
జేసీకి ఊరట
జాయింట్ కలెక్టర్-2 కాట ఆమ్రపాలికి ఊరట లభించింది. తెలంగాణ కేడర్‌లో ఆమె కొనసాగడానికి క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) అనుమతి ఇచ్చింది.
♦ తెలంగాణకే ఆమ్రపాలి కేటాయింపు
♦ టీఎస్ కేడర్‌లో కొనసాగింపునకు క్యాట్ అనుమతి
కేడర్ అలాట్‌మెంట్‌పై తుది నిర్ణయం వెలువడింది. ఇకపై రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. - ఆమ్రపాలి, జేసీ -2
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాయింట్ కలెక్టర్-2 కాట ఆమ్రపాలికి ఊరట లభించింది. తెలంగాణ కేడర్‌లో ఆమె కొనసాగడానికి క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) అనుమతి ఇచ్చింది. రాష్ర్ట విభజనలో భాగంగా అఖిల భారత సర్వీసుల అధికారులను విభజించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌ను ఖరారు చేసింది. అయితే, తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తిచూపిన ఆమె.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. గతేడాది మార్చి 5న ఆమ్రపాలి పిటిషన్‌ను విచారించిన క్యాట్.. తుది నిర్ణయం వెల్లడించేవరకు ఆమెను తెలంగాణ లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆమెకు తెలంగాణ కేడర్‌ను కేటాయించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత 14 నెలలుగా జిల్లాలో సేవలందిస్తున్న ఆమెకు క్యాట్ తాజా నిర్ణయం సంతోషాన్ని కలిగించింది.