
ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న కలప
సాక్షి, త్రిపురారం : అడవుల సంరక్షణకు అధికార యంత్రాంగం చర్యలెన్నీ చేపడుతున్నా నిష్ప్రయోజనమే అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో స్వార్థపరుల గొడ్డలి వేటుకు అటవీ సంపద గురవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూముల నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా జరుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి తేటతెల్లం చేస్తోంది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఉన్న ఫారెస్టు భూముల్లో గల వృక్ష సంపద నానాటికీ కనుమరుగవుతోంది. కొందరు స్వార్థపరులు తమ వ్యక్తి గత ప్రయోజనాల కోసం ఫార్టెస్టు భూముల్లో ఉన్న చెట్లను నరికి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొందరు యజమానులు సోమ్ముచేసుకుంటున్నారు. నాణ్యతా లేని కలపను కోత మిషన్ల వ్యాపారులకు ఇటుక బట్టీలు కాల్చ డానికి వినియోగిస్తుండగా నాణ్యతా ఉన్న కలప ద్వారా అధిక ఆదాయం గడిస్తున్నారు.
అధిక ధరకు విక్రయం..
నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఫారెస్టు భూములు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ అటవీ భూముల్లో లభిస్తున్న అడవివేప, మద్ది తదితర విలువైన చెట్లతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్లను నరికి వాటి నుంచి లభించే కలపను ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అధికారుల కళ్లుకప్పి నిత్యం ట్రాక్టర్లను తరలిస్తున్నారు. కలప వ్యాపారులు పగటివేళల్లో నరికివేసిన చెట్లను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు నిఘా ఏర్పాటు చేసి చెట్లను నరికివేస్తున్న కలప వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
మామూళ్లు పుచ్చుకుంటూ..
ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదపై పర్యవేక్షణ ఉంచి దాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎవరైన అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడినా మామూళ్లు పుచ్చుకుంటూ వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదను కాపాడుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వాల్టాకు తూట్లు..
పర్యావరణ పరిరక్షణకు నీరు, భూమి, చెట్లు ప్రధానం. వీటిని కాపాడుకుంటేనే మానవమనుగడ సాధ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని విచ్ఛలవిడిగా వినియోగించకుండా ప్రభుత్వం ‘వాల్టా’చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అక్రమార్కులు నిబంధనలు ఉల్లఘిస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.