
సాక్షి.హైదరాబాద్: కలప స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలను ముమ్మరం చేశాయి. అడవుల్లోపల అక్రమంగా చెట్లు కొట్టడం, ఆ దుంగలను అక్రమ రవాణా కోసం ఇళ్లు, ఇతర పరిసరాల్లో దాచిపెడుతున్న ఘటనలు ఎక్కువ కావడంతో తనిఖీలు, రక్షణచర్యలు మరింత పెంచారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం కొమరంభీమ్ జిల్లా చింతల మానేపల్లి మండలం లంబాడీ హట్టిలో పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కలప దుంగలతో పాటు పెద్దమొత్తంలో గుడుంబా నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చెట్లు కొట్టడం, కలప అక్రమ రవాణా, వంటి అక్రమాలకు, నేరాలకు పాల్పడితే కఠిన చట్టాల ప్రయోగంతో పాటు పీడీయాక్ట్ కింద బెయిల్ దొరకని విధంగా కేసులు పెట్టే అవకాశం ఉందని గ్రామస్థులకు అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించి శాఖల అధికారులు ఆ గ్రామ ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అడవుల పరిరక్షణకు, పచ్చదనాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, దానికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఇకపై అడవుల్లో చెట్లు నరకడం, గుడుంబా కాయడం వంటి నేరాలకు పాల్పడబోమంటూ గ్రామస్థులతో అధికారులు ప్రమాణం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment