సమగ్ర సమాచారానికే సాధికార సర్వే
-
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
-
జిల్లాలో 13.91లక్షల మంది సర్వే పూర్తి
తుని రూరల్ :
సమగ్ర సమాచారం సేకరించేందుకే ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తుని రెవెన్యూ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్‌లో జేసీ పాల్గొన్నారు. అనంతరం సీతారాంపురంలో ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్బంగా జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పధకాలు తొలగిస్తారన్న అపోహాలు సరికాదన్నారు. జిల్లాలో 4,82,980కుటుంబాలకు చెందిన 13,91,679మంది సర్వే పూర్తయ్యిందన్నారు. సర్వేను జిల్లాలో అన్ని మండలాలకు క్రమంగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక సమస్యలు, సిగ్నల్ సమస్యలు పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సగటున రోజుకు ఒక ఎన్యూమరేటర్ 14ఇళ్లకుపైగా సర్వే చేస్తున్నారని, దీన్ని మరింత వేగవంతం చేయాలని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో మాట్లాడుతూ రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయ నిర్మాణానికి రూపొందించిన నమూనాను పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయ నిర్మాణానికి ప్రతిపాధనలు చేయాలన్నారు. సర్వే పూర్తయ్యేవరకు సోషల్ ఆడిట్‌ను నిలిపివేయాలని డ్వామా పీడీకి సూచనలు చేశామన్నారు. ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్‌లు సర్వే వేగవంతం చేయడంపై నిముగ్నమవ్వాలన్నారు. ట్యాబ్‌లు కొరత ఉందని పలువురు తహశీల్దార్‌లు జేసీ దృష్టికి తీసుకువచ్చారు.తహశీల్దార్ బి.సూర్యనారాయణ, ఎంపీడీఓ కర్రి భీమేశ్వర్ పాల్గొన్నారు.