చర్చల కోసం వచ్చిన రేషన్‌డీలర్లు
కరీంనగర్ సిటీ: కనీస గౌరవ వేతనంతోపాటు సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు పూనుకుంటున్న రేషన్ డీలర్లపై సర్కారు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సరుకులు డీడీలు కట్టకుండా జూలై 1 నుంచి సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకుంటోంది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 48 గంటల్లో సరుకులకు డీడీలు చెల్లించకుంటే డీలర్లను సస్పెన్షన్ చేయాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ జిల్లా డీలర్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ‘పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వానికి ఎంతయితే ఉందో రేషన్‌డీలర్లపై కూడా అంతే ఉంది.
అది ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరువొద్దు. సరుకుల పంపిణీకి ఆటంకం కలిగించే డీలర్లపై కఠిన చుర్యలు తీసుకోక తప్పదు’ అని హెచ్చరించారు. ఈనెల 28వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్‌వో(రిలీజ్) తెలుసుకుని ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం డీలర్లకు విజ్ఞప్తి చేసిందన్నారు.
నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వం కలిగి ఉందన్నారు. కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున ప్రతినెలా ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తూ అవసరమైన ఆహార భరోసా కల్పిస్తుందన్నారు.
సమ్మె పేరుతో పేద ప్రజల నోటికాడి ముద్దను అడ్డుకోవద్దన్నారు. పేద ప్రజల ఆహారభద్రత దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ప్రభుత్వం మరోమారు రేషన్ డీలర్లకు విజ్ఞప్తి చేసిందన్నారు.
ఆందోళన వద్దు..
రేషన్ సరుకులు అందుతాయో లేదో అని పేద ప్రజలు ఆందోళన చెందవద్దని, సకాలంలో సరుకులు అందించడానికి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టిందని జేసీ అన్నారు. ప్రత్యామ్నాయ చర్యల ద్వారా సరుకుల పంపిణీకి పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు.
అయితే.. ఇటు డీలర్లు భీష్మించడం.. అధికార యంత్రాంగం హెచ్చరించడం చూస్తుంటే పేద ప్రజల్లో సరుకుల పంపిణీపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం చెబుతున్న ప్రత్యామ్నాయ చర్యలతో రేషన్ సరుకుల పంపిణీ సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుభవమున్న డీలర్లతోనే సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్తగా పంపిణీ చేసేవారితో ఎలా సాధ్యమనే ప్రశ్న వ్యక్తమవుతోంది.
సమ్మెకు వెనుకాడేది లేదు
ప్రభుత్వం ఎన్ని బెదిరింపు చర్యలకు పాల్పడినా సమ్మెకు వెనుకాడేది లేదని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ స్పష్టం చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం జరిగే వరకు రాష్ట్రశాఖ పిలుపు మేరకు డీడీలు కట్టకుండా సమ్మె చేపడతామని పేర్కొన్నారు.
‘వస్తే గౌరవ వేతనం.. పోతే రేషన్ షాపు’ నినాదానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ చర్చలకు పిలిచి ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారని, డీడీలు కట్టకపోతే తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.
అయితే.. ఇప్పటివరకు జిల్లాలోని 487 మంది డీలర్లు ఎవరూ డీడీలు కట్టలేదన్నారు. కేవలం కొన్ని సొసైటీలు మాత్రమే డీడీలు చెల్లించాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment