ఐరన్‌ లేడీ | Collector Shweta Mahanti Climb on program to develop tourism | Sakshi
Sakshi News home page

ఐరన్‌ లేడీ

Published Mon, Feb 11 2019 2:14 AM | Last Updated on Mon, Feb 11 2019 2:45 AM

Collector Shweta Mahanti Climb on program to develop tourism - Sakshi

శ్వేతా మహంతి, ఐఏఎస్‌

ఉక్కు సంకల్పంతో పాలన విధుల్ని నిర్వహిస్తున్న కలెక్టర్‌.. శ్వేతా మహంతి. అంతేకాదు, బాలికలలో రక్తహీనతను తగ్గించేందుకు ఆమె కృషి చేస్తున్నారు.అందుకే ఆమె.. ఐరన్‌ లేడీ!

ఖిలా ఘన్‌పూర్‌... పేరులోనే ఉంది కోట. ఆ కోటకు ట్రెక్కింగ్‌ చేస్తోంది ఓ చురుకైన అమ్మాయి. పేరు శ్వేతా మహంతి. కాకతీయుల సామంత రాజు గోన గణపారెడ్డి 13వ శతాబ్దంలో కట్టిన కోట అది. ఒకప్పటి మహబూబ్‌నగర్‌ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా. జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ‘క్లైంబ్‌ ఆన్‌ ప్రోగ్రామ్‌’ పెట్టి తాను స్వయంగా ఆరు కిలోమీటర్ల దూరం ట్రెకింగ్‌కి సిద్ధమయ్యారు ఆ జిల్లా కలెక్టర్‌. ఇంతకీ బృందంలో కలెక్టర్‌ ఎవరై ఉంటారని చూస్తే... అందరిలోకి చురుగ్గా కనిపిస్తున్న అమ్మాయే ఆ కలెక్టర్‌.

‘ఇది చక్కటి టూరిస్ట్‌ ప్లేస్‌ అని, ఓవర్‌ నైట్‌ ట్రిప్‌కి అనువైన ప్రదేశం అని, రాక్‌ క్లైంబింగ్, రాపెలింగ్, జెయింట్‌ స్వింగ్‌ వంటి అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌కి ఖిలా ఘన్‌పూర్‌ (ఘన్‌పూర్‌ ఫోర్ట్‌) మంచి ఎంపిక’ అని ఆమె చెప్పిన మాటలు మరుసటి రోజు పతాక శీర్షికగా వార్తల్లో వచ్చాయి. ఇంకా ఆమె... ‘‘ఐఏఎస్‌ ట్రైనింగ్‌లో ట్రెక్కింగ్‌ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొండలెక్కాలి, పర్వతాలను అధిరోహించాలి. మాకు ప్రతివారం హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ ఉండేది’’ అని కూడా చెప్పారు నవ్వుతూ. కలెక్టర్‌ ఇంత డైనమిక్‌గా ఉంటే జిల్లాలో పాలన కూడా ఈవెంట్‌ఫుల్‌గా ఉంటుందనే ఆశ చిగురించింది ఆ జిల్లా ప్రజల్లో.

మహిళల ఆరోగ్యంపై దృష్టి
కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ‘కలెక్టర్‌గా రొటీన్‌ అడ్మినిస్ట్రేషన్‌కి పరిమితం అయి పోకూడదు. ఏదైనా చేయాలి. ఐఏఎస్‌ చేసి కలెక్టర్‌గా పోస్టింగ్‌ అందుకున్న జిల్లాకు తన వంతుగా ఏదైనా చేయాలి’ అనుకున్నారు శ్వేతా మహంతి. గ్రౌండ్‌ రియాలిటీ తెలుసుకోవాలి, క్షేత్రస్థాయిలో చేయాల్సిన మార్పులు చేయాలి అనుకున్న తర్వాత జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లో మహిళలు, యువతులు, బాలికలలో ఎక్కువ మంది బలహీనంగా ఉండటాన్ని ఆమె గమనించారు. పాలనా విధులే కాకుండా.. తను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి అనుకున్నారు. జిల్లాలో ఆరోగ్య సేవలు ఎలా నడుస్తున్నాయో స్వయంగా పరిశీలించారు.

నూటికి నలభై మంది మహిళలు (బాలికలు, యువతులు కలిపి) తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత ఇంత తీవ్రంగా ఉండటం ఏమిటి? ఆమె మనసును తొలిచే ప్రశ్న అయింది. రక్తహీనతకు అనుబంధంగా తోడయ్యే అనేక ఆరోగ్య సమస్యలు కూడా కళ్ల ముందు మెదిలాయి. గర్భిణికి ఐరన్‌ ట్యాబ్లెట్లు, విటమిన్‌ మందులివ్వడంతో పరిష్కారమయ్యే సమస్య కాదిది అనుకున్నారామె. వ్యాధి లక్షణానికి కాదు వ్యాధి కారకానికి మందు వెయ్యాలి అని కూడా అనుకున్నారు. 

‘సమత’ ఆవిర్భవించింది!
శ్వేత ఆదేశాలపై జిల్లాలోని 110 ప్రభుత్వ పాఠశాలకు మెడికల్‌ టీమ్‌ లు వెళ్లాయి. మొత్తం ఎనిమిది వేల మంది అమ్మాయిలకు రక్తపరీక్షలు జరిగాయి. ఇందుకోసం స్కూలు టీచర్లకు ప్రత్యేక ఓరియెంటేషన్‌ ఇచ్చి, పిల్లలకు పీరియడ్‌ క్యాలెండర్‌ రికార్డు చేయించారు మహంతి. పీరియడ్స్‌లో ఎదురయ్యే అపసవ్యతలను తేదీల వారీగా నోట్‌బుక్‌లో రాయడం పిల్లలకు నేర్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెప్పించి బయోడిగ్రేడబుల్‌ (నేలలో కలిసిపోయేవి) సానిటరీ నాప్‌కిన్స్‌  ఇప్పించారు. ప్రతి నెలా విజిటింగ్‌ మెడికల్‌ టీమ్‌ స్కూలుకు వస్తుంది, అమ్మాయిలు నోట్‌బుక్‌లో నమోదు చేసిన వివరాలను అధ్యయనం చేసి మందులిస్తుంది. ఏడాది క్రితం మొదలైన ఈ మొత్తం ప్రోగ్రామ్‌కి ‘సమత’ అనే పేరు పెట్టారు శ్వేతా మహంతి. ఆరు నెలలకు ఆమె ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చింది. స్కూలు పిల్లల్లో రక్తహీనత తగ్గుముఖం పట్టింది.  

స్కూళ్లకు వాలంటీర్లు
వనపర్తి జిల్లాలో ఎక్కువగా గ్రామాలే. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌లు ఉన్నాయి. పిల్లలకు కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ ఇస్తున్నట్లు గణాంకాల్లో రికార్డ్‌ అయింది. స్కూలుకి వెళ్లి చూస్తే... పిల్లలకు తెలిసింది అది ఒక కంప్యూటర్‌ అని మాత్రమే. కీ బోర్డు, సీపీయు, మౌస్‌ అని పైకి కనిపించే విడిభాగాల పేర్లు చెప్పి సరిపెడుతున్న సంగతి కూడా శ్వేత దృష్టికి వచ్చింది. ప్రపంచం కంప్యూటర్‌ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో కంప్యూటర్‌ లిటరసీ లేకపోతే ఎంత పెద్ద చదువులు చదువుకున్నా నిరక్షరాస్యులుగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే గవర్నమెంట్‌ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలందరికీ కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు ఇంటర్నెట్‌లో సమాచారాన్ని తెలుసుకోవడం కూడా నేర్పించాలని ఆదేశించారామె. ఇందుకోసం వాలంటీర్ల బృందం ఇప్పుడు స్కూళ్లకు ల్యాప్‌టాప్‌లతో వస్తోంది. గూగుల్‌లో తమకు కావాల్సిన సమాచారాన్ని ఎలా రాబట్టుకోవడం, ఈ మెయిల్స్‌ పంపించడం వంటివన్నీ పిల్లలకు నేర్పిస్తోంది.

సత్తువ లేకపోవడం ఏమిటి!
వనపర్తి జిల్లాలో వేరుశనగ పంట విరివిగా పండిస్తారు. ఇంత విస్తృతంగా వేరుశనగ పండించే గ్రామాల్లో మహిళలకు ఐరన్‌ లోపం, రక్తహీనత ఉండడం ఏమిటి అని శ్వేతామహంతికి మొదటే సందేహం కలిగింది. ‘సమత’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, ఐరన్‌ లోపాన్ని తగ్గించేందుకు ఊళ్లకు కుటీర పరిశ్రమలు తెప్పించారు. ‘‘వనపర్తి జిల్లాలో వేరుశనగ బాగా పండుతుంది. రైతులంతా గిట్టుబాటు చూసుకుని పంట దిగుబడిని అలాగే అమ్మేస్తున్నారు తప్ప ఆ ముడిసరుకు ఆధారంగా నడిచే పరిశ్రమల మీద దృష్టి పెట్టడం లేదు. ఆ పని స్వయం సహాయక బృందాల చేత చేయించడంతో మంచి లాభాలను చూస్తున్నారిప్పుడు.

శ్వేత చొరవతో ప్రయోగాత్మకంగా మొదట దత్తాయిపల్లిలో వేరుశనగ గింజలను ప్రాసెస్‌ చేసే యూనిట్‌ ప్రారంభమైంది. ఒకప్పుడు మధ్య దళారులు, పెద్ద వ్యాపారులకు అందుతూ వచ్చిన లాభాలు ఇప్పుడు గ్రామీణ మహిళలకే అందుతున్నాయి. వేరుశనగ పప్పు– బెల్లంతో చేసే చిక్కీకి మంచి డిమాండ్‌ ఉంది. రాష్ట్ర కో ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి భారీ ఆర్డర్లు రావడంతో ఆ యూనిట్‌ నెలలోనే కమర్షియల్‌గా నిలదొక్కుకున్నది. ఈ పరిశ్రమలు నడుపుతున్న మహిళలు చదువుకున్న వాళ్లు కూడా కాదు.

ఒక్కో కుటుంబానికి ఎంత మేరకు ఆదాయం పెరిగిందనే అంచనాకు రావాలంటే మరికొన్ని నెలలు పడుతుంది. అయితే ఇది మహిళల స్వయం శక్తికి, సాధికారతకు, మహిళ ఆరోగ్యానికీ సోపానం అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అన్నారామె దృఢ విశ్వాసంతో. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల చేత ఓటు వేయించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశారామె. ఇప్పుడు మహిళలకు ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ నేర్పించే ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేశారు. పరిపాలన అంటే తాయిలంతో బుజ్జగించడం కాదు, ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అనువైన వాతావరణాన్ని రూపొందించడం. శ్వేతా మహంతి అదే పని చేస్తున్నారు. 

పిల్లల్లో న్యూనత తలెత్తకూడదు
గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సౌకర్యమూ చేరాలనేది నా ఆకాంక్ష. ఐఏఎస్‌గా నాకు జిల్లా పరిపాలనకు సంబంధించిన విస్తృత అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి గ్రామాల్లో పిల్లలకు ఎంత చేయగలనో అంతా చేయాలనిపించింది. నా పిల్లలకు నేర్చుకోవడానికి ఎన్ని అవకాశాలున్నాయో ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించని పిల్లలకు కూడా ఆ అవకాశాలన్నీ అందుబాటులోకి రావాలి.  వాళ్లు పెద్దయ్యాక... ‘మేము గ్రామాల్లో పుట్టాం, తెలుగు మీడియంలో చదువుకున్నాం, కంప్యూటర్‌ తెలియకపోవడంతో మిగిలిన వాళ్లతో పోల్చినప్పుడు వెనుకపడిపోతున్నాం’ అనే న్యూనత ఆ పిల్లల్లో ఎప్పటికీ తలెత్తకూడదు. 
– శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్, వనపర్తి జిల్లా, తెలంగాణ

క్లాసికల్‌ డాన్స్‌ ఇష్టం
శ్వేతా మహంతి తండ్రి ప్రసన్న కుమార్‌ మహంతి. ప్రభుత్వానికి చీఫ్‌ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం కేంద్ర విధుల్లో ఉన్నారాయన. భర్త రజత్‌ కుమార్‌ సైనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌. తండ్రిలా ఐఏఎస్‌ కావాలనే కలను నిజం చేసుకోవడానికి తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్‌ డాన్స్‌ ప్రాక్టీస్‌కు దూరమయ్యారు శ్వేత. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. శ్వేత తండ్రి అడుగు జాడల్లో నడిచినట్లే ఆమె పిల్లలు కూడా నడుస్తారేమో. ఒక పాపకు ఎనిమిదేళ్లు, ఒక పాపకు నాలుగు. వాళ్ల కలల నిర్మాణం ఎలా ఉంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement