ఈ బల్లకట్టు మాఫియా కనికట్టు
అడవిలో దొంగలు పడ్డారు
ఆదిలాబాద్, మహారాష్ట్రల నుంచి కోట్లలో కలప స్మగ్లింగ్
రాత్రికి రాత్రే టేకు చెట్లను నరికి తరలింపు
- రోడ్డు మార్గమే కాదు.. రైలు, జల మార్గాల ద్వారా అక్రమ రవాణా
- హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, విజయవాడకు చేరవేత
- పావులు ముల్తానీలు.. సూత్రధారులు బడా వ్యాపారులు
ఈ చిత్రం చూశారా? ఏముంది..? నీటిపై ఓ బల్లకట్టు తేలుతోందంటారా? కానీ మీరు అనుకున్నట్టు అది బల్లకట్టు కాదు! మాఫియా కనికట్టు!! కలప అక్రమ రవాణాకు స్మగ్లర్లు వేసిన సరికొత్త స్కెచ్. భారీ టేకు చెట్లను నేలకూల్చి.. వాటి దుంగలను ఇలా బల్లకట్టుగా మార్చి ప్రాణహిత నదిలో వదిలేస్తున్నారు. అవి నీటిపై తేలుతూ వెళ్తుంటాయి. కలప స్మగ్లర్లు తమకు అనువైన చోట వాటిని నది నుంచి బయటకు తీసి అక్కడ్నుంచి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇలా ప్రతినెలా కోట్ల రూపాయల్లో కలప స్మగ్లింగ్ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి తదితర మండలాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో నరికిన టేకు దుంగలు ఇలా తరలిస్తున్నారు. ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని దేశిల్‌పేట్-జోగనూరు గ్రామాల మధ్య ప్రాణహిత తీరాన తీసిందీ ఈ చిత్రం! విలువైన కలప ఇలా తరలిపోతోందని తెలిసినా అటవీశాఖ అధికారులు, పోలీసులు కళ్లు మూసుకుంటున్నారు.
అడవిలో దొంగలు పడ్డారు.. భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి.. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ కేంద్రంగా కోట్లు విలువచేసే కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. కలప మాఫియా అరాచకానికి జిల్లాలో ఇప్పటికే లక్షల ఎకరాల్లో అడవులు మాయమయ్యాయి! ఈ మధ్య మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ మీదుగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు ప్రతిరోజూ రూ.లక్షలు విలువ చేసే కలపను నగరాలకు తరలిస్తున్నారు. కళ్ల ముందే ఈ దందా కొనసాగుతున్నా.. అటవీ శాఖ చేష్టలుడి గిచూస్తోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆకుపచ్చ తెలంగాణను కాంక్షిస్తూ హరితహారాన్ని ఉద్యమంగా చేపడుతుంటే.. మరోవైపు స్మగ్లర్లు ఉన్న అడవులను ఇలా హాంఫట్ చేస్తున్నారు! పరిస్థితి ఇలాగే కొనసాగితే అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్‌కు ఇకపై ఆ పేరు ప్రశ్నార్థకం కానుంది. ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సాగుతున్న ఈ స్మగ్లింగ్‌పై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
కాదేదీ రవాణాకు అనర్హం!
ఒక్క వాయుమార్గం మినహా స్మగ్లర్లు అన్ని మార్గాల్లో కలపను తరలిస్తున్నారు. రోడ్డు, రైలు మార్గాలనే కాదు.. జల మార్గాన్ని తమ దందాకు రాచమార్గంగా వాడుకుంటున్నారు.
ఇదిగో రోడ్డు మార్గం..
రోడ్డు మార్గం ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కలప తరలిపోతోంది. పలుచోట్ల అటవీ శాఖ చెక్‌పోస్టుల్లో పనిచేసే సిబ్బందికి, కొందరు అధికారులకు తెలిసినా కళ్లు మూసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఇచ్చోడ అటవీ ప్రాంతాల నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్, నిజామాబాద్‌కు నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో కలప అక్రమ రవాణా అవుతోంది. ఖానాపూర్, కడెం, జన్నారం ప్రాం తాల నుంచి కలప దుంగలను పొన్కల్, మందఇప్ప, గొడల్‌పంపు, చింతల్‌చాంద, మున్‌పల్లి, కూచన్‌పల్లి, పీచర, వెంకటాపూర్ రేవుల ద్వారా గోదావరిని దాటించి కరీంనగర్, నిజామాబాద్ తరలిస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్, చెన్నూరు కేంద్రాలుగా రాజీవ్ రహదారిపై ఈ కలప వాహనాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్తున్నాయి. కరీంనగర్ వెస్ట్ డివిజన్‌లో సుమారు వంద వరకు, నిజామాబాద్ పాత నగరంలో 20కిపైగా సా మిల్లులు, టింబర్ డిపోలున్నాయి. వీటిలో అత్యధికం ఈ అక్రమ కలపతోనే నడుస్తున్నాయి.
స్మగ్లింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది..?
