాంబ గద్వాల) 6. సిక్తా పట్నయక్ (పెద్దపల్లి) 7. కె. నిఖిల (జనగామ) 8. షేక్ యాస్మిన్ బాషా (వనపర్తి) -
మార్పు ప్రజల నుంచే రావాలి
వనపర్తి: మా ఊరు అభివృద్ధి చెందాలి.. అనే భావన అందరిలోనూ వచ్చినప్పుడే మార్పు కనిపిస్తుంది.. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష నెరవేరుతుంది.. అని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్వితా సబర్వాల్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి, మంగంపల్లి, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమాల్లో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా చిన్నమందడిలో పాటిస్తున్న పారిశుద్ధ్య పరిరక్షణ చర్యల గురించి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న పనులు, మార్కెటింగ్, హరితహారం తదితర కమిటీల సభ్యులతో విడివిడిగా మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో చెత్త వేసేందుకు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన స్టీల్ చెత్తబుట్టలు, ఇంటింటికి నిర్మించుకున్న ఇంకుడు గుంతలు, గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును కలెక్టర్ శ్వేతామహంతితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాటామంతి.. పారిశుద్ధ్య సిబ్బంది రోజూ ఉదయం ఎన్ని గంటలకు చెత్తసేకరణకు వస్తారు..? ఇంటింటికీ మొక్కలు ఇచ్చారా.? సర్పంచ్, అధికారుల పనితీరు ఎలా ఉంది..? అంటూ సీఎంఓ గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రత సర్పంచు, అధికారులతో పాటు ప్రజలందరి బాధ్యతగా భావించాలని సూచించారు. ఈగలు, దోమలు లేకుండా గ్రామంలో డ్రెయినేజీలు శుభ్రం చేయటంతో పాటు చెత్తను ఏ రోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. అందుకు ప్రజలు సమాధానం ఇస్తూ.. సర్పంచు గత పదేళ్ల నుంచి ఊరిని అభివృద్ధి చేస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని తెలిపారు. రోడ్లపై చెత్తగాని, కవర్లుగాని పడితే తానే స్వయంగా తీసి రోడ్లు పక్కనే ఉండే చెత్తబుట్టలో వేస్తారని, ఆయన్ను చూసి మేమంతా మారిపోయామని, మా ఊర్లో ఎక్కడ కూడా చెత్త కనిపించదని, కావాలంటే చూసుకోండని అధికారులతో బదులివ్వగా గ్రామస్తులను సీఎంఓ భేష్..! అని అభినందించారు. పర్యటనలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మెగారెడ్డి, కిచ్చారెడ్డి, సర్పంచులు సూర్యచంద్రారెడ్డి, శారద, డీఆర్డీఓ గణేష్, డీపీఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిన్నమందడి గ్రామస్తులతో మాట్లాడుతున్న అధికారులు ప్రతి చెట్టుకు నెంబరు బాగుంది : ప్రియాంక వర్గీస్ గ్రామంలోకి వస్తుంటేనే బాగా గమనించాం.. మీ ఊరి క్రమశిక్షణ చాలా బాగుంది. గ్రామంలోని ప్రతి చెట్టుకూ నెంబర్లు వేశారు. చాలా గ్రామాలు తిరిగాను.. ఎక్కడా ఇలా కనిపించలేదు. సర్పంచు సూర్య చంద్రారెడ్డి, గ్రీన్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం బాగుంది. వాచర్లకు మొక్కల సంరక్షణ బాధ్యత ఇవ్వడం, ఒకవేళ మొక్క ఎండితే ఏ నంబర్ మొక్క ఎండిందో తెలుసుకుని అక్కడే మరో మొక్కను నాటాలని నిర్ణయించుకోవడం లాంటి పనులు బాగా నచ్చాయి. -
ట్రీట్మెంట్ అదిరింది
వనపర్తి టౌన్: గొడ్డలి వేటుకు గురికావాల్సిన 8 చెట్లకు పునరుజ్జీవం వచ్చింది. వనపర్తి జిల్లాలోని నాగవరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు పక్కనున్న చెట్లను నరికివేయకుండా ట్రీ ట్రాన్స్‌లొకేషన్ ద్వారా మరోచోట నాటాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. దీంతో అధికారులు హైదరాబాద్‌కు చెందిన ట్రీ ట్రాన్స్‌లొకేషన్ ఉప్పలయ్యను సంప్రదించారు. మొత్తం 12 చెట్లకు 8 చెట్లు మరోచోట నాటితే బతుకుతాయని చెప్పారు. దీంతో 4 రోజుల క్రితం చెట్ల చుట్టూ 5 అడుగుల గోతి తీసి.. ఫిట్టింగ్ బెల్డ్ సహాయంతో గోనెసంచుల్లో వేర్లు బయటికి రాకుండా మట్టితో బిగుతుగా కట్టి రసాయనిక మందులు పూశారు. అనంతరం శివారులోని ఖాళీ స్థలంలో వాటిని నాటారు. -
ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..
సాక్షి, చిన్నంబావి(మహబూబ్‌నగర్) : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం పనుల్లో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల క్రితం వచ్చి చెప్పినప్పటికీ మీలో ఎందుకు మార్పు రావడంలేదని ప్రశ్నించారు. పెద్దదగడ గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత చేయించాల్సిన పనులను, మిషన్ ద్వారా ఎందుకు చేయించారని అని ప్రశ్నించారు. గురువారం మండలంలోని పెద్దదగడ, చెల్లెపాడు, చిన్నంబావి గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటకపోవడం, అదేవిధంగా గ్రామాల్లో 50శాతం కూడా పూర్తికాకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది చదవండి : దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి ప్లాస్టిక్ నిషేధిద్దాం.. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత గ్రామలుగా తీర్చిదిద్దడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, కనీసం గ్రామంలోని ప్రజలకు అవగాహన కూడా కల్పించలేకపోతున్నారని అన్నారు. కనీసం మహిళా సంఘాలను కూడా చైతన్య పరచలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నా రు. హరితహరం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన పెద్దదగడ గ్రామ కార్యదర్శి, ఫిల్డ్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వా లని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ బద్రీనాథ్, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామమ్మ, అభిలాష్ రావు, ఏపీఓ ఉన్నిస బేగ్, తహసీల్దార్ పర్‌కుందా తన్సిమా ఉన్నారు. -
ఐరన్ లేడీ
ఉక్కు సంకల్పంతో పాలన విధుల్ని నిర్వహిస్తున్న కలెక్టర్.. శ్వేతా మహంతి. అంతేకాదు, బాలికలలో రక్తహీనతను తగ్గించేందుకు ఆమె కృషి చేస్తున్నారు.అందుకే ఆమె.. ఐరన్ లేడీ! ఖిలా ఘన్పూర్... పేరులోనే ఉంది కోట. ఆ కోటకు ట్రెక్కింగ్ చేస్తోంది ఓ చురుకైన అమ్మాయి. పేరు శ్వేతా మహంతి. కాకతీయుల సామంత రాజు గోన గణపారెడ్డి 13వ శతాబ్దంలో కట్టిన కోట అది. ఒకప్పటి మహబూబ్‌నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా. జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ‘క్లైంబ్ ఆన్ ప్రోగ్రామ్’ పెట్టి తాను స్వయంగా ఆరు కిలోమీటర్ల దూరం ట్రెకింగ్‌కి సిద్ధమయ్యారు ఆ జిల్లా కలెక్టర్. ఇంతకీ బృందంలో కలెక్టర్ ఎవరై ఉంటారని చూస్తే... అందరిలోకి చురుగ్గా కనిపిస్తున్న అమ్మాయే ఆ కలెక్టర్. ‘ఇది చక్కటి టూరిస్ట్ ప్లేస్ అని, ఓవర్ నైట్ ట్రిప్‌కి అనువైన ప్రదేశం అని, రాక్ క్లైంబింగ్, రాపెలింగ్, జెయింట్ స్వింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌కి ఖిలా ఘన్పూర్ (ఘన్పూర్ ఫోర్ట్) మంచి ఎంపిక’ అని ఆమె చెప్పిన మాటలు మరుసటి రోజు పతాక శీర్షికగా వార్తల్లో వచ్చాయి. ఇంకా ఆమె... ‘‘ఐఏఎస్ ట్రైనింగ్‌లో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొండలెక్కాలి, పర్వతాలను అధిరోహించాలి. మాకు ప్రతివారం హిమాలయాల్లో ట్రెక్కింగ్ ఉండేది’’ అని కూడా చెప్పారు నవ్వుతూ. కలెక్టర్ ఇంత డైనమిక్‌గా ఉంటే జిల్లాలో పాలన కూడా ఈవెంట్‌ఫుల్‌గా ఉంటుందనే ఆశ చిగురించింది ఆ జిల్లా ప్రజల్లో. మహిళల ఆరోగ్యంపై దృష్టి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ‘కలెక్టర్‌గా రొటీన్ అడ్మినిస్ట్రేషన్‌కి పరిమితం అయి పోకూడదు. ఏదైనా చేయాలి. ఐఏఎస్ చేసి కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్న జిల్లాకు తన వంతుగా ఏదైనా చేయాలి’ అనుకున్నారు శ్వేతా మహంతి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, క్షేత్రస్థాయిలో చేయాల్సిన మార్పులు చేయాలి అనుకున్న తర్వాత జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లో మహిళలు, యువతులు, బాలికలలో ఎక్కువ మంది బలహీనంగా ఉండటాన్ని ఆమె గమనించారు. పాలనా విధులే కాకుండా.. తను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి అనుకున్నారు. జిల్లాలో ఆరోగ్య సేవలు ఎలా నడుస్తున్నాయో స్వయంగా పరిశీలించారు. నూటికి నలభై మంది మహిళలు (బాలికలు, యువతులు కలిపి) తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత ఇంత తీవ్రంగా ఉండటం ఏమిటి? ఆమె మనసును తొలిచే ప్రశ్న అయింది. రక్తహీనతకు అనుబంధంగా తోడయ్యే అనేక ఆరోగ్య సమస్యలు కూడా కళ్ల ముందు మెదిలాయి. గర్భిణికి ఐరన్ ట్యాబ్లెట్లు, విటమిన్ మందులివ్వడంతో పరిష్కారమయ్యే సమస్య కాదిది అనుకున్నారామె. వ్యాధి లక్షణానికి కాదు వ్యాధి కారకానికి మందు వెయ్యాలి అని కూడా అనుకున్నారు. ‘సమత’ ఆవిర్భవించింది! శ్వేత ఆదేశాలపై జిల్లాలోని 110 ప్రభుత్వ పాఠశాలకు మెడికల్ టీమ్ లు వెళ్లాయి. మొత్తం ఎనిమిది వేల మంది అమ్మాయిలకు రక్తపరీక్షలు జరిగాయి. ఇందుకోసం స్కూలు టీచర్లకు ప్రత్యేక ఓరియెంటేషన్ ఇచ్చి, పిల్లలకు పీరియడ్ క్యాలెండర్ రికార్డు చేయించారు మహంతి. పీరియడ్స్‌లో ఎదురయ్యే అపసవ్యతలను తేదీల వారీగా నోట్‌బుక్‌లో రాయడం పిల్లలకు నేర్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెప్పించి బయోడిగ్రేడబుల్ (నేలలో కలిసిపోయేవి) సానిటరీ నాప్కిన్స్ ఇప్పించారు. ప్రతి నెలా విజిటింగ్ మెడికల్ టీమ్ స్కూలుకు వస్తుంది, అమ్మాయిలు నోట్‌బుక్‌లో నమోదు చేసిన వివరాలను అధ్యయనం చేసి మందులిస్తుంది. ఏడాది క్రితం మొదలైన ఈ మొత్తం ప్రోగ్రామ్‌కి ‘సమత’ అనే పేరు పెట్టారు శ్వేతా మహంతి. ఆరు నెలలకు ఆమె ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చింది. స్కూలు పిల్లల్లో రక్తహీనత తగ్గుముఖం పట్టింది. స్కూళ్లకు వాలంటీర్లు వనపర్తి జిల్లాలో ఎక్కువగా గ్రామాలే. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి. పిల్లలకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నట్లు గణాంకాల్లో రికార్డ్ అయింది. స్కూలుకి వెళ్లి చూస్తే... పిల్లలకు తెలిసింది అది ఒక కంప్యూటర్ అని మాత్రమే. కీ బోర్డు, సీపీయు, మౌస్ అని పైకి కనిపించే విడిభాగాల పేర్లు చెప్పి సరిపెడుతున్న సంగతి కూడా శ్వేత దృష్టికి వచ్చింది. ప్రపంచం కంప్యూటర్ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో కంప్యూటర్ లిటరసీ లేకపోతే ఎంత పెద్ద చదువులు చదువుకున్నా నిరక్షరాస్యులుగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలందరికీ కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఇంటర్నెట్లో సమాచారాన్ని తెలుసుకోవడం కూడా నేర్పించాలని ఆదేశించారామె. ఇందుకోసం వాలంటీర్ల బృందం ఇప్పుడు స్కూళ్లకు ల్యాప్‌టాప్‌లతో వస్తోంది. గూగుల్‌లో తమకు కావాల్సిన సమాచారాన్ని ఎలా రాబట్టుకోవడం, ఈ మెయిల్స్ పంపించడం వంటివన్నీ పిల్లలకు నేర్పిస్తోంది. సత్తువ లేకపోవడం ఏమిటి! వనపర్తి జిల్లాలో వేరుశనగ పంట విరివిగా పండిస్తారు. ఇంత విస్తృతంగా వేరుశనగ పండించే గ్రామాల్లో మహిళలకు ఐరన్ లోపం, రక్తహీనత ఉండడం ఏమిటి అని శ్వేతామహంతికి మొదటే సందేహం కలిగింది. ‘సమత’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు ఊళ్లకు కుటీర పరిశ్రమలు తెప్పించారు. ‘‘వనపర్తి జిల్లాలో వేరుశనగ బాగా పండుతుంది. రైతులంతా గిట్టుబాటు చూసుకుని పంట దిగుబడిని అలాగే అమ్మేస్తున్నారు తప్ప ఆ ముడిసరుకు ఆధారంగా నడిచే పరిశ్రమల మీద దృష్టి పెట్టడం లేదు. ఆ పని స్వయం సహాయక బృందాల చేత చేయించడంతో మంచి లాభాలను చూస్తున్నారిప్పుడు. శ్వేత చొరవతో ప్రయోగాత్మకంగా మొదట దత్తాయిపల్లిలో వేరుశనగ గింజలను ప్రాసెస్ చేసే యూనిట్ ప్రారంభమైంది. ఒకప్పుడు మధ్య దళారులు, పెద్ద వ్యాపారులకు అందుతూ వచ్చిన లాభాలు ఇప్పుడు గ్రామీణ మహిళలకే అందుతున్నాయి. వేరుశనగ పప్పు– బెల్లంతో చేసే చిక్కీకి మంచి డిమాండ్ ఉంది. రాష్ట్ర కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి భారీ ఆర్డర్లు రావడంతో ఆ యూనిట్ నెలలోనే కమర్షియల్‌గా నిలదొక్కుకున్నది. ఈ పరిశ్రమలు నడుపుతున్న మహిళలు చదువుకున్న వాళ్లు కూడా కాదు. ఒక్కో కుటుంబానికి ఎంత మేరకు ఆదాయం పెరిగిందనే అంచనాకు రావాలంటే మరికొన్ని నెలలు పడుతుంది. అయితే ఇది మహిళల స్వయం శక్తికి, సాధికారతకు, మహిళ ఆరోగ్యానికీ సోపానం అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అన్నారామె దృఢ విశ్వాసంతో. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల చేత ఓటు వేయించడానికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారామె. ఇప్పుడు మహిళలకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ నేర్పించే ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేశారు. పరిపాలన అంటే తాయిలంతో బుజ్జగించడం కాదు, ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అనువైన వాతావరణాన్ని రూపొందించడం. శ్వేతా మహంతి అదే పని చేస్తున్నారు. పిల్లల్లో న్యూనత తలెత్తకూడదు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సౌకర్యమూ చేరాలనేది నా ఆకాంక్ష. ఐఏఎస్‌గా నాకు జిల్లా పరిపాలనకు సంబంధించిన విస్తృత అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి గ్రామాల్లో పిల్లలకు ఎంత చేయగలనో అంతా చేయాలనిపించింది. నా పిల్లలకు నేర్చుకోవడానికి ఎన్ని అవకాశాలున్నాయో ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించని పిల్లలకు కూడా ఆ అవకాశాలన్నీ అందుబాటులోకి రావాలి. వాళ్లు పెద్దయ్యాక... ‘మేము గ్రామాల్లో పుట్టాం, తెలుగు మీడియంలో చదువుకున్నాం, కంప్యూటర్ తెలియకపోవడంతో మిగిలిన వాళ్లతో పోల్చినప్పుడు వెనుకపడిపోతున్నాం’ అనే న్యూనత ఆ పిల్లల్లో ఎప్పటికీ తలెత్తకూడదు. – శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్, వనపర్తి జిల్లా, తెలంగాణ క్లాసికల్ డాన్స్ ఇష్టం శ్వేతా మహంతి తండ్రి ప్రసన్న కుమార్ మహంతి. ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం కేంద్ర విధుల్లో ఉన్నారాయన. భర్త రజత్ కుమార్ సైనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. తండ్రిలా ఐఏఎస్ కావాలనే కలను నిజం చేసుకోవడానికి తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్‌కు దూరమయ్యారు శ్వేత. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. శ్వేత తండ్రి అడుగు జాడల్లో నడిచినట్లే ఆమె పిల్లలు కూడా నడుస్తారేమో. ఒక పాపకు ఎనిమిదేళ్లు, ఒక పాపకు నాలుగు. వాళ్ల కలల నిర్మాణం ఎలా ఉంటుందో చూడాలి. -
కలెక్టరమ్మ మాటతీరు మార్చుకో..
సాక్షి, వనపర్తి/వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూరికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. దీంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో వనపర్తి కలెక్టర్ నోటి దురుసు, సస్పెన్షలపై ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు అధికారులు లేకపోవటంతో వెనుదిరిగారు. సస్పెన్షన్‌పై రచ్చ కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రాత్రి శ్రీరంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ వెంకటరమణలపై రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించక పోవడం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏంటని ఆగ్రహించారు. అలాగే ఆదివారం ప్రత్యేక పనిదినం విధులు నిర్వహించలేదని వీఆర్ఓ వెంకటరమణపై ఒకేసారి ఒకే మండలంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశించారు. అలాగే ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్ఓ, గోపాల్పేట మండలం బుద్దారం వీఆర్ఓలను కూడా వేటు వేసినట్టు సమాచారం. ఆ సందర్భంగా కలెక్టర్ అధికారులను దుర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కలెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. పనిలో వెవకబడిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. గతంలో విద్యాశాఖలో ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. అప్పట్లో ఉపాధ్యాయులంతా ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో కలెక్టర్ వెనక్కి తగ్గారు. ఒక్కటైన రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ తీరు బాగాలేదంటూ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు ఏకమై నిరసన బాట పట్టారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైనప్పటినుంచి రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సెలవులు తీసుకునే అవకాశం కూడా లేకపోవటంతో పనివత్తిడికి గురయ్యారు. అయినప్పటికీ ఇతర జిల్లాలతో పాటుగా ప్రోగ్రెస్ సాధించామని వారి వాదన. ఆరునెలలుగా పది మందికిపైగా రెవెన్యూ సిబ్బందిపై వేటు పడిందని, ఎప్పుడు ఎవరు కలెక్టర్ ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందోనన్న భయంతో పని చేయాల్సి వస్తుందని అంటున్నారు. కలెక్టర్ నోటి దురుసు, అన్యాయంగా సస్పెన్షన్లపై నిరసన చేస్తున్నట్లు బ్యానర్ తయారు చేయించి ధర్నాకు దిగారు. నిరసనలో భాగంగా తహసీల్దార్ శ్రీనివాస్‌రావు కంటతడి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా రాత పూర్వకంగా ఉన్న రికార్డులను కంప్యూటరీకరణ చేస్తుండటంతో అవగాహన లేక తప్పులు దొర్లాయని, వాటికి రెవెన్యూ సిబ్బందిని బాధ్యులుగా చేయడం సరైంది కాదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖండించారు. కలెక్టర్ తీరు మార్చుకోవాలని, సస్పెన్షన్‌కు గురైన వారిని విధుల్లో చేర్చుకోవాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఒకేసారి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు మానేసి నిరసన చేపట్టడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన కార్యాలయాలు రెవెన్యూ ఉద్యోగుల మూకుమ్మడి నిరసనతో జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు అధికారులు లేక వెలవెలబోయాయి. దీంతో వివిధ పనుల కోసం గ్రామీణ ప్రాంతాల వచ్చిన రైతులు, విద్యార్థులు అధికారులు లేక అసౌకర్యానికి గురయ్యారు. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
మదనాపురం : మండలంలోని అజ్జకొల్లులో మంగళవారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ వివరాలను తహసీల్దార్ సింధూజను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని, ప్రతి రైతుకు చెక్కును అందజేస్తామని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశమని వివరించారు. అనంతరం ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, ఆర్ఐ ఎండీ గౌస్, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రైతు కోఆర్డినేటర్ రాములుగౌడ్, మహిళాసంఘాల లీడర్లు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి వనపర్తి : వీపనగండ్ల మండలం తూంకుంటలో ఏర్పాటు చేయనున్న పాలశీతలీకరణ కేంద్రం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లా పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, డీఆర్డీఓ గణేష్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు కోసం గుర్తించిన భవనంలో విద్యుత్, నీటివసతి, డ్రెయినేజీ, పాలమిత్ర సొసైటీల ఏర్పాటు విషయంపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పాలశీతలీకరణ కేంద్రానికి రోజూ వచ్చే పాలు కేంద్రం నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, పాలసేకరణ కోసం వినియోగించే వాహనాలు, రాబడి తదితర అంశాలను కలెక్టర్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. తూంకుంట సమీప గ్రామాల నుంచి పాలకేంద్రానికి ఎక్కువగా వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పాలలభ్యత తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. -
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
వనపర్తి విద్యావిభాగం : జిల్లాలో 2018 మార్చి పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గతేడాది ఫలితాలను విశ్లేషించుకుని పక్కా ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో, జిల్లాలో ఏ సమావేశం జరిగినా పదో తరగతి పరీక్షల్లో చివరి స్థానం వచ్చిందని వనపర్తి జిల్లా గురించి చర్చ రావడం విచారకరమన్నారు. ఏళ్లుగా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అదే పాఠశాలలో పనిచేస్తున్నా.. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కనీసం పాస్ కాలేకపోవడం మీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం పరీక్షలకు ఎంతో సమయం ఉందని, పక్కా ప్రణాళికలతో, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈసారి ఫలితాలు అనుకున్న విధంగా వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. పరీక్షలను పకడ్భందీగా నిర్వహిస్తామని, మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేదన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం అమలు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. బిల్లు రాలేదని కాంట్రాక్టర్ వంటగదికి తాళం వేశారని గోపాల్పేట మండలం చెన్నూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొత్తకోట మోడల్ స్కూల్, వనపర్తి తెలుగువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తదితర పాఠశాలల్లో వంటగదులు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజనం బియ్యం 50కిలోల బస్తాలో తూకం తక్కువగా వస్తున్నాయని పలువురు హెచ్ఎంలు తెలిపారు. ఎంఎన్ఎస్ను పక్కాగా అమలు చేయాల్సిందే... జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వందేమాతరం పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎన్ఎస్ (మినిమమ్ న్యూమరికల్ స్కిల్స్) కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. త్రీ ఆర్స్ కార్యక్రమం పూర్తయ్యిందని, ఫలితాల్లో వెనుకబడి ఉన్న పాఠశాలలు డిసెంబర్ వరకు కొనసాగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కనీసం సాధారణ లెక్కలు వేగంగా, కచ్చితంగా చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై డీఈఓ సుశీందర్‌రావు హెచ్ఎంలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
శ్రమతోనే ఉత్తమ ఫలితం
వనపర్తి రూరల్ : కఠోర శ్రమ చేస్తే విజయం వరిస్తుందని విద్యార్థి దశలో అటు విద్య ఇటు క్రీడలను సమతూకంలో చూడాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రికుంట గిరిజన గురుకుల సంక్షేమ బాలికల కళాశాలలో ఫోర్త్, థర్డ్ జోన్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రధాన్యత ఇస్తుందన్నారు. వనపర్తికి తప్పకుండా గురుకుల డిగ్రీ కళాశాలను తీసుకొస్తామన్నారు. కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన క్రీడాకారిణిని సునీతను సన్మానించారు. అన్ని రంగాల్లో రాణించాలి బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. బాలికల్లో పోటీతత్వం పెరిగిందని అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నారు. క్రీడలంటే గెలుపోటములే ప్రధానం కాదని సోదరభావం, సహయ సహకారాలు పెంపొందుతాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మెంటన్, అ«థ్లెటిక్స్ విభాగాల్లో క్రీడలను నిర్వహిస్తుండగా పాత మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి క్రీడాకారులు హజరయ్యారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల ఉప కార్యదర్శి విజయలక్ష్మి, రీజినల్ కోఆర్డినేటర్ వెంకటరత్నం, రాష్ట్ర క్రీడల అధికారి రమేష్‌కుమార్, అధికారి కల్యాణ్, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, ఎంపీపీ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్, కౌన్సిలర్లు వాకిటీశ్రీధర్, లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధికారుల అండదండలతో..?
బొబ్బిలి, న్యూస్‌లైన్: పేదల బియ్యాన్ని పక్కదారిలో మళ్లించేందుకు పెద్ద రాకెట్టే నడుస్తోంది. రూపాయి బియ్యాన్ని నల్లబజారులో రూ.16 నుంచి రూ.20 వరకూ విక్రయాలు చేయడానికి డీలర్లు పన్నుతున్న మాయాజాలానికి అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొబ్బిలి నుంచి తరలివెళ్తున్న 112 క్వింటాళ్ల పేదల బియ్యం బాడంగి మండలం కోటిపల్లి వద్ద పట్టుబడడంతో అసలు రంగు బయట పడింది. బొబ్బిలి కేంద్రంగా కిలో రూపాయి బియ్యాన్ని అక్రమంగా తరలించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పటివరకూ రేషనుడిపోలకు గోదాంల నుంచి బియ్యం చేరిపోయిన తరువాత ఆ బస్తాల రూపం మారిపోయి పక్కదారి పట్టేవి. అయితే ఇప్పుడు డీలర్లు వారి అక్రమాల రూటు మార్చారు. గోదాం నుంచే నేరుగా అక్రమ ప్రదేశాలకు తరలించడానికి సిద్ధమయ్యారు. ఇందుకు బొ బ్బిలిలోని మార్కెట్ కమిటీలో ఉండే గోదాంలనే వేదికగా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బొబ్బిలి ప్రాంతంలో ఉండే డీలర్లలో కొందరు పది డిపోలకు మించి నిర్వహిస్తున్నారు. దాంతో ఒకే సారి లారీలతో సరుకును బయటకు పంపుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క డిపోకు సరిపడిన బియ్యాన్ని తీసుకెళ్లకుండా పార్ట్‌లుగా తీసుకెళ్లడం మొదలు పెడుతున్నట్లు సమాచారం. దాంతో మిగిలిన సగాన్ని ఇటు నుంచి ఇటే నల్లబజారుకు తరలించడానికి సులభమవుతుందని తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి గోదాం నుంచి సరుకులు బయటకు వెళ్తాయి. ఆ తరువాత లారీలు లోపలకు వచ్చినా ఎవరికి ఎటువంటి అనుమానం రాకపోవడంతో వీటిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగు లారీల వరకూ సరుకుతో బయటకు రాత్రి వేళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీటికి గోదాం వద్ద విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారుల సంపూర్ణ మద్దతు ఉందనే విమర్శలు ఉన్నాయి. కోటిపల్లి వద్ద 112 క్వింటాళ్ల వరకూ ప్రభుత్వం ముద్రతో ఉండే బస్తాలు దొరికినా అవి ఎక్కడ నుంచి వచ్చాయో రెండు రోజులైనా అధికారులకు తెలియలేదు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఈ బియ్యం వెళ్లాయని, ఆ ఖాళీలను భర్తీ చేయడానికి రాత్రికి రాత్రే రైసు మిల్లుల నుంచి 112 క్వింటాళ్లను తెచ్చి అధికారుల లెక్కల్లో తేడాలు లేకుండా అందరూ జాగ్రత్త పడ్డారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో డీలరుకు ప్రధాన పాత్ర ఉండడంతో అధికారులపై అధికారపార్టీ ఒత్తిడి కూడా ఎక్కువైనట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే ఈ కేసు విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించమని కోరడంతోనే విచారణ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన బియ్యం విషయమై గురువారం బొబ్బిలి వచ్చిన సబ్ కలెక్టరు శ్వేతామహంతిని విలేకరులు ప్రశ్నిస్తే ఇంకా విచారణ చేస్తున్నామని, పక్కదారి పట్టిన బియ్యం దొరికాయి కదా... ఆ సమాచారం ఇచ్చిన వారికి ధన్య వాదా లు అని చెప్పి వెళ్లిపోయారు. ఏకంగా 112 క్వింటాళ్ల బియ్యం బయటకు వచ్చాయంటే అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పటివరకూ తెలుసుకోలేని పరిస్థితిలో అధికారుల విచారణ ఉందని పలువురు బాహాటంగా తప్పుపడుతున్నారు.