టపాసుల విక్రయాలకు లైసెన్సులు
కడప సెవెన్‌రోడ్స్ :
దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయాల కోసం తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కడప రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా 97, రెన్యూవల్ కోసం 81 దరఖాస్తులు వచ్చాయన్నారు. రాజంపేట డివిజన్‌లో కొత్తగా 71, రెన్యూవల్‌కు 15, జమ్మలమడుగు డివిజన్‌లో కొత్తగా 32, రెన్యూవల్‌కు 32 దరఖాస్తులు అందాయని వివరించారు. ఈనెల 26 నుంచి 30 వరకు టపాసులు విక్రయించుకోవడానికి లైసెన్సులు జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి ఈనెల 15వ తేదీ నాటికి కలెక్టరేట్‌కు ఎన్‌ఓసీలు పంపాలని ఆయా శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే క్రాకర్స్ విక్రయాలు జరపాలని సూచించారు. దుకాణాల మధ్య మూడు మీటర్ల కనీస దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి దుకాణం వద్ద ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మండే స్వభావం లేని మెటీరియల్‌తోనే షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నూనె, గ్యాస్ దీపాలు దుకాణాలు ఉండరాదని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ దీపాలను గోడకు అమర్చుకోవాలన్నారు. గుర్తించిన ఒక ప్రదేశంలో 50 దుకాణాలకు మించి ఏర్పాటుకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు. ఓఎస్‌డీ ఆపరేషన్స్ సత్య ఏసుబాబు, ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం, ఎలక్ట్రికల్ డీఈ శోభా వాలంటీన, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ గంగయ్య, అగ్నిమాపకశాఖ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.