అటవీ శాఖ లెక్కల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా 16.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 40 శాతం అంటే 7.16 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. జిల్లాలో మొత్తం 1,610 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినా 16 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నట్లు తేల్చారు. బీట్ల వారీగా చూస్తే.. ఉట్నూర్ రేంజ్‌లోని శ్యాంపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి రేంజ్‌లోని వాయిపేట్, పెంబీ రేంజ్, మామడ, ఖానాపూర్, కడెం రేంజ్‌ల పరిధిలో కొంత భాగం, తాళ్లపేట్, నీల్వాయి, కోటపల్లి రేంజ్‌లు, తిర్యాణి రేంజ్‌లోని మంగీ అటవీ ప్రాంతం, కర్జెల్లి రేంజ్‌లోని కౌటాల, గూడెం, డింబ, బెజ్జూరు రేంజ్‌లోని మాలిని, పాపన్నపేట అటవీ ప్రాంతాల్లో అడవి నరికివేత, స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు.
జలమార్గం ఇలా..
ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి, కొటపల్లి వంటి మండలాల పరిధిలో, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నరికిన కలప దుంగలను బల్లకట్టుగా తయారు చేస్తారు. వాటిని ప్రాణహిత నదిలో దిగువకు వదులుతారు. నాణ్యమైన టేకు కలపకు నీటిలో తేలే గుణం ఉంటుంది. ఈ బల్లకట్టు దుంగలు చెన్నూరు ప్రాంతంలో గోదావరిలో కలుస్తున్నాయి. అక్కడ్నుంచి కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని దమ్మూరు వంటి దట్టమైన అటవీప్రాంతం ఉన్న నదీపరివాహక గ్రామాల దాకా వస్తుంటాయి. అక్కడ వీటిని నదిలోంచి బయటకు తీసి లారీల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ వంటి నగరాలకు తరలిస్తున్నారు. ఒక్క జలమార్గం ద్వారానే నెలకు సుమారు రూ.కోటికిపైగా విలువ చేసే కలప అక్రమ రవాణా అవుతోంది. మంథనికి చెందిన ఓ బడా కలప వ్యాపారి కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే ఈ వ్యాపారి.. మూడు రాష్ట్రాల్లోని అటవీ, పోలీసు శాఖలకు చెందిన కొందరు అధికారుల చేతులను మామూళ్లతో కట్టేస్తారనే ఆరోపణలున్నాయి.
రైళ్లలో తరలుతోందిలా
కొందరు రైల్వే సిబ్బంది సహకారంతో దుంగల రవాణా సాగుతోంది. గూడ్స్ రైళ్లలో దుంగలు మహారాష్ట్ర నుంచి వరంగల్, విజయవాడ వంటి ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. ముఖ్యంగా కాగజ్‌నగర్-మంచిర్యాల-వరంగల్ రైలు మార్గం ద్వారా ఈ రవాణా జరుగుతోంది.
ఫర్నిచర్ రూపంలోనూ..
టేకు దుంగలను ఫర్నిచర్‌గా తయారు చేసి కూడా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు కొన్ని సరుకు రవాణా చేసే ట్రాన్స్‌పోర్టు, పార్సిల్ సర్వీసు వాహనాలను వాడుకుంటున్నారు. మంచిర్యాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ట్రాన్స్‌పోర్టులో ఫర్నిచర్ రూపంలో కలప రవాణా అవుతోంది.
ఈ ముల్తానీలు.. స్మగ్లింగ్‌లో పావులు!
కలప అక్రమ రవాణాలో స్మగ్లర్లు ముల్తానీలను పావులుగా వాడుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఈ ముల్తానీలు బ్రిటిష్ కాలంలో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, జోగిపేట్, ఎల్లమ్మగూడ తదితర గ్రామాలతోపాటు, మహారాష్ట్రలోని చిక్లి వంటి ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా కలప స్మగ్లింగే ప్రధాన వృత్తి. ఈ ముల్తానీ బృందాలు రాత్రికి రాత్రి చెట్లు నరికేసి, ఎడ్ల బండ్లపై దుంగలను జాతీయ రహదారి వరకు తరలిస్తుంటాయి. కేవలం పావుగంటలోనే లారీల్లో కలపను లోడ్ చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఈ లారీలను నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని సా మిల్లులు, ప్రైవేటు కలప డిపోలకు తరలిస్తారు. అడ్డొచ్చిన అటవీ శాఖ అధికారులపై దాడులకు దిగేందుకు కూడా వెనుకాడరు. నిరుపేదలైన వీరిని స్మగ్లర్లు తమ దందాకు పావులుగా వాడుకుంటున్నారు. వీరు ఈ వృత్తి మానుకునేలా అటవీ శాఖ గతంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఆశించిన ఫలితాలివ్వలేదు.
మహారాష్ట్ర నుంచి తరలిస్తుండగా చెన్నూర్‌లో స్వాధీనం చేసుకున్న కలప (ఫైల్)