ఆపరేషన్‌ భాస్కర్‌.. | Police Were On High Alert Maoist Movements In Telangana For A Week | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ భాస్కర్‌..

Published Sat, Jul 18 2020 2:59 AM | Last Updated on Sat, Jul 18 2020 11:18 AM

Police Were On High Alert Maoist Movements In Telangana For A Week - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: వారం రోజులుగా తెలంగాణలో మావోల కదలికలతో పోలీసులు అప్రమత్త మయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృ త్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రేహౌండ్స్, టీఎస్‌ ఎస్‌పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్, స్పెషల్‌ పార్టీ, సివిల్‌ పోలీసులతో భారీ స్థాయిలో కూంబింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. ఆసిఫాబాద్‌లో దాదాపు 500 మంది, మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ దాదాపు 500 మంది వరకు పోలీసులు అడవిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడి దళం సంచారం, 24 గంటల్లో రాష్ట్రంలో రెండుచోట్ల మావోయిస్టులతో పోలీసుల ఎదురు కాల్పులను హోం శాఖ తీవ్రంగా పరిగణించిందని సమాచారం.

సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రంలో మావోల రిక్రూట్‌మెంట్‌కు యత్నాలు మొదలుపెట్టడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదిలోనే అణిచివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందుకే భారీ ఆపరేషన్‌కు అప్పటి కపుడు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్‌ దళాన్ని పట్టుకోవడం, లేదా తెలంగాణ నుంచి తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది పోలీసుశాఖ. డీజీపీ మహేందర్‌ రెడ్డి శుక్రవారం స్వయంగా ఆసిఫాబాద్‌కు వెళ్లి తాజా పరి స్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రకమిటీ సభ్యుడి రాకతో..
2009 తరువాత రాష్ట్రంలో మావోయిస్టు సంచారం దాదాపుగా లేదు. ఇక్కడి గ్రేహౌండ్స్‌ దళాల దూకుడుకు మావో అగ్రనేతలంతా అంతా చత్తీస్‌ఘడ్, ఒడిశాలకు వలసవెళ్లారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా..చిన్నస్థాయి కొరియర్లు మాత్రమే వచ్చేవారు. కాని తాజాగా భాస్కర్‌తో పాటు బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌ (వీరిద్దరి తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది), చత్తీస్‌ఘడ్‌కు చెందిన వర్గీస్‌ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్‌ అనిత, పాండు అలియాస్‌ మంగులు, మీనా, రాములతో కూడిన దళం ఆసిఫాబాద్‌లోని తిర్యాణీ మండలం పరిధిలో సంచరించింది. వీరు 24 గంటల్లో రెండుసార్లు స్పెషల్‌ పార్టీకి తారసపడ్డాయి. రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో భాస్కర్‌ దళం తృటిలో తప్పించుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానిక యువత అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మావోల రిక్రూట్‌మెంట్లు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించండి: జగన్‌
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలన కోసం అడవుల్లో భారీగా కూంబింగ్‌ చేపట్టడాన్ని ప్రజలు, ప్రజాసంఘాలు ఖండించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటనలో కోరాడు. ప్రజలు, దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement