‘రూ.100 కోట్లు అవసరం’
అనంతపురం అర్బన్ : జిల్లాలో నగదు లావాదేవీల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.100 కోట్లు అవసరం ఉందని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయించామని ఇన్‌చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. చిన్న నోట్ల డినామినేషన్ పొందుపరుస్తూ లేఖని ఆర్‌బీఐకి పంపించాలని ఎల్‌డీఎం జయశంకర్‌ని ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అన్ని బ్యాంక్‌ల చీఫ్ మేనేజర్లతో నగదు లావాదేవీలపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ లేదా వీఆర్‌ఏలతో బృందం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
బృందాలు ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి బ్యాంక్ ఖాతా లేని జాబితాను తయారు చేస్తారన్నారు. ఖాతాలు లేనివారికి అకౌంట్లు చేయించాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. దాదాపు రెండు లక్షల మంది ఉపాధి కూలీలకు బ్యాంక్ ఖాతాలు తెరవాల్సి ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీకి ఫోన్ ద్వారా ఆదేశించారు. పింఛనుదారులకు సంబంధించి 1.50 లక్షలు ఖాతాలు ఇనాక్టివేషన్‌లో ఉన్నాయని, వీటిని యాక్టివేట్ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొబైల్ బ్యాకింగ్‌ని అన్ని బ్యాంకులు నిర్వహించాలని చెప్పారు.