బొబ్బిలి, న్యూస్‌లైన్: పేదల బియ్యాన్ని పక్కదారిలో మళ్లించేందుకు పెద్ద రాకెట్టే నడుస్తోంది. రూపాయి బియ్యాన్ని నల్లబజారులో రూ.16 నుంచి రూ.20 వరకూ విక్రయాలు చేయడానికి డీలర్లు పన్నుతున్న మాయాజాలానికి అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొబ్బిలి నుంచి తరలివెళ్తున్న 112 క్వింటాళ్ల పేదల బియ్యం బాడంగి మండలం కోటిపల్లి వద్ద పట్టుబడడంతో అసలు రంగు బయట పడింది. బొబ్బిలి కేంద్రంగా కిలో రూపాయి బియ్యాన్ని అక్రమంగా తరలించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పటివరకూ రేషనుడిపోలకు గోదాంల నుంచి బియ్యం చేరిపోయిన తరువాత ఆ బస్తాల రూపం మారిపోయి పక్కదారి పట్టేవి. అయితే ఇప్పుడు డీలర్లు వారి అక్రమాల రూటు మార్చారు. గోదాం నుంచే నేరుగా అక్రమ ప్రదేశాలకు తరలించడానికి సిద్ధమయ్యారు.
ఇందుకు బొ బ్బిలిలోని మార్కెట్ కమిటీలో ఉండే గోదాంలనే వేదికగా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బొబ్బిలి ప్రాంతంలో ఉండే డీలర్లలో కొందరు పది డిపోలకు మించి నిర్వహిస్తున్నారు. దాంతో ఒకే సారి లారీలతో సరుకును బయటకు పంపుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క డిపోకు సరిపడిన బియ్యాన్ని తీసుకెళ్లకుండా పార్ట్‌లుగా తీసుకెళ్లడం మొదలు పెడుతున్నట్లు సమాచారం. దాంతో మిగిలిన సగాన్ని ఇటు నుంచి ఇటే నల్లబజారుకు తరలించడానికి సులభమవుతుందని తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి గోదాం నుంచి సరుకులు బయటకు వెళ్తాయి. ఆ తరువాత లారీలు లోపలకు వచ్చినా ఎవరికి ఎటువంటి అనుమానం రాకపోవడంతో వీటిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగు లారీల వరకూ సరుకుతో బయటకు రాత్రి వేళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీటికి గోదాం వద్ద విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారుల సంపూర్ణ మద్దతు ఉందనే విమర్శలు ఉన్నాయి. కోటిపల్లి వద్ద 112 క్వింటాళ్ల వరకూ ప్రభుత్వం ముద్రతో ఉండే బస్తాలు దొరికినా అవి ఎక్కడ నుంచి వచ్చాయో రెండు రోజులైనా అధికారులకు తెలియలేదు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఈ బియ్యం వెళ్లాయని, ఆ ఖాళీలను భర్తీ చేయడానికి రాత్రికి రాత్రే రైసు మిల్లుల నుంచి 112 క్వింటాళ్లను తెచ్చి అధికారుల లెక్కల్లో తేడాలు లేకుండా అందరూ జాగ్రత్త పడ్డారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో డీలరుకు ప్రధాన పాత్ర ఉండడంతో అధికారులపై అధికారపార్టీ ఒత్తిడి కూడా ఎక్కువైనట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే ఈ కేసు విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించమని కోరడంతోనే విచారణ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన బియ్యం విషయమై గురువారం బొబ్బిలి వచ్చిన సబ్ కలెక్టరు శ్వేతామహంతిని విలేకరులు ప్రశ్నిస్తే ఇంకా విచారణ చేస్తున్నామని, పక్కదారి పట్టిన బియ్యం దొరికాయి కదా... ఆ సమాచారం ఇచ్చిన వారికి ధన్య వాదా లు అని చెప్పి వెళ్లిపోయారు. ఏకంగా 112 క్వింటాళ్ల బియ్యం బయటకు వచ్చాయంటే అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పటివరకూ తెలుసుకోలేని పరిస్థితిలో అధికారుల విచారణ ఉందని పలువురు బాహాటంగా తప్పుపడుతున్నారు.