భర్త మాటలే సైంటిస్ట్‌ నుంచి ఐఏఎస్‌కు.. | Krishna District Joint Collector Madhavi Latha Profile | Sakshi
Sakshi News home page

భర్త మాటలే సైంటిస్ట్‌ నుంచి ఐఏఎస్‌కు..

Published Sun, Mar 8 2020 10:11 AM | Last Updated on Sun, Mar 8 2020 10:13 AM

Krishna District Joint Collector Madhavi Latha Profile - Sakshi

భర్త, పిల్లలతో జేసీ మాధవీలత

సాక్షి, అమరావతి బ్యూరో: ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్‌ తీసుకుంటారు. రెండు మూడు పర్యాయాలు ప్రయత్నిస్తే గాని ఎంపిక కాలేరు. కానీ ఆమె మాత్రం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. పైగా తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ టాపర్‌ (మహిళా విభాగంలో)గా నిలిచి గ్రూప్‌–1కు సెలెక్టయ్యారు. సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి, గ్రూప్‌–1 అధికారిగా ఎంపికై, అంచెలంచెలుగా ఐఏఎస్‌కు ఎదిగిన ఆమె కె.మాధవీలత. కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాధవీలత విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..  

వ్యవసాయ పరిశోధనలో 4 గోల్డ్‌మెడల్స్‌.. 
మాది కడప. నాన్న కృష్ణారెడ్డి రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌. అమ్మ రామలక్ష్మి గృహిణి. అమ్మా, నాన్నలకు ముగ్గురూ ఆడపిల్లలమే. నేను పెద్దదాన్ని. పెద్ద చెల్లెలు రాధిక అమెరికా స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌. చిన్న చెల్లెలు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు బాగా చదువుకోవాలని, ప్రయోజకురాలివి కావాలని చెప్పేవారు. వారి మాటలు నాలో పట్టుదలను పెంచాయి. నేను అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేశాను. కందులపై ప్రపంచంలోనే తొలిసారిగా పరిశోధనలు చేసి నాలుగు గోల్డ్‌మెడల్స్‌ సాధించాను. ఇక్రిసాట్‌లో సైంటిస్టుగా చేరాను. మా వారు పి.రామమునిరెడ్డి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సైంటిస్టు (ప్రస్తుతం పంచాయతీరాజ్‌లో వాటర్‌షెడ్స్‌ డైరెక్టర్‌).

నువ్వు ప్రతిభావంతురాలివి. గ్రూప్‌–1కు ప్రిపేర్‌ అయితే బాగుంటుంది కదా? అని నా భర్త సూచించారు. అందుకు అంగీకరించి గ్రూప్‌–1కి ప్రిపేరయ్యాను. దీనికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అంతా ‘ఆయనే’ సమకూర్చారు. రోజుకు 12 గంటలు కష్టపడి చదివి పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే (2007లో) మహిళా విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాను. తొలుత డిప్యూటి కలెక్టర్‌గా, ఆ తర్వాత నంద్యాల, నెల్లూరు ఆర్డీవోగా, తిరుపతి ‘తుడా’ కార్యదర్శిగాను పనిచేశాను. నేను ఉద్యోగంలో చేరకముందు ఎప్పుడూ ఐఏఎస్‌ కావాలనుకోలేదు.. ఆ దిశగా ప్రయత్నమూ చేయలేదు. గ్రూప్‌–1 అధికారి నుంచి 2014లో ఐఏఎస్‌ అయ్యాను. లేదంటే నేను శాస్త్రవేత్తగా నా పరిశోధనలు కొనసాగించేదాన్ని.  'అమ్మ మాట నన్ను ఐఏఎస్‌ దాకా నడిపించింది'

ఎంతో సంతృప్తి.. 
జాయింట్‌ కలెక్టర్‌గా నా తొలి పోస్టింగ్‌ కృష్ణా జిల్లాలోనే. గత ఏడాది జూన్‌లో ఇక్కడ చేరాను. సైంటిస్ట్‌గా కొనసాగలేదన్న ఫీలింగ్‌ లేదు. ఎందుకంటే ఐఏఎస్‌గా నాకు ఎంతో సంతృప్తి ఉంది. ప్రజలకు నిత్యం సేవ చేసే అవకాశం దక్కిందన్న ఆనందం ఉంది. పురుషుడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ నా విజయం వెనక ‘ఆయన’ ఉన్నారు. నాలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించారు. ఆయన ఆశలకనుగుణంగానే గ్రూప్‌–1కు ఎంపికయ్యాను. క్రమంగా ఐఏఎస్‌గా పదోన్నతి పొందాను. మాకు ఇద్దరు పిల్లలు. బాబు కౌషిక్‌రెడ్డి ఇంటర్, పాప హర్షిత ఏడో తరగతి చదువుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement