మాట్లాడుతున్న స్మితాసబర్వాల్
వనపర్తి: మా ఊరు అభివృద్ధి చెందాలి.. అనే భావన అందరిలోనూ వచ్చినప్పుడే మార్పు కనిపిస్తుంది.. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష నెరవేరుతుంది.. అని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్వితా సబర్వాల్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి, మంగంపల్లి, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమాల్లో సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా చిన్నమందడిలో పాటిస్తున్న పారిశుద్ధ్య పరిరక్షణ చర్యల గురించి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న పనులు, మార్కెటింగ్, హరితహారం తదితర కమిటీల సభ్యులతో విడివిడిగా మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో చెత్త వేసేందుకు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన స్టీల్ చెత్తబుట్టలు, ఇంటింటికి నిర్మించుకున్న ఇంకుడు గుంతలు, గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును కలెక్టర్ శ్వేతామహంతితో కలిసి పరిశీలించారు.
ప్రజలతో మాటామంతి..
పారిశుద్ధ్య సిబ్బంది రోజూ ఉదయం ఎన్ని గంటలకు చెత్తసేకరణకు వస్తారు..? ఇంటింటికీ మొక్కలు ఇచ్చారా.? సర్పంచ్, అధికారుల పనితీరు ఎలా ఉంది..? అంటూ సీఎంఓ గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రత సర్పంచు, అధికారులతో పాటు ప్రజలందరి బాధ్యతగా భావించాలని సూచించారు. ఈగలు, దోమలు లేకుండా గ్రామంలో డ్రెయినేజీలు శుభ్రం చేయటంతో పాటు చెత్తను ఏ రోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. అందుకు ప్రజలు సమాధానం ఇస్తూ.. సర్పంచు గత పదేళ్ల నుంచి ఊరిని అభివృద్ధి చేస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని తెలిపారు. రోడ్లపై చెత్తగాని, కవర్లుగాని పడితే తానే స్వయంగా తీసి రోడ్లు పక్కనే ఉండే చెత్తబుట్టలో వేస్తారని, ఆయన్ను చూసి మేమంతా మారిపోయామని, మా ఊర్లో ఎక్కడ కూడా చెత్త కనిపించదని, కావాలంటే చూసుకోండని అధికారులతో బదులివ్వగా గ్రామస్తులను సీఎంఓ భేష్..! అని అభినందించారు. పర్యటనలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మెగారెడ్డి, కిచ్చారెడ్డి, సర్పంచులు సూర్యచంద్రారెడ్డి, శారద, డీఆర్‌డీఓ గణేష్, డీపీఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చిన్నమందడి గ్రామస్తులతో మాట్లాడుతున్న అధికారులు
ప్రతి చెట్టుకు నెంబరు బాగుంది : ప్రియాంక వర్గీస్
గ్రామంలోకి వస్తుంటేనే బాగా గమనించాం.. మీ ఊరి క్రమశిక్షణ చాలా బాగుంది. గ్రామంలోని ప్రతి చెట్టుకూ నెంబర్లు వేశారు. చాలా గ్రామాలు తిరిగాను.. ఎక్కడా ఇలా కనిపించలేదు. సర్పంచు సూర్య చంద్రారెడ్డి, గ్రీన్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం బాగుంది. వాచర్లకు మొక్కల సంరక్షణ బాధ్యత ఇవ్వడం, ఒకవేళ మొక్క ఎండితే ఏ నంబర్ మొక్క ఎండిందో తెలుసుకుని అక్కడే మరో మొక్కను నాటాలని నిర్ణయించుకోవడం లాంటి పనులు బాగా నచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment