ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటనకు యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది.
ఖమ్మం: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటనకు యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. సీఎం వరంగల్ జిల్లాలో నాలుగు రోజులపాటు పర్యటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా అదే తరహాలో ఉండొచ్చని భావిస్తున్న అధికారులు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం శంకుస్థాపన చేయనున్న మణుగూరు పవర్‌ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భూ సేకరణతోపాటు నిర్వాసితులకు నష్టపరిహారం, సేకరించిన భూమిని చట్టబద్ధంగా అప్పగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ఈనెల చివరివారంలో వస్తారన్న సమాచారంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఆయా శాఖల ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
కీలకమైన శాఖల అధికారుల పనితీరును మరింత వేగవంతం చేసుకోవాలని సూచించారు. ఆసరా పింఛన్ల పంపిణీ, అర్హత దరఖాస్తుల పరిశీలన, ఆహారభద్రత కార్డుల అర్హులను గుర్తించే పనులను ముమ్మరం చేశారు. 16వ తేదీ నుంచి బియ్యం పంపిణీకి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. గృహనిర్మాణ సంస్థ పరిధిలో ఎన్ని ఇళ్లు నిర్మించారు, నిర్మించిన ఇళ్ల నాణ్యత, లబ్ధిదారులకు అందిన బిల్లులు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పరిస్థితిపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయి నుంచి పూర్తిస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల అంశా లు, ఏయే ప్రాజెక్టుల పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, మందకొడిగా ప్రాజెక్టుల పనులు కొనసాగడానికి కారణాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్నారు. నీటిపారుదలశాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి...
ముఖ్యమంత్రి ఖమ్మంలో ఒకరోజు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సీఎం జిల్లాలో ఎన్ని రోజులు ఉంటారో? ఎక్కడి నుంచి తన జిల్లా పర్యటన ప్రారంభించి ఎక్కడ ముగిస్తారోనన్న అంశంపై జిల్లా అధికారులకు స్పష్టమైన సమాచారం రాలేదు. ఈ నెలాఖరుకు సీఎం జిల్లాలో పర్యటించడం ఖాయమన్న సమాచారం మాత్రమే వచ్చింది. సీఎం హోదాలో తొలిసారి కేసీఆర్ జిల్లాకు వస్తున్న దృష్ట్యా ముఖ్యమైన ప్రాంతాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రగతి నివేదికలు, అభివృద్ధి పనుల వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం కార్యాలయ వ్యవహారాల ఇన్‌చార్జి జలగం వెంకట్రావు అధికారుల నుంచి తెలుసుకుంటున్నారు.
సీఎం పర్యటన తర్వాతే జేసీ రిలీవ్?
జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ హైదరాబాద్ జాయింట్ కలెక్టర్‌గా రెండు రోజుల క్రితం బదిలీ అయ్యారు. సీఎం పర్యటన దృష్ట్యా ఆయన రిలీవ్ వాయిదా పడే అవకాశం ఉంది. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టుల భూసేకరణను జేసీ స్వయంగా పర్యవేక్షిస్తుండటం, జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన తోడ్పాటు అవసరం ఉండటంతో సీఎం పర్యటన తర్వాతనే ఆయన రిలీవ్ కావచ్చు. జిల్లా కలెక్టర్ సైతం జేసీని సీఎం పర్యటన అనంతరమే రిలీవ్ చేస్తామని ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. ఆకస్మికంగా జిల్లా నుంచి బదిలీ అయిన భద్రాచలం ఐటీడీఏ పీవో దివ్యను సైతం సీఎం పర్యటన ముగిసేంత వరకు ఇక్కడే ఉంచే అవకాశాలున్నాయి. మరో అధికారిని నియమించని దృష్ట్యా కూడా ఈ ఇద్దరు అధికారులు సీఎం పర్యటన వరకు ఇక్కడే ఉండొచ్చని అంటున్నారు.
జాయింట్ కలెక్టర్‌గా సురేంద్రమోహన్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో మరో అధికారిని నియమించలేదు. దివ్యను నిజామాబాద్ జేసీగా బదిలీ చేసిన దృష్ట్యా అక్కడికి మరో అధికారిని పంపించి, జిల్లా జేసీగా దివ్యను కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పాల్వంచ సబ్‌కలెక్టర్‌గా నియమితులైన కాళీచరణ్ సుదమ్‌రావు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఆయన త్వరితగతిన విధుల్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో సీఎం ఒకటి, రెండు రోజులు పర్యటించే అవకాశం ఉంది. పాల్వంచ సబ్ కలెక్టర్ పరిధిలోనే మణుగూరు విద్యుత్‌ప్రాజెక్టులు, కొత్తగూడెం విద్యుత్‌ప్రాజెక్టులు ఉండటంతో ఆయన్ను తక్షణం బాధ్యతలు తీసుకోవాల్సిందిగా రాష్ర్ట ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం.