క్షణికావేశం నింపింది విషాదం!
► ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద దూకిన తల్లి
►అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన తల్లి
►ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
►చికిత్స పొందుతూ మృతి చెందిన కుమారుడు
► కుమార్తె పరిస్థితి విషయం
► మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలింపు
►జాండ్రపేట రైల్వే స్టేషన్ వద్ద ఘటన
చీరాల అర్బన్ : క్షణికావేశం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దంపతుల మధ్య వివాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు పసి బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లి వారిని భుజాలకు ఎత్తుకొని వేగంగా వస్తున్న రైలు కిందకు దూకేసింది. రైలు ఢీకొట్టడంతో చిన్నారులిద్దరూ చెరోవైపు పడిపోగా తల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కుమారుడు మృతిచెందాడు. కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన చీరాల మండలం జాండ్రపేట రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం పాతచీరాలకు చెందిన పులుగు విజయకుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు జీవన్‌రెడ్డి, ఏడాదిన్నర వయస్సు గల కుమార్తె మహిమ ఉన్నారు. విజయకుమార్ బేల్దారి పని చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య తర చూ వివాదాలు జరుతున్నారుు.గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగలక్ష్మి.. భర్త బయటికి వెళ్లిన సమయం లో ఇద్దరు పిల్లలను తీసుకుని జాండ్రపేట రైల్వేస్టేషన్‌కు వచ్చింది. బిడ్డలను భుజాల మీదకు ఎత్తుకొని వేగంగా వస్తున్న రైలు కింద పడింది. ఈ సంఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. ఇరువురు పిల్లలు రెండు వైపులా దూరంగాపడిపోరుు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా పట్టాలు దాటుతున్న స్థానికుడు వారిని చూసి చలించిపోయాడు. 108కి సమాచారం అందించాడు.
108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని,గాయపడిన చిన్నారులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే జీవన్‌రెడ్డి(3) మృతిచెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి మహిమను మెరుగైనవైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో అభాగ్యుల్లా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న చిన్నారుల చెంత బంధువులెవరూ లేవరూ పోవడం చూపరులను కలిచివేసింది. మృతురాలు నాగలక్ష్మి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్‌ఐ జి.రామిరెడ్డి తెలిపారు.