కలెక్టర్ శ్వేతామహంతి
సాక్షి, వనపర్తి/వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూరికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. దీంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో వనపర్తి కలెక్టర్ నోటి దురుసు, సస్పెన్షలపై ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు అధికారులు లేకపోవటంతో వెనుదిరిగారు.
సస్పెన్షన్‌పై రచ్చ
కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రాత్రి శ్రీరంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్‌ఓ వెంకటరమణలపై రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించక పోవడం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏంటని ఆగ్రహించారు. అలాగే ఆదివారం ప్రత్యేక పనిదినం విధులు నిర్వహించలేదని వీఆర్‌ఓ వెంకటరమణపై ఒకేసారి ఒకే మండలంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశించారు. అలాగే ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్‌ఓ, గోపాల్‌పేట మండలం బుద్దారం వీఆర్‌ఓలను కూడా వేటు వేసినట్టు సమాచారం. ఆ సందర్భంగా కలెక్టర్ అధికారులను దుర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కలెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. పనిలో వెవకబడిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. గతంలో విద్యాశాఖలో ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. అప్పట్లో ఉపాధ్యాయులంతా ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో కలెక్టర్ వెనక్కి తగ్గారు.
ఒక్కటైన రెవెన్యూ ఉద్యోగులు
కలెక్టర్ తీరు బాగాలేదంటూ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు ఏకమై నిరసన బాట పట్టారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైనప్పటినుంచి రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సెలవులు తీసుకునే అవకాశం కూడా లేకపోవటంతో పనివత్తిడికి గురయ్యారు. అయినప్పటికీ ఇతర జిల్లాలతో పాటుగా ప్రోగ్రెస్ సాధించామని వారి వాదన. ఆరునెలలుగా పది మందికిపైగా రెవెన్యూ సిబ్బందిపై వేటు పడిందని, ఎప్పుడు ఎవరు కలెక్టర్ ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందోనన్న భయంతో పని చేయాల్సి వస్తుందని అంటున్నారు. కలెక్టర్ నోటి దురుసు, అన్యాయంగా సస్పెన్షన్‌లపై నిరసన చేస్తున్నట్లు బ్యానర్ తయారు చేయించి ధర్నాకు దిగారు. నిరసనలో భాగంగా తహసీల్దార్ శ్రీనివాస్‌రావు కంటతడి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా రాత పూర్వకంగా ఉన్న రికార్డులను కంప్యూటరీకరణ చేస్తుండటంతో అవగాహన లేక తప్పులు దొర్లాయని, వాటికి రెవెన్యూ సిబ్బందిని బాధ్యులుగా చేయడం సరైంది కాదని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖండించారు. కలెక్టర్ తీరు మార్చుకోవాలని, సస్పెన్షన్‌కు గురైన వారిని విధుల్లో చేర్చుకోవాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఒకేసారి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు మానేసి నిరసన చేపట్టడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
వెలవెలబోయిన కార్యాలయాలు
రెవెన్యూ ఉద్యోగుల మూకుమ్మడి నిరసనతో జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు అధికారులు లేక వెలవెలబోయాయి. దీంతో వివిధ పనుల కోసం గ్రామీణ ప్రాంతాల వచ్చిన రైతులు, విద్యార్థులు అధికారులు లేక అసౌకర్యానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment