![Illegal Ash Trade Under TDP Govt: Andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ASH-MONEY.jpg.webp?itok=qesU_PQX)
ఎన్టీటీపీఎస్ టు హైదరాబాద్..
రోజుకు 300 లారీల ఫ్లైయాష్ తరలింపు
నెలకు రూ.5.4 కోట్లు, ఏడాదికి రూ 64.80 కోట్ల దోపిడీ
టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో స్టాక్ పాయింట్
ఇతరుల స్టాక్ పాయింట్లు మూసివేత
వాయు కాలుష్యంతో అల్లాడుతున్న ప్రజలు
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చో లేదోగానీ బూడిద నుంచి మాత్రం మన ‘పచ్చ’నేతలు కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకు రూ.18 లక్షలు, నెలకు రూ.5.40 కోట్లు చొప్పున ఏడాదికి రూ. 64.80 కోట్లు దండుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న బూడిద దోపిడీ(illegal ash trade) కథాకమామిషు ఏమిటంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెలరేగిపోతున్నారు.
ప్రణాళిక ప్రకారం పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ఇతరుల స్టాక్ పాయింట్లు మూసివేయించి తన కనుసన్నల్లోనే స్టాక్‌యార్డు నడుపుతున్నారు. ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి ఉచితంగా లోడింగ్ చేసిన ఫ్లైయాష్ ను ఈ స్టాక్ పాయింట్ ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. బూడిద వ్యాపారులు ఎవరైనా తమ స్టాక్ పాయింట్‌కే తోలాలని.. ఇతర ప్రాంతాల లారీలు తమవద్దే లోడింగ్ చేసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి హుకుం జారీచేశారు. – సాక్షి ప్రతినిధి, విజయవాడ
తెలంగాణకు అక్రమ రవాణా..
ఎన్టీటీపీఎస్ విద్యుదుత్పత్తి ద్వారా వెలువుడే ఫ్లైయాష్‌ను ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు, రోడ్ల నిర్మాణం, ప్లైఓవర్ నిర్మాణాలు, భవన నిర్మాణాలకు వినియోగించాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థలకు కావల్సి వస్తే ముందుగా ఎన్టీటీపీఎస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలి. అనుమతి పొందిన వారికే చెరువులో లోడింగ్ చేయాలి. పైగా.. బూడిద లోడింగ్‌పై నామమాత్రపు ధర వసూలుచేయాలని ఏపీ జెన్‌కో పెద్దలు గతంలో ఆదేశాలిచ్చారు. కానీ, ఇవి అమలుకాకుండా సదరు ప్రజాప్రతినిధి అ«ధికారులపై ఒత్తిడి తెచ్చి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందులో అనేకమంది పెద్దలకు భాగస్వామ్యం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మా స్టాక్ పాయింట్లేఉండాలి...
కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమ బూడిద వ్యాపారంతో ప్రజాప్రతినిధులు చెలరేగిపోతున్నారు. సంపద సృష్టించుకునేందుకు ఫ్లైయాష్ వ్యాపారాన్ని అయుధంగా మలుచుకున్నారు. తమవి తప్ప ఇతరుల బూడిద స్టాక్ పాయింట్లు ఉండకూదని అధికారులకు హుకుం జారీచేశారు. మూతపడిన స్టోన్ క్రషర్లు, సడక్ రోడ్డు, కొండ ప్రాంతాల్లో చిన్నచితక ఫ్లైయాష్ నిల్వలు మూసివేయాలని సదరు ప్రజాప్రతినిధి అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు.
దీంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి కనిపించిన స్టాక్ పాయింట్లలో జేసీబీలు పెట్టి వారి లారీలతో బూడిదను బయటకు తరలించి స్వామిభక్తిని చాటుకున్నారు. అంతటితో ఆగకుండా.. మళ్లీ స్టాక్ పాయింట్లు పెట్టొద్దని గట్టిగా హెచ్చరించి వ్యక్తిగతంగా హాజరుకావాలని వాటి నిర్వాహకులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. బైండోవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకూ గురిచేశారు. దీంతో.. తన స్టాక్ పాయింట్ మూసివేయించి తనపైనే బైండవర్ కేసు పెట్టారని.. మూలపాడులో నడుస్తున్న స్టాక్‌పాయింట్‌పై కూడా చర్యలు తీసుకోవాలని బైండోవర్ అయిన ఓ వ్యక్తి ఇటీవల తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశాడు.
రోజుకు 300 లారీలు.. ఏటా రూ 64.80 కోట్ల ఆదాయం..
ఇక మండలంలోని మూలపాడు గ్రామంలో 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన పాత స్టోన్ క్రషర్ స్థలంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఓ స్టాక్‌పాయింట్ నడుస్తోంది. ఫ్లైయాష్ చెరువులో ఉచితంగా లోడింగ్ జరిగిన లారీలు చాలావరకు ప్రజాప్రతినిధి స్టాక్ పాయింట్‌కు చేరుతున్నాయి. అందుకుగాను 20–30 టన్నుల లారీకి రూ.4 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. కొన్ని లారీలు సొంతంగా టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధే ఏర్పాటుచేసుకున్నారు.
ఈ స్టాక్‌యార్డ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీసైజు లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. ఒక్కో లారీకి టన్నుకు రూ.360 చొప్పున 30 టన్నులు లోడింగ్ చేస్తున్నారు. ఒక లారీకి రూ.10,800 వసూలుచేస్తున్నారు. వీరికి టన్నుకు రూ.200 చొప్పున లారీకి రూ.6,000లు మిగులుతోంది. ఈ లెక్కన రోజుకు 300 లారీలకు సుమారు రూ.18 లక్షలు, నెలకు రూ.5.40 కోట్లు.. ఏడాదికి రూ. 64.80 కోట్లు దండుకుంటున్నారు.
గ్రామాలకు కాలుష్యం కాటు..
ఇదిలా ఉంటే.. గ్రామాల సమీపంలో జాతీయ రహదారి పక్కన ఫ్లైయాష్ లోడింగ్ అన్‌లోడింగ్‌తో తీవ్ర వాయుకాలుష్యం వెలువడుతోంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అ«ధికారులను, టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కోరుతున్నప్పటికీ చర్యలు శూన్యం. మొక్కుబడిగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment