క్యా హై భాయ్‌.. | Sweta Mohanty Visit Mohammed Saleem House Hyderabad | Sakshi
Sakshi News home page

క్యా హై భాయ్‌..

Published Fri, Feb 28 2020 7:12 AM | Last Updated on Fri, Feb 28 2020 7:12 AM

Sweta Mohanty Visit Mohammed Saleem House Hyderabad - Sakshi

సలీం ఇంటికి వెళ్లి వివరాలు తీసుకుంటున్న హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి

గోల్కొండ: దివ్యాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానవత్వం తో ఆలకించి, సమస్య పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలీచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో ఓ వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్‌ కారు ఆపి దిగారు. క్యాహై భాయ్‌... సలామంటూ చేయి కలిపారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనను మహ్మద్‌ సలీం అని పరిచయం చేసుకున్న అతడు.. గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పాడు.

నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదని, ఉండేందుకు ఇల్లు కూడా లేదని, తగిన సహా యం చేయాలని కోరాడు. దీనికి సీఎం వెంటనే స్పందించారు. సలీం సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్, డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు టోలీచౌకిలో సలీం నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్‌ విచారణ జరిపారు. సలీం దివ్యాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్‌ ఉండటంతో అప్పటికప్పుడు పెన్షన్‌ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement