మాకేంటి!
– మీ సేవ కేంద్రం మంజూరుకు ముడుపులు ఇవ్వాల్సిందే
– చేతివాటం ప్రదర్శిస్తోన్న మీ సేవ ఉన్నతాధికారి
– సహకరిస్తున్న కంపెనీ అధికారి
కర్నూలు: ‘మీ సేవ’ కేంద్రం కావాలా నాయనా.. అయితే మాకేంటి అని కొందరు యథేచ్ఛగా మామూళ్లకు పాల్పడుతున్నారు. వారి చేతులు తడపకపోతే ఫైళ్లకు బూజు పట్టిస్తున్నారు. ముడుపులు అందాకే పనులు మొదలు పెడతామని తేల్చి చెబుతున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు పలు రకాల సేవలను అందిస్తోంది. జిల్లాలో 360 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. పట్టణ పరిధిలో కార్వే సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో సీఎంసీ సంస్థలు వీటికి సాంకేతిక సహకారం అందిస్తున్నాయి.
ఇటీవల మరో 50 సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వం వీటిని కేటాయిస్తోంది. అందుకు తగిన అర్హతలుండి ప్రజాదర్బారులో జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత మీ సేవ పరిపాలనాధికారికి ఆ దరఖాస్తును పంపుతారు. అక్కడి నుంచి ఒక వారంలోగా ఎంఆర్‌వో కార్యాలయానికి చేరుతుంది.
తదనంతరం ఎంఆర్‌వో ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) దరఖాస్తుదారుడి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాల్సి ఉంటుంది. ఆర్‌ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఆర్‌వో సర్టిఫై చేసి దరఖాస్తుదారుడు అన్ని విధాలా అర్హుడు అంటూ ఆర్‌డీవోకు ఓ నివేదిక పంపుతారు. ఆ తర్వాత ఎంఆర్‌వో నివేదికను ఆధారం చేసుకుని ఆర్‌డీవో ఆమోదముద్ర వేస్తారు. తిరిగి ఆ ఫైల్ మీ సేవ అధికారి వద్దకు వెళ్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
ఒక్కో కేంద్రానికి రూ. 50 వేల వరకు వసూళ్లు
ఐదు వేల జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ కాలనీల్లో ఒక మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగుల దరఖాస్తు చేస్తే.. ఆ దరఖాస్తు ఎంఆర్‌వో నుంచి ఆర్‌డీవో.. అక్కడి నుంచి ఏవో మీ సేవ.. తర్వాత జేసీ ప్రోసిడింగ్ ఉత్తర్వులు.. మళ్లీ ఏవో మీ సేవ.. అనంతరం కంపెనీ మేనేజర్‌తో అగ్రిమెంట్.. చివరగా డిజిటల్ కీ ఫైల్ వరకు ఫైళు నడుస్తుంది.
అయితే ఆర్‌డీవో నుంచి మీ సేవ కార్యాలయానికి దరఖాస్తు వచ్చాక.. జేసీ వద్దకు ఫైల్ వెళ్లాలంటే కచ్చితంగా మామూళ్లు ముట్టజెప్పాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కంపెనీతో అగ్రిమెంట్ తీసుకునే సమయంలోనూ మేనేజర్‌కు కొంత ముట్టజెప్పక తప్పదు. ఇలా ఒక్కో దరఖాస్తుదారుడు వద్ద నుంచి అన్ని దశలు కలుపుకుని సుమారు రూ. 30–50 వేల వరకు సొమ్ము గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మంజూరు చేసిన 50 సెంటర్ల యజమానుల నుంచి కూడా ఇదే విధంగా డబ్బులు తీసుకుని అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో వాళ్లు కాళ్లరిగేలా తిరగాల్సిందే.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా: సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్
మీ సేవ కేంద్రాల దరఖాస్తులను ఏ అధికారి అయినా పెండింగ్‌లో పెట్టినా.. ఒకవేళ డబ్బులు డిమాండ్ చేసినా.. నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. నిర్ధిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఆయా అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఏ ఒక్కరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు.