రాష్ట్రంలో క్రైమ్‌రేటు తగ్గుదలలో పీడీ యాక్ట్ బాగా ఉపకరించింది. సాధారణ దొంగలు, రౌడీషీటర్లు, పదే పదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నవారు తదితర నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనివల్ల వ్యవస్థీకృత నేరాల్లో తగ్గుదల కనిపించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కింద కేసులు మోపబడిన వారు చేసే నేరాల్లో గతేడాదికి ఇప్పటికీ 37% క్రైమ్ రేటు తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,199 మంది నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.
– సాక్షి, హైదరాబాద్
ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదు...
ఈ మొత్తం నేరాల్లో కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు కూడా ఉండటంతో వారిపై పీడీ యాక్ట్ అమలు చేయకుండా పోలీస్‌శాఖపై మొదట్లో ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు కేసుల నమోదుకు వెనుకాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాల నియంత్రణలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్న వైఖరితో పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ మోపబడినవారిలో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేసిన వారుండటం సంచలనం రేపుతోంది. షీ టీమ్స్ ద్వారా ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపుల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ చర్యలు చేపడుతోంది. మొదటిసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తుండగా, రెండోసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే ఏకంగా కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇన్ని చేసినా నాలుగోసారి పట్టుబడుతున్న వారిని పీడీ యాక్ట్‌కు సిఫారసు చేసినట్టు స్పష్టమవుతోంది. పదే పదే అదే నేరానికి పాల్పడితే ఉపేక్షించకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని ఐజీ స్వాతి లక్రా స్పష్టం చేశారు.
నేరాలను బట్టి చూస్తే...
రౌడీషీటర్లు–129, బూట్ లెగ్గర్– 18, అనైతిక కార్యకలాపాల నేరాలు–67, డ్రగ్ సరఫరా నేరస్థులు–42, మోసపూరిత వ్యక్తులు–62, పీడీఎస్ బియ్యం దొంగలు–17, మత ఘర్షణ, సంబంధిత నేరస్థులు– 2, డెకాయిటీస్–13, రాబరీ నేరస్థులు–55, దోపిడీ దొంగలు–202, చైన్‌స్నాచర్లు–122, దృష్టి మరల్చే దొంగలు–98, గూండాలు–34, లైంగిక వేధింపుల నిందితులు–3, ఆర్థిక నేరస్థులు–15, వాహనాల దొంగలు–2, ఇతర సాధారణ నేరస్థులు–57.. మొత్తం 1,199 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
అటవీ శాఖ కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ కలప రవాణాతో ముడి పడిన వివిధ అంశాలపై జిల్లాల్లో పోలీసు అధికారు లతో కలిసి అటవీశాఖ సంయుక్తంగా అమలుచేస్తున్న కార్యా చరణ కారణంగా ఇప్పటికే 200 కేసులకు పైగా నమోదు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రూ. 40–50 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 500మంది బడా స్మగ్లర్లను అటవీ అధి కారులు గుర్తించారు. కలప అక్రమ రవాణాపై సాగిస్తున్న ప్రత్యేక కార్యాచరణను ఈ నెలాఖరు వరకు కొనసాగించ నున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఆ తర్వాత కూడా నిరంతర నిఘా కొనసాగుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా వారిపై పీడీయాక్ట్ సహా కఠినమైన చట్టాల ప్రయోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది.
కఠిన శిక్షలు అమలు..: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో దాదాపు 20 మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్ ప్రయోగానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు, మూడురోజుల వ్యవధిలోనే పలువురిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదుచేసి, ఏడాదిపాటు బెయిల్ దొరకని విధంగా శిక్ష విధించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపైనే కాకుండా వారి వెనక ఉండి ప్రోత్సహించే వారిని కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్ సాక్షికి తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా నిరంతర నిఘాతోపాటు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment