Timber smuggling
-
పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడ్డ కలప అక్రమ దందా
-
కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు
బెజ్జూర్ (సిర్పూర్): ‘కలప అక్రమ దందా నువ్వే చేపడుతున్నావు.. ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్.. నీపై కేసులు బనాయిస్తాం..’ అంటూ బెజ్జూర్ అటవీ శాఖ ఎఫ్ఎస్వో ప్రసాద్ బుధవారం ‘సాక్షి’ బెజ్జూర్ విలేకరిని బెదిరింపులకు గురిచేశారు. ‘మాయమవుతున్న కలప’ శీర్షికతో రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. కలప అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు బుధవారం ఉదయం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు. నిఘా పెంచి కలప అక్రమ రవా ణాను అడ్డుకుంటామని తెలపాల్సిన అధికారులు ఇలా భయబ్రాంతులకు గురిచేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్‌పై ఎఫ్ఆర్వో దయాకర్‌ను వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. ‘సాక్షి’ కథనంతో స్పందించిన అటవీ అధికారులు బుధవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎస్కే మోహిత్ అనే వ్యక్తి ఇంట్లో ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టి 25 టేకు కలప చెక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు ప్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో అప్పలకొండ వెల్లడించారు. దీని విలువ రూ.8500లు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో బెజ్జూర్ ఎఫ్ఆర్వో దయాకర్, ఎఫ్ఎస్వో ప్రసాద్, బీట్ అధికారి వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు. -
కలప అక్రమ రవాణాకు అడ్డేదీ..?
సాక్షి, త్రిపురారం : అడవుల సంరక్షణకు అధికార యంత్రాంగం చర్యలెన్నీ చేపడుతున్నా నిష్ప్రయోజనమే అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో స్వార్థపరుల గొడ్డలి వేటుకు అటవీ సంపద గురవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూముల నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా జరుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి తేటతెల్లం చేస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఉన్న ఫారెస్టు భూముల్లో గల వృక్ష సంపద నానాటికీ కనుమరుగవుతోంది. కొందరు స్వార్థపరులు తమ వ్యక్తి గత ప్రయోజనాల కోసం ఫార్టెస్టు భూముల్లో ఉన్న చెట్లను నరికి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొందరు యజమానులు సోమ్ముచేసుకుంటున్నారు. నాణ్యతా లేని కలపను కోత మిషన్ల వ్యాపారులకు ఇటుక బట్టీలు కాల్చ డానికి వినియోగిస్తుండగా నాణ్యతా ఉన్న కలప ద్వారా అధిక ఆదాయం గడిస్తున్నారు. అధిక ధరకు విక్రయం.. నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఫారెస్టు భూములు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ అటవీ భూముల్లో లభిస్తున్న అడవివేప, మద్ది తదితర విలువైన చెట్లతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్లను నరికి వాటి నుంచి లభించే కలపను ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అధికారుల కళ్లుకప్పి నిత్యం ట్రాక్టర్లను తరలిస్తున్నారు. కలప వ్యాపారులు పగటివేళల్లో నరికివేసిన చెట్లను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు నిఘా ఏర్పాటు చేసి చెట్లను నరికివేస్తున్న కలప వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మామూళ్లు పుచ్చుకుంటూ.. ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదపై పర్యవేక్షణ ఉంచి దాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎవరైన అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడినా మామూళ్లు పుచ్చుకుంటూ వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదను కాపాడుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాల్టాకు తూట్లు.. పర్యావరణ పరిరక్షణకు నీరు, భూమి, చెట్లు ప్రధానం. వీటిని కాపాడుకుంటేనే మానవమనుగడ సాధ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని విచ్ఛలవిడిగా వినియోగించకుండా ప్రభుత్వం ‘వాల్టా’చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అక్రమార్కులు నిబంధనలు ఉల్లఘిస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
కలప స్మగ్లింగ్ అడ్డుకట్టకు అటవీ, పోలీస్ శాఖల చర్యలు
సాక్షి.హైదరాబాద్: కలప స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలను ముమ్మరం చేశాయి. అడవుల్లోపల అక్రమంగా చెట్లు కొట్టడం, ఆ దుంగలను అక్రమ రవాణా కోసం ఇళ్లు, ఇతర పరిసరాల్లో దాచిపెడుతున్న ఘటనలు ఎక్కువ కావడంతో తనిఖీలు, రక్షణచర్యలు మరింత పెంచారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం కొమరంభీమ్ జిల్లా చింతల మానేపల్లి మండలం లంబాడీ హట్టిలో పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కలప దుంగలతో పాటు పెద్దమొత్తంలో గుడుంబా నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెట్లు కొట్టడం, కలప అక్రమ రవాణా, వంటి అక్రమాలకు, నేరాలకు పాల్పడితే కఠిన చట్టాల ప్రయోగంతో పాటు పీడీయాక్ట్ కింద బెయిల్ దొరకని విధంగా కేసులు పెట్టే అవకాశం ఉందని గ్రామస్థులకు అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించి శాఖల అధికారులు ఆ గ్రామ ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అడవుల పరిరక్షణకు, పచ్చదనాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, దానికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఇకపై అడవుల్లో చెట్లు నరకడం, గుడుంబా కాయడం వంటి నేరాలకు పాల్పడబోమంటూ గ్రామస్థులతో అధికారులు ప్రమాణం చేయించారు. -
‘పీడీ’కిలి బిగిసింది
రాష్ట్రంలో క్రైమ్‌రేటు తగ్గుదలలో పీడీ యాక్ట్ బాగా ఉపకరించింది. సాధారణ దొంగలు, రౌడీషీటర్లు, పదే పదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నవారు తదితర నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనివల్ల వ్యవస్థీకృత నేరాల్లో తగ్గుదల కనిపించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కింద కేసులు మోపబడిన వారు చేసే నేరాల్లో గతేడాదికి ఇప్పటికీ 37% క్రైమ్ రేటు తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,199 మంది నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. – సాక్షి, హైదరాబాద్ ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదు... ఈ మొత్తం నేరాల్లో కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు కూడా ఉండటంతో వారిపై పీడీ యాక్ట్ అమలు చేయకుండా పోలీస్‌శాఖపై మొదట్లో ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు కేసుల నమోదుకు వెనుకాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాల నియంత్రణలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్న వైఖరితో పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ మోపబడినవారిలో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేసిన వారుండటం సంచలనం రేపుతోంది. షీ టీమ్స్ ద్వారా ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపుల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ చర్యలు చేపడుతోంది. మొదటిసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తుండగా, రెండోసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే ఏకంగా కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇన్ని చేసినా నాలుగోసారి పట్టుబడుతున్న వారిని పీడీ యాక్ట్‌కు సిఫారసు చేసినట్టు స్పష్టమవుతోంది. పదే పదే అదే నేరానికి పాల్పడితే ఉపేక్షించకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని ఐజీ స్వాతి లక్రా స్పష్టం చేశారు. నేరాలను బట్టి చూస్తే... రౌడీషీటర్లు–129, బూట్ లెగ్గర్– 18, అనైతిక కార్యకలాపాల నేరాలు–67, డ్రగ్ సరఫరా నేరస్థులు–42, మోసపూరిత వ్యక్తులు–62, పీడీఎస్ బియ్యం దొంగలు–17, మత ఘర్షణ, సంబంధిత నేరస్థులు– 2, డెకాయిటీస్–13, రాబరీ నేరస్థులు–55, దోపిడీ దొంగలు–202, చైన్‌స్నాచర్లు–122, దృష్టి మరల్చే దొంగలు–98, గూండాలు–34, లైంగిక వేధింపుల నిందితులు–3, ఆర్థిక నేరస్థులు–15, వాహనాల దొంగలు–2, ఇతర సాధారణ నేరస్థులు–57.. మొత్తం 1,199 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అటవీ శాఖ కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ కలప రవాణాతో ముడి పడిన వివిధ అంశాలపై జిల్లాల్లో పోలీసు అధికారు లతో కలిసి అటవీశాఖ సంయుక్తంగా అమలుచేస్తున్న కార్యా చరణ కారణంగా ఇప్పటికే 200 కేసులకు పైగా నమోదు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రూ. 40–50 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 500మంది బడా స్మగ్లర్లను అటవీ అధి కారులు గుర్తించారు. కలప అక్రమ రవాణాపై సాగిస్తున్న ప్రత్యేక కార్యాచరణను ఈ నెలాఖరు వరకు కొనసాగించ నున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఆ తర్వాత కూడా నిరంతర నిఘా కొనసాగుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా వారిపై పీడీయాక్ట్ సహా కఠినమైన చట్టాల ప్రయోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది. కఠిన శిక్షలు అమలు..: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో దాదాపు 20 మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్ ప్రయోగానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు, మూడురోజుల వ్యవధిలోనే పలువురిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదుచేసి, ఏడాదిపాటు బెయిల్ దొరకని విధంగా శిక్ష విధించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపైనే కాకుండా వారి వెనక ఉండి ప్రోత్సహించే వారిని కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్ సాక్షికి తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా నిరంతర నిఘాతోపాటు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
అటవీ మంత్రి ఇలాఖాలో వెలుగు జూసిన కలప కుంభకోణం
-
జిల్లాలో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు
కలప అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వరంగల్ రూరల్ : జిల్లాలో కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీని కలెక్టర్ అధ్యక్షతన, సీపీ, జేసీ, ఐటీడీఏ పీఓ, వనసేన, ఎకో క్లబ్ సభ్యులతో ఏర్పాటుచేశారు. ఈ కమిటీ తొలి సమావేశం శనివారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కలప అక్రమ రవాణా అడ్డుకునేందుకు వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యాన చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తరచూ తనిఖీ చేయాలన్నారు. ఆ తర్వాత అటవీ చట్టం ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు ఎన్నిక కేసులు నమోదయ్యాయని ఆరా తీశారు. అటవీ వన సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని, చెక్‌పోస్టుల సంఖ్య పెంచాలని డీఎఫ్‌ఓకు సూచించారు. ప్రతినెల జిల్లా స్దాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, సభ్యులు ఖచ్చితంగా హజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జేసీ ముండ్రాతి హరిత, డీసీపీ ఇస్మాయిల్, డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి, వనసేవ అధ్యక్ష, కార్యదర్శులు పొట్లపల్లి వీరభద్రరావు, గంగోజుల నరేష్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి పాల్గొన్నారు. -
ఈ బల్లకట్టు మాఫియా కనికట్టు
అడవిలో దొంగలు పడ్డారు ఆదిలాబాద్, మహారాష్ట్రల నుంచి కోట్లలో కలప స్మగ్లింగ్ రాత్రికి రాత్రే టేకు చెట్లను నరికి తరలింపు - రోడ్డు మార్గమే కాదు.. రైలు, జల మార్గాల ద్వారా అక్రమ రవాణా - హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, విజయవాడకు చేరవేత - పావులు ముల్తానీలు.. సూత్రధారులు బడా వ్యాపారులు ఈ చిత్రం చూశారా? ఏముంది..? నీటిపై ఓ బల్లకట్టు తేలుతోందంటారా? కానీ మీరు అనుకున్నట్టు అది బల్లకట్టు కాదు! మాఫియా కనికట్టు!! కలప అక్రమ రవాణాకు స్మగ్లర్లు వేసిన సరికొత్త స్కెచ్. భారీ టేకు చెట్లను నేలకూల్చి.. వాటి దుంగలను ఇలా బల్లకట్టుగా మార్చి ప్రాణహిత నదిలో వదిలేస్తున్నారు. అవి నీటిపై తేలుతూ వెళ్తుంటాయి. కలప స్మగ్లర్లు తమకు అనువైన చోట వాటిని నది నుంచి బయటకు తీసి అక్కడ్నుంచి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇలా ప్రతినెలా కోట్ల రూపాయల్లో కలప స్మగ్లింగ్ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి తదితర మండలాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో నరికిన టేకు దుంగలు ఇలా తరలిస్తున్నారు. ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని దేశిల్పేట్-జోగనూరు గ్రామాల మధ్య ప్రాణహిత తీరాన తీసిందీ ఈ చిత్రం! విలువైన కలప ఇలా తరలిపోతోందని తెలిసినా అటవీశాఖ అధికారులు, పోలీసులు కళ్లు మూసుకుంటున్నారు. అడవిలో దొంగలు పడ్డారు.. భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి.. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ కేంద్రంగా కోట్లు విలువచేసే కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. కలప మాఫియా అరాచకానికి జిల్లాలో ఇప్పటికే లక్షల ఎకరాల్లో అడవులు మాయమయ్యాయి! ఈ మధ్య మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ మీదుగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు ప్రతిరోజూ రూ.లక్షలు విలువ చేసే కలపను నగరాలకు తరలిస్తున్నారు. కళ్ల ముందే ఈ దందా కొనసాగుతున్నా.. అటవీ శాఖ చేష్టలుడి గిచూస్తోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆకుపచ్చ తెలంగాణను కాంక్షిస్తూ హరితహారాన్ని ఉద్యమంగా చేపడుతుంటే.. మరోవైపు స్మగ్లర్లు ఉన్న అడవులను ఇలా హాంఫట్ చేస్తున్నారు! పరిస్థితి ఇలాగే కొనసాగితే అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్‌కు ఇకపై ఆ పేరు ప్రశ్నార్థకం కానుంది. ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సాగుతున్న ఈ స్మగ్లింగ్‌పై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ కాదేదీ రవాణాకు అనర్హం! ఒక్క వాయుమార్గం మినహా స్మగ్లర్లు అన్ని మార్గాల్లో కలపను తరలిస్తున్నారు. రోడ్డు, రైలు మార్గాలనే కాదు.. జల మార్గాన్ని తమ దందాకు రాచమార్గంగా వాడుకుంటున్నారు. ఇదిగో రోడ్డు మార్గం.. రోడ్డు మార్గం ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కలప తరలిపోతోంది. పలుచోట్ల అటవీ శాఖ చెక్‌పోస్టుల్లో పనిచేసే సిబ్బందికి, కొందరు అధికారులకు తెలిసినా కళ్లు మూసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఇచ్చోడ అటవీ ప్రాంతాల నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్, నిజామాబాద్‌కు నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో కలప అక్రమ రవాణా అవుతోంది. ఖానాపూర్, కడెం, జన్నారం ప్రాం తాల నుంచి కలప దుంగలను పొన్కల్, మందఇప్ప, గొడల్పంపు, చింతల్‌చాంద, మున్పల్లి, కూచన్‌పల్లి, పీచర, వెంకటాపూర్ రేవుల ద్వారా గోదావరిని దాటించి కరీంనగర్, నిజామాబాద్ తరలిస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్, చెన్నూరు కేంద్రాలుగా రాజీవ్ రహదారిపై ఈ కలప వాహనాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్తున్నాయి. కరీంనగర్ వెస్ట్ డివిజన్లో సుమారు వంద వరకు, నిజామాబాద్ పాత నగరంలో 20కిపైగా సా మిల్లులు, టింబర్ డిపోలున్నాయి. వీటిలో అత్యధికం ఈ అక్రమ కలపతోనే నడుస్తున్నాయి. స్మగ్లింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది..? అటవీ శాఖ లెక్కల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా 16.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 40 శాతం అంటే 7.16 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. జిల్లాలో మొత్తం 1,610 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినా 16 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నట్లు తేల్చారు. బీట్ల వారీగా చూస్తే.. ఉట్నూర్ రేంజ్‌లోని శ్యాంపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి రేంజ్‌లోని వాయిపేట్, పెంబీ రేంజ్, మామడ, ఖానాపూర్, కడెం రేంజ్‌ల పరిధిలో కొంత భాగం, తాళ్లపేట్, నీల్వాయి, కోటపల్లి రేంజ్‌లు, తిర్యాణి రేంజ్‌లోని మంగీ అటవీ ప్రాంతం, కర్జెల్లి రేంజ్‌లోని కౌటాల, గూడెం, డింబ, బెజ్జూరు రేంజ్‌లోని మాలిని, పాపన్నపేట అటవీ ప్రాంతాల్లో అడవి నరికివేత, స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. జలమార్గం ఇలా.. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి, కొటపల్లి వంటి మండలాల పరిధిలో, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నరికిన కలప దుంగలను బల్లకట్టుగా తయారు చేస్తారు. వాటిని ప్రాణహిత నదిలో దిగువకు వదులుతారు. నాణ్యమైన టేకు కలపకు నీటిలో తేలే గుణం ఉంటుంది. ఈ బల్లకట్టు దుంగలు చెన్నూరు ప్రాంతంలో గోదావరిలో కలుస్తున్నాయి. అక్కడ్నుంచి కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దమ్మూరు వంటి దట్టమైన అటవీప్రాంతం ఉన్న నదీపరివాహక గ్రామాల దాకా వస్తుంటాయి. అక్కడ వీటిని నదిలోంచి బయటకు తీసి లారీల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ వంటి నగరాలకు తరలిస్తున్నారు. ఒక్క జలమార్గం ద్వారానే నెలకు సుమారు రూ.కోటికిపైగా విలువ చేసే కలప అక్రమ రవాణా అవుతోంది. మంథనికి చెందిన ఓ బడా కలప వ్యాపారి కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే ఈ వ్యాపారి.. మూడు రాష్ట్రాల్లోని అటవీ, పోలీసు శాఖలకు చెందిన కొందరు అధికారుల చేతులను మామూళ్లతో కట్టేస్తారనే ఆరోపణలున్నాయి. రైళ్లలో తరలుతోందిలా కొందరు రైల్వే సిబ్బంది సహకారంతో దుంగల రవాణా సాగుతోంది. గూడ్స్ రైళ్లలో దుంగలు మహారాష్ట్ర నుంచి వరంగల్, విజయవాడ వంటి ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. ముఖ్యంగా కాగజ్‌నగర్-మంచిర్యాల-వరంగల్ రైలు మార్గం ద్వారా ఈ రవాణా జరుగుతోంది. ఫర్నిచర్ రూపంలోనూ.. టేకు దుంగలను ఫర్నిచర్‌గా తయారు చేసి కూడా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు కొన్ని సరుకు రవాణా చేసే ట్రాన్స్‌పోర్టు, పార్సిల్ సర్వీసు వాహనాలను వాడుకుంటున్నారు. మంచిర్యాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ట్రాన్స్‌పోర్టులో ఫర్నిచర్ రూపంలో కలప రవాణా అవుతోంది. ఈ ముల్తానీలు.. స్మగ్లింగ్‌లో పావులు! కలప అక్రమ రవాణాలో స్మగ్లర్లు ముల్తానీలను పావులుగా వాడుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఈ ముల్తానీలు బ్రిటిష్ కాలంలో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, జోగిపేట్, ఎల్లమ్మగూడ తదితర గ్రామాలతోపాటు, మహారాష్ట్రలోని చిక్లి వంటి ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా కలప స్మగ్లింగే ప్రధాన వృత్తి. ఈ ముల్తానీ బృందాలు రాత్రికి రాత్రి చెట్లు నరికేసి, ఎడ్ల బండ్లపై దుంగలను జాతీయ రహదారి వరకు తరలిస్తుంటాయి. కేవలం పావుగంటలోనే లారీల్లో కలపను లోడ్ చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఈ లారీలను నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని సా మిల్లులు, ప్రైవేటు కలప డిపోలకు తరలిస్తారు. అడ్డొచ్చిన అటవీ శాఖ అధికారులపై దాడులకు దిగేందుకు కూడా వెనుకాడరు. నిరుపేదలైన వీరిని స్మగ్లర్లు తమ దందాకు పావులుగా వాడుకుంటున్నారు. వీరు ఈ వృత్తి మానుకునేలా అటవీ శాఖ గతంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఆశించిన ఫలితాలివ్వలేదు. మహారాష్ట్ర నుంచి తరలిస్తుండగా చెన్నూర్‌లో స్వాధీనం చేసుకున్న కలప (ఫైల్) -
ఇద్దరు అటవీ బీట్ అధికారుల దారుణహత్య
