తాడోపోడో
♦ విజృంభించిన అటవీ, పోలీస్ శాఖల సిబ్బంది
♦ మిట్టపల్లిలో 30మంది పోడుదారుల అరెస్ట్
♦ కారేపల్లిలో అరకలను అడ్డుకోవడంతో తోపులాట
పోడుదారులతో తాడోపేడో తేల్చుకునేందుకు ఫారెస్ట్, పోలీస్‌శాఖల సిబ్బంది పూనుకోవడంతో అడవిలో మళ్లీ లొల్లి మొదలైంది. సాగును అడ్డుకునేందుకు అటవీ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించడంతో భయాందోళన నెలకొంది. మిట్టపల్లిలో ట్రెంచ్ పనులకు అంతరాయం కలిగించినందుకు, ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి దిగినందుకు..బుధవారం ఊరిని జల్లెడపట్టి పలువురిని అరెస్ట్ చేశారు. ఇళ్లల్లోని మహిళలను లాక్కొచ్చి వ్యాన్లు ఎక్కించడంతో ఉద్రిక్తత నెలకొంది. కారేపల్లిలో పోడు భూముల్లో రైతులు అరకలతో దున్నుతుండగా అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం దాకా చేలల్లోనే సిబ్బంది మకాం వేయడంతో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ ఏర్పడింది.
ఇల్లెందు: పోడు సాగు చేస్తున్న గిరిజనులకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో బుధవారం మిట్టపల్లి గ్రామంలో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రెంచ్ తవ్వకం, మొక్కల పెంపకం పనులను చేపట్టేందుకు అటవీశాఖ సిబ్బంది జేసీబీలతో రాగా..పోడుదారులు పనులను అడ్డుకున్న విషయం విదితమే. తమపై దాడి చేశారని సెక్షన్ అధికారి జయరాం, బీట్ ఆఫీసర్ చందూలాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..ఇల్లెందు, గుండాల సీఐలు అల్లం నరేందర్, టి.రవి, నలుగురు ఎస్‌ఐలు, అటవీశాఖ రేంజర్ కుమార్‌రావు నేతృత్వంలో అటవీసిబ్బంది, పోలీసులు బుధవారం మిట్టపల్లి చేరుకొని ఊరిని జల్లెడ పట్టారు. దాడి చేసిన వారిని గుర్తించి, ఇళ్లల్లో ఉన్న మహిళలను, పురుషులను అదుపులోకి తీసుకొని, బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్ట్ చేస్తున్న క్రమంలో మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. గ్రామస్తులంతా గుమిగూడడం, బలగాలు వారిని బలవంతంగా లాక్కెళ్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరందరినీ ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది రిజర్వ్ ఫారెస్ట్‌లో మూడు జేసీబీలతో ట్రెంచ్ పనులు చేపట్టారు. పోలీసుల సంరక్షణగా ఈ ప్రక్రియ కొన సాగింది.
పాల్వంచ రూరల్: రాత్రి సమయంలో పోడు సాగును అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిని దూషించి, విధులకు ఆటంకం కలిగించిన 22 మంది గిరిజనులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాయకారియానంబైల్ గ్రామపంచాయతీ పూసలతండాలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కొందరు పోడు సాగు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి వన్యమృగ సంరక్షణ విభాగం స్రైకింగ్ ఫోర్స్ యానంబైల్ సెక్షన్ ఆఫీసర్ గోపాలకృష్ణ సిబ్బందితో కలిసి రాత్రి సమయంలో అక్కడికి వెళ్లారు. పోడు సాగు చేసేందుకు అరక పనిముట్లు పట్టుకు వస్తున్న భూక్యా బాసుతో పాటు మరో 21 మందిని అడ్డుకున్నారు. దీనిపై తనతో దుర్భాషలాడారని సెక్షన్ ఆఫీసర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బి. సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
పోడు సహించం..దాడిని తీవ్రంగా పరిగణిస్తాం మిట్టపల్లి సందర్శనలో సీఎఫ్‌ఓ నర్సయ్య
ఇల్లెందు: అటవీభూముల్లో చెట్లను నరికి చేపట్టే పోడు సాగును ఏమాత్రం సహించమని, ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి దిగితే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా అటవీ క్షేత్రాధికారి(సీఎఫ్‌ఓ) జి.నర్సయ్య హెచ్చరించారు. అటవీసిబ్బందిపై దాడి చేసిన ఘటనలో బుధవారం మిట్టపల్లిలో పోడు సాగుదారులను అరెస్ట్ చేసిన క్రమంలో అక్కడి అటవీప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..జిల్లాలో 5.65 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉండగా ఇప్పటి వరకు లక్ష హెక్టార్లు పోడు సాగుదారుల చెరలోకి చేరిందన్నారు.
పట్టాలు వస్తాయని భావించి ఇష్టారాజ్యంగా అడవిని నరికేస్తున్నారని, పోడును గుర్తించి ఇప్పటి వరకు 2.84 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గతంలో మాదిరి మరో 4 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. 60వేల ఎకరాల్లో అటవీహక్కు పత్రాలు తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో బీట్ పరిధిలో అన్యాక్రాంత ప్రాంతాలను గుర్తించి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సిబ్బంది కొరత లేదని, అన్ని స్థాయిల వారు సమన్వయంతో పనిచేసి అటవీ సంరక్షణకు పాటుపడాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఆయన వెంట రేంజర్ కుమార్‌రావు, పోలీసు సీఐలు నరేందర్, టి.రవి, ఎస్‌ఐలు ఇబ్రహీం, అనిల్‌కుమార్, రాజు, రవి, అటవీశాఖ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.