సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్న రోజు చిత్రీకరించిన మొత్తం వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వీడియోలోని మాటలను ఇంగ్లిష్‌లో సబ్‌టైటిల్స్‌లో ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ రేవంత్‌రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై అప్పట్లో విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. పోలీసులపై నిప్పులు చెరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, అక్రమ నిర్బంధానికి పరిహారం చెల్లించే విషయంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆదేశించింది.
ఎవరో చెప్పిన దాని ఆధారంగా పిటిషన్..
ఈ వ్యాజ్యాన్ని నరేందర్‌రెడ్డి ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా దాఖలు చేశారని, అందువల్ల దీనికి విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు. ఘటన జరిగిన రోజు ఘటనాస్థలిలో నరేందర్‌రెడ్డి లేరని చెప్పారు. రేవంత్ నిర్బంధంపై ఆయన కుటుంబసభ్యులకు లేని అభ్యంతరం పిటిషనర్‌కు ఎందుకో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. స్నేహితుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని తాను చెప్పట్లేదని, అయితే కుటుంబసభ్యులు కోర్టుకు రాకుండా, ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంపైనే తమకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. రేవంత్‌ను కొద్ది గంటల పాటే నిర్బంధించారు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టామని తెలిపారు. హెబియస్ కార్పస్ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే పిటిషనర్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రేవంత్ నిర్బంధం విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, నిర్బంధంలోకి తీసుకునే ముందు నోటీసు ఇచ్చినా రేవంత్ సతీమణి గీతారెడ్డి నోటీసు తీసుకునేందుకు నిరాకరించారని, అయితే అతని అనుచరుడు అంజి నోటీసు తీసుకున్నారని చెప్పారు.
రేవంత్ బలమైన నాయకుడు..
ప్రభుత్వం దృష్టిలో రేవంత్‌రెడ్డి చాలా బలమైన నాయకుడని, ఆ విషయం అందరికీ తెలుసని, అందుకే ఆయన విషయంలో ముందస్తు చర్యలు తీసుకున్నారని రోహత్గీ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నిర్బంధం విషయాన్ని అప్పటి ఎస్పీ అన్నపూర్ణ పైఅధికారులతో పాటు రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి కూడా తెలియజేశారన్నారు. వారి ఆదేశాల మేరకే ఆమె రేవంత్ విషయంలో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సభను బహిష్కరిస్తామంటూ రేవంత్ ప్రకటన చేశారని, దీని వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే అప్పుడు కూడా వారినే నిందించే వారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో పరిహారం చెల్లించాల్సిన అవసరమే లేదన్నారు.
మొత్తం ఫుటేజీ ఇవ్వండి..
ఈ సమయంలో వీడియోగ్రఫీ తాలూకు సీడీ గురించి చర్చకొచ్చింది. ఆ సీడీని కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ చెప్పారు. దీనిపై రేవంత్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ.. పోలీసులు ఇచ్చే సీడీలను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. వారు తమ వాదనలకు బలం చేకూర్చేలా ఎడిట్ చేసిన సీడీలు ఇస్తారని, దీనివల్ల తమకు నష్టం కలుగుతుందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, తమకు మొత్తం వీడియో ఫుటేజీ సీడీ సమర్పించాలని, ఆ సీడీలోని మాటలను ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలీసులపైకి కుక్కలు వదిలారు..
పోలీసులు మర్యాద గా వ్యవహరించారని, రేవంత్‌రెడ్డి అనుచరులే దురుసుగా వ్యవహరించారన్నారు. పోలీసులపైకి కుక్కలను వదిలారన్నారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీయించామని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసు అధికారి నగేశ్ ఇచ్చిన సమాచారం కారణంగా రేవంత్‌ను నిర్బంధంలోకి తీసుకున్నామని చెబుతున్నారు. మరి ఆయన ఇచ్చిన నివేదికపై తేదీ, సమయం, సీల్ లేవు. దాన్ని ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఎవరైనా అలాంటిది ఇచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదని, ఇలాంటి వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. రోహత్గీ స్పందిస్తూ.. మనమంతా ఏసీ రూముల్లో కూర్చొని చాలా చెబుతుంటామని, క్షేత్రస్థాయిలో పోలీసులు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని రేవంత్ నిర్బంధానికి ఈ వాదన ఎంత మాత్రం సమర్థనీయం కాదంది.
Comments
Please login to add a commentAdd a comment