
జూన్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు
జిల్లాలో జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు అధికారులను ఆదేశించారు.
► పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందే
► జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు కనబరిచిన పాతపట్నం చౌకధర దుకాణ డీలర్ కోట్ని శ్రీరామచంద్ర గుప్తకు శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో 8 లక్షల 50 వేల రేషన్ కార్డుదారులు ఉండగా లక్షా 30 వేల మంది నగదు రహిత లావాదేవీలను నిర్వహించారన్నారు. ఇందుకు సహకరించిన సీఎస్‌డీటీలు, రేషన్ డీలర్లను జేసీ అభినందించారు. రేషన్ డీలర్ల కోసం కంట్రోల్ రూమ్‌ను (08942–240563) ఏర్పాటుచేశామని, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించా రు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా జిల్లాలో ఒకరికి రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా పాతపట్నానికి చెందిన రేషన్ డీలర్ కోట్ని శ్రీరామచంద్ర గుప్తాకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. మండలస్థాయిలో ఏడుగురికి సెల్‌ఫోన్‌లు పంపిణీ చేయనున్నామని చెప్పారు.
ఇటీవల విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, సుమారు 30వేల మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారని జేసీ వివరించారు. ఆదివారం జరగనున్న పల్స్‌పోలియోపై రేషన్ డీలర్లు కూడా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నగదు రహిత ప్రతిభా పురష్కార గ్రహీత కోట్ని శ్రీరామచంద్ర, మండలస్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన రేషన్ డీలర్ సంజీవరావుకు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావు, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ మేరీ సగారియా, శ్రీకాకుళం, పాలకొండ ఆర్డీఓలు బి.దయానిధి, ఆర్.గున్నయ్య, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు తదితరులు పాల్గొన్నారు.