సాక్షి, కొత్తగూడెం: పర్యావరణానికి పట్టుగొమ్మలుగా ఉన్న అడవులు జిల్లాలో ఏటా తగ్గిపోతున్నాయి. పోడు కొడుతూ గిరిజనేతరులు అక్రమంగా సాగు చేస్తుండగా, మరోవైపు స్మగ్లింగ్ మాఫియా విలువైన కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తోంది. అటవీ శాఖ చెక్‌పోస్టులున్నా తనిఖీలు నామమాత్రమే కావడంతో ఈ కలపంతా గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటుతోంది. అటవీ కలపకు మనజిల్లా పెట్టింది పేరు. టేకు, ఏగిస, జిట్రేగి, పెద్దేప.. ఇలా పలురకాల విలువైన కలపకు ఇక్కడి అడవులు పుట్టినిల్లు. పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్‌లోనే ఈ అడవంతా విస్తరించి ఉంది. తెలంగాణలో జిల్లాల్లోనే అటవీ ప్రాంతం ఇక్కడ ఎక్కువగా ఉంది.
జిల్లా మొత్తం విస్తీర్ణం 16,029 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో 8,436 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతమే. అటవీ ప్రాంతం ఇంత పెద్దఎత్తున ఉన్నా సంబంధిత శాఖ ఇక్కడి కలపను కాపాడే విషయంలో నిద్రావస్థలో ఉందని చెప్పవచ్చు. పాల్వంచ, గుండాల, పినపాక, మణుగూరు, భద్రాచలం, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, వేలేరుపాడు, ముల్కలపల్లి, వెంకటాపురం మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో విలువైన కలప ఉంది. ముదిరిన టేకు, ఇతర కలపను కావాల్సిన సైజుల్లో ముక్కలుగా చేసి రాత్రికి రాత్రే ఇటు విజయవాడ, అటు వరంగల్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీకి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు సరిహద్దుగా ఉండడంతో అక్కడి వ్యాపారులే ఎక్కువగా జిల్లాలోని కొంతమంది నేతల సహకారంతో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం.
ప్రతి నెలా ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వారి కళ్లుగప్పి ఇంకా విలువైన అటవీ సంపద తరలిపోతోంది. గత నెలలో ఒక్క పాల్వంచ రేంజ్ పరిధిలోనే సుమారు రూ.రెండున్నర లక్షల విలువైన కలపను సంబంధిత సిబ్బంది పట్టుకున్నారు. మల్లారం, మామిడిగూడెంలో రూ. 2 లక్షలు, పాండురంగాపురంలో రూ. 15 వేలు, పుల్లాయగూడెం, నాగారంలో రూ. 35 వేల విలువైన కలప పట్టుకున్నారు. అయితే స్మగ్లింగ్ చేస్తున్న వారిపై నామమాత్రపు కేసులే పెడుతుండడంతో మళ్లీ వారు ఇదే బాటను ఎంచుకుంటుండడం గమనార్హం.
సిబ్బంది లేరని సాకు చూపుతున్న అధికారులు..
జిల్లాలో అటవీ శాఖ పరిధిలో ఇంకా 30 బీట్ ఆఫీసర్లు, 26 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, మూడు సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఇవి ఖాళీగా ఉన్నా ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు అసవరమైన సిబ్బంది లేకపోవడంతో కలప స్మగ్లింగ్ ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ చందంగా కొనసాగుతోంది. అయితే సిబ్బంది లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఉన్నతాధికారులు చెపుతున్నప్పటికీ.. సరిపడా ఉన్నచోట కూడా కలప అక్రమంగా ఎలా తరలుతోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పర్యవేక్షణ, నిఘా కొరవడడంతో గతంలో స్మగ్లింగ్‌కు పాల్పడిన వారే మళ్లీ దీన్ని వ్యాపారంగా ఎంచుకొని కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. సిబ్బంది కళ్లుగప్పి విలువైన కలప తరలుతున్నా నిఘా కొరవడింది.
‘చెక్’ ఎక్కడ..?
కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తం గా 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పాల్వం చ, యానంబైలు, కోయిదా, ఇల్లెందు, కొత్తగూడెం, రామవరం, తల్లాడ, ముత్తగూడెం, రేగళ్ల, ఖమ్మం, అశ్వారావుపేట, భద్రాచలంలో ఈ చెక్ పోస్టులున్నాయి. అయితే వీటిలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. దీంతో పగటి వేళల్లోనే ఈ చెక్‌పోస్టులు దాటి కలప అక్రమంగా తరలుతోం దనే ఆరోపణలు వస్తున్నాయి. అడవిలో దట్టమైన పొదల మధ్య కలప దుంగలను పెట్టి వాటిని వాహనాల్లో పేర్చి.. దర్జాగా తరలిస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలను కూడా సిబ్బంది వదిలేస్తుండడంతో అసలు చెక్‌పోస్టుల ద్వారానే స్మగ్లర్లు రాచమార్గాన్ని ఎంచుకుంటున్నట్లు సమాచారం. అటవీ శాఖ గత ఆర్నెళ్ల క్రితం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. అయితే జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ కాకపోవడం, ఉన్న సిబ్బంది నిఘా వైఫల్యంతో కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది.
అడవితల్లి ఆక్రందన
Published Wed, Dec 4 2013 6:23 AM | Last Updated on Mon, Oct 22 2018 2:02 PM
Advertisement
Advertisement