గొడ్డళ్లతో నరికి చంపిన కలప దొంగలు బొల్లాపల్లి: కలప అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఇద్దరు అటవీశాఖ బీట్ అధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం కనమలచెర్వు పంచాయతీ శివారు నెహ్రూనగర్ తండా సమీపంలోని పురుగులకుంట వద్ద శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. కలప అక్రమ రవాణాదారులు చెట్లను నరుకుతున్నారన్న సమాచారం మేరకు నాయుడుపాలెం, కండ్రిక బీట్ అధికారులు దిడ్ల లాజర్(44), షేక్ బాజీషాహిద్(48) ఘటనాస్థలానికి ఉదయం 8 గంటల సమయంలో తమ ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. వారిపై నిందితులు అటవీశాఖాధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి పాశవికంగా నరికేశారు. లాజర్, బాజీషాహిద్ అక్కడికక్కడే మృతిచెందారు. అటవీశాఖ డీఆర్వో నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాజర్, బాజీలు తమ వద్దనున్న కెమెరాతో తీసిన ఫొటోలను పరిశీలించిన పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనా ప్రాంతానికి సమీపంలోని గాంధీనగర్(సంగం)కు చెందినవారుగా గుర్తించారు. గాలింపు చేపట్టారు. -
కలప తరలుతోంది
వయా గోదావరి - ఛత్తీస్‌గఢ్.. మహారాష్ట్రల నుంచి దిగుమతి - మంథని కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు తరలింపు - తనిఖీలు అంతంతే.. మంథని : ‘తూర్పు’ కేంద్రంగా కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. అధికారుల అండదండలతో ఈ దందా మూడు చెట్లు.. ఆరు దుంగలుగా నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోజూ లక్షలాది రూపాయల విలువ చేసే టేకు కలప మంథని డివిజన్ కేంద్రంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు రవాణా అవుతోంది. అరుునా అటవీ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంథని ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు రూ. 5 లక్షల విలువచేసే కలపలోడుతో వెళ్తున్న లారీ బుధవారం జీడీకే-11గని చెక్‌పోస్టు వద్ద పట్టుబడింది. మంథని మండలం పోతారం గ్రామంలో రూ. 22 వేలు విలువచేసే టేకు కలప అటవీశాఖ అధికారులు, పోలీసులు నిర్వహించిన సోదాలో దొరికింది. గోదావరినది దాటి తూర్పు డివిజన్‌కు దిగుమతి అవుతున్న కలప మహదేవ్పూర్, మహముత్తారం, మంథని మండలాలకు ఎడ్లబండ్ల ద్వారా రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి సైజులు, ఫర్నిచర్ రూపంలో నిత్యం లారీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున్న తరలుతోంది. పట్టని అధికారులు... తూర్పు డివిజన్లోని అటవీ గ్రామాల్లో పెద్ద ఎత్తున టేకు కలప నిల్వలున్నాయనే ఆరోపణలున్నారుు. అరుునా అధికారులు దాడులు నిర్వహించిన సందర్భాలు మచ్చుకు కానరావడంలేదు. ఎక్కడైనా కలప పట్టుబడితే ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. గతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై సరిహద్దుల్లో నిఘా పెట్టినా కలప అక్రమ రవాణాను అదుపు చేయలేకపోయూరు. స్మగ్లర్ల నుంచి ప్రతి నెలా ముడుపులు పుచ్చుకుంటున్న అధికారులు కలప రవాణాపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ స్తున్నారుు. తుపాకులేవీ? కలప అక్రమ రవాణా నియంత్రణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు కేటాయించాలన్న ప్రతిపాదన ఆచరణకు నోచుకోవడంలేదు. ఆయుధాలు లేవనే సాకు చూపుతున్న అధికారులు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పలువురు అంటున్నారు. -
అడవితల్లి ఆక్రందన
సాక్షి, కొత్తగూడెం: పర్యావరణానికి పట్టుగొమ్మలుగా ఉన్న అడవులు జిల్లాలో ఏటా తగ్గిపోతున్నాయి. పోడు కొడుతూ గిరిజనేతరులు అక్రమంగా సాగు చేస్తుండగా, మరోవైపు స్మగ్లింగ్ మాఫియా విలువైన కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తోంది. అటవీ శాఖ చెక్‌పోస్టులున్నా తనిఖీలు నామమాత్రమే కావడంతో ఈ కలపంతా గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటుతోంది. అటవీ కలపకు మనజిల్లా పెట్టింది పేరు. టేకు, ఏగిస, జిట్రేగి, పెద్దేప.. ఇలా పలురకాల విలువైన కలపకు ఇక్కడి అడవులు పుట్టినిల్లు. పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్‌లోనే ఈ అడవంతా విస్తరించి ఉంది. తెలంగాణలో జిల్లాల్లోనే అటవీ ప్రాంతం ఇక్కడ ఎక్కువగా ఉంది. జిల్లా మొత్తం విస్తీర్ణం 16,029 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో 8,436 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతమే. అటవీ ప్రాంతం ఇంత పెద్దఎత్తున ఉన్నా సంబంధిత శాఖ ఇక్కడి కలపను కాపాడే విషయంలో నిద్రావస్థలో ఉందని చెప్పవచ్చు. పాల్వంచ, గుండాల, పినపాక, మణుగూరు, భద్రాచలం, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, వేలేరుపాడు, ముల్కలపల్లి, వెంకటాపురం మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో విలువైన కలప ఉంది. ముదిరిన టేకు, ఇతర కలపను కావాల్సిన సైజుల్లో ముక్కలుగా చేసి రాత్రికి రాత్రే ఇటు విజయవాడ, అటు వరంగల్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీకి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు సరిహద్దుగా ఉండడంతో అక్కడి వ్యాపారులే ఎక్కువగా జిల్లాలోని కొంతమంది నేతల సహకారంతో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం. ప్రతి నెలా ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వారి కళ్లుగప్పి ఇంకా విలువైన అటవీ సంపద తరలిపోతోంది. గత నెలలో ఒక్క పాల్వంచ రేంజ్ పరిధిలోనే సుమారు రూ.రెండున్నర లక్షల విలువైన కలపను సంబంధిత సిబ్బంది పట్టుకున్నారు. మల్లారం, మామిడిగూడెంలో రూ. 2 లక్షలు, పాండురంగాపురంలో రూ. 15 వేలు, పుల్లాయగూడెం, నాగారంలో రూ. 35 వేల విలువైన కలప పట్టుకున్నారు. అయితే స్మగ్లింగ్ చేస్తున్న వారిపై నామమాత్రపు కేసులే పెడుతుండడంతో మళ్లీ వారు ఇదే బాటను ఎంచుకుంటుండడం గమనార్హం. సిబ్బంది లేరని సాకు చూపుతున్న అధికారులు.. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో ఇంకా 30 బీట్ ఆఫీసర్లు, 26 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, మూడు సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఇవి ఖాళీగా ఉన్నా ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు అసవరమైన సిబ్బంది లేకపోవడంతో కలప స్మగ్లింగ్ ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ చందంగా కొనసాగుతోంది. అయితే సిబ్బంది లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఉన్నతాధికారులు చెపుతున్నప్పటికీ.. సరిపడా ఉన్నచోట కూడా కలప అక్రమంగా ఎలా తరలుతోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పర్యవేక్షణ, నిఘా కొరవడడంతో గతంలో స్మగ్లింగ్‌కు పాల్పడిన వారే మళ్లీ దీన్ని వ్యాపారంగా ఎంచుకొని కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. సిబ్బంది కళ్లుగప్పి విలువైన కలప తరలుతున్నా నిఘా కొరవడింది. ‘చెక్’ ఎక్కడ..? కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తం గా 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పాల్వం చ, యానంబైలు, కోయిదా, ఇల్లెందు, కొత్తగూడెం, రామవరం, తల్లాడ, ముత్తగూడెం, రేగళ్ల, ఖమ్మం, అశ్వారావుపేట, భద్రాచలంలో ఈ చెక్ పోస్టులున్నాయి. అయితే వీటిలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. దీంతో పగటి వేళల్లోనే ఈ చెక్‌పోస్టులు దాటి కలప అక్రమంగా తరలుతోం దనే ఆరోపణలు వస్తున్నాయి. అడవిలో దట్టమైన పొదల మధ్య కలప దుంగలను పెట్టి వాటిని వాహనాల్లో పేర్చి.. దర్జాగా తరలిస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలను కూడా సిబ్బంది వదిలేస్తుండడంతో అసలు చెక్‌పోస్టుల ద్వారానే స్మగ్లర్లు రాచమార్గాన్ని ఎంచుకుంటున్నట్లు సమాచారం. అటవీ శాఖ గత ఆర్నెళ్ల క్రితం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. అయితే జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ కాకపోవడం, ఉన్న సిబ్బంది నిఘా వైఫల్యంతో కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది.