
సాక్షి, మచిలీపట్నం: జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయ.కె (కృష్ణన్)ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జేసీకి స్థాన చలనం కలిగింది. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జేసీ చంద్రుడు శిక్షణ అనంతరం తూర్పుగోదావరి జిల్లా రంపచౌడవరం ఐటీడీఏ పీఓగా తొలి పోస్టింగ్ పొందారు.
అనంతరం సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరించారు. 2015 మార్చి 5వ తేదీన జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి అధికారులను సమన్వయ పరిచి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. బందరు పోర్టు భూ సమీకరణ నేపథ్యంలో అవతరించిన మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంయూడీఏ) విభాగం అభివృద్ధికి కృషి చేశారు. భూ సమీకరణ అంశంపై ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సత్ఫలితాలు సాధించారు.
ప్రధానంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీవెన్స్, తనకు స్వయంగా వచ్చిన భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వారు. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, అడంగల్‌లో తప్పులు దొర్లకుండా క్రమబద్ధీకరించారు.
నూతన జేసీగా విజయ.కె
జేసీ గంధం చంద్రుడు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న కె.విజయను నియమించారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్నారు. త్వరలